వీధిలో ‘రాజయ్య’- ఇంట్లో ‘మామయ్య’

caricature: balaram

caricature: balaram

పేరు : సిరిసిల్ల రాజయ్య

దరఖాస్తు చేయు ఉద్యోగం: నష్ట జాతకుడు ( వరంగల్‌ పార్లమెంటు సీటు ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ తరపున నామినేషన్‌ వేసి కూడా ఉపసంహరణకు ముందే పోటీలోనుంచి తప్పుకోవాల్సి వచ్చిన అభ్యర్థిని ఏమంటారు?)

వయసు : షష్టి పూర్తి చేసుకుని రెండేళ్ళ అయ్యింది. అయితే మాత్రం ఇప్పుడే కాలేజీలో చేరిన కుర్రవాడి స్పిరిట్‌ మనకుంటుంది. ( అందుకే కదా, న్యూ యియర్‌ పార్టీలో ‘కాలేజీ పోరగాల్ల లెక్క చిందులేసిన’. మనస్టెప్పులు చూస్తే పడి పోవాల్సిందే. అఫ్‌ కోర్స్‌ రాజకీయాల్లో నేను వేసిన రాంగ్‌ స్టెప్స్‌కు నేనే పడిపోయాను. అది వేరే విషయం.)

ముద్దు పే’ర్లు :ఇల్లు గుల్ల’ రాజయ్య.( అవును. నా కొంప గుల్లయింది. కోడలు సారిక, ముగ్గురు మనవలూ చనిపోయారు. నా కొడుకు అనిల్‌ , భార్య మాధవి మీద కేసులు నమోదు చేశారు. ఎంత దు:ఖమో చెప్పండి. నేను కన్నీరు మున్నీరు గా విలపించినట్లు టీవీలో కూడా వచ్చింది. అయినా కొందరు నమ్మటం లేదు. అదేమిటో, కర్నూలు లో విచిత్ర వేషాలు వేసే ‘బంగి అనంతయ్యా’, వరంగల్‌లో నేనూ ఏడ్చినా, నిజమైన ఏడ్పు అనుకోరు. ఇది దారుణం కదా!) ‘ఇంట్లో మామయ్య- వీధిలో రాజయ్య’ ( వీధిలో రాజకీయ నాయకుణ్ణే కావచ్చు. కానీ ఎంత కాదన్నా ఇంట్లో కోడలి పాలిట మామయ్యనే కదా! నా భార్య అత్తయ్యే కదా! ఆ మాత్రం అర్థం చేసుకో లేక పోయింది నా కోడలు. అత్తలేమి చేస్తారో ఆమె కూడా అదే చేసింది.)

‘విద్యార్హతలు :వ్యవసాయం చేయటంలో అగ్రికల్చర్‌ యూనివర్శిటీ నుంచి పట్టా పుచ్చుకున్నాను. కలుపు మొక్కలనుంచి పంట మొక్కల్ని ఎలా వేరు చేయాలో నేర్చుకున్నాను. కానీ అంతిమంగా ఏరి పారెయ్యాల్సింది పంట మొక్కల్నా? కలుపు మొక్కల్నా? ఈ ఒక్క పాఠం మిస్సయ్యాను. అందుకే మా ఇంటి పెరట్లో ఏం జరిగిందో అంతా కన్ఫ్యూజన్‌ గా వుంది.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: డప్పు కొట్టి చెబుతాను. ( నా నియోజకం వర్గంలో నేను చేసిందాని గురించి. కానీ నా శత్రువులు ఇప్పుడు డప్పు కొడుతున్నారు. నా ఇంట్లో జరిగిన దాని గురించి. నీతి: ఎవరి డప్పు వారు కొట్టుకో కూడదు.)

రెండు: చిందులు తొక్కుతాను.( నాకు అన్యాయం జరిగితే…! ఇప్పుడు నా ఇంటి ముందుకు వచ్చి, హక్కులు సంఘాల వాళ్ళూ, మహిళా సంఘాల వాళ్ళూ చిందులు తొక్కుతున్నారు. నా కోడలికి అన్యాయం నేను అన్యాయం చేశానంటూ. నీతి: ఆడటమంటే, చిందులు తొక్కటం కాదు.)

సిధ్ధాంతం :ఇంట గెలిచి, రచ్చ గెలవ మన్నారు. ఇంత కన్నా గొప్ప సిధ్ధాంతమేదీ నాకిప్పుడు అనిపించటం లేదు.

వృత్తి : గొప్ప గొప్ప వాళ్ళందరూ జైళ్ళలో జీవిత చరిత్రలు రాసేవారు. నాకు ఆ అవకాశం వచ్చేలా లేదు. ( ఎందుకంటే, ఇప్పటికే నా జీవిత చరిత్రను మీడియా వారు బొమ్మకట్టి చూపించారు.)

హాబీలు :1.పిల్లల్నిని బాధ్యతగా పెంచటం. ( నా కొడుకు అనిల్‌ను అలాగే పెంచాను. అందుకే ప్రేమించి తన కిష్టమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కానీ వేధించాడంటున్నారు; ఇంకొకామెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటున్నారు. వాడికి అన్నీ నా పోలికలే వచ్చాయి కదా! ఇది ఎలా జరిగిందీ..?)

2. విధేయత. ( పార్టీ హైకమాండ్‌ కే కాదు, రాష్ట్రంలో హైకమాండ్‌ ల కింద పనిచేసే మిడిల్‌ కమాండ్‌లకీ, వారి కింద పనిచేసే లోకమాండ్‌లకీ పరమ విధేయుణ్ణి. అలాంటి నేను ఇంట్లో అవిధేయంగా వుంటానా? నా కోడలు అపార్థం చేసుకుని అనవసరంగా పార్టీ హైకమాండ్‌కు మెయిల్‌ పెట్టినట్లుంది.)

అనుభవం : ఇల్లే తనకు జైలుగా మారిందని ఫిర్యాదు చేసింది నా కోడలు; కానీ జైలునే ఇల్లుగా చేసుకోవాల్సిన అగత్యం వచ్చింది మాకు.

మిత్రులు : ఇలాంటి టైమ్‌లో వున్నా కనపడరు.

శత్రువులు : ఇప్పుడు మా ఇంటి చుట్టూ వారే.

మిత్రశత్రువులు :గోతి కాడ నక్కలు.( ఈ మాట ఎవరినీ ఉద్దేశించి కాదు. ఇప్పటికే కేసుల్లో మునిగి వున్నాను.)

వేదాంతం : వోడలు బళ్ళవుతాయి. బళ్ళు వోడలవుతాయి. అభ్యర్థులు ముద్దాయిలవుతారు; ముద్దాయిలు అభ్యర్థులు అవుతారు.

జీవిత ధ్యేయం : తప్పు దిద్దుకోవటానికి అవకాశమిస్తే, మరోసారి నా కొడుకుని ప్రేమించి పెళ్ళిచేసుకోమని సలహా ఇచ్చి, అలా వచ్చిన నా కోడల్ని, నా కూతురు లెక్క చూసుకుంటాను

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 7-13 నవంబరు 2015 సంచికలో ప్రచురితం.)

1 comment for “వీధిలో ‘రాజయ్య’- ఇంట్లో ‘మామయ్య’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *