వ్యాపారం వద్దురా! రాజకీయం ముద్దురా!!

నాటి అల్లుడు ఫిరోజ్‌ వద్దన్నదీ,

నేటి అల్లుడు వద్రా చేస్తున్నదీ ఒక్కటే!

 రాచరికం ఒక దుర్వ్యసనం! ఎవరికీ..? రాజుకి కాదు, ప్రజలకి.

ప్రజాస్వామ్యం వచ్చేసినా సరే- ఊరేగించటానికో, ఆరాధించటానికో ఒక రాజు వుంటే బాగుండునని అనిపిస్తుంది.

బ్రిటన్‌ లో చూడండి. ఎప్పుడో ప్రజాస్వామ్యం వచ్చేసింది. ప్రధానిని ఎంచక్కా వోట్లేసే ఎన్నుకుంటారు. అయినా వారికి ఓ రాచరికం అవసరమయింది. రాజు లేక పోతే రాణి. ఇప్పుడు రాణి వున్నారు కదా! పేరుకు మాత్రమే కావచ్చు. కానీ ఆ దేశ ప్రజలు తమ సొంత ఖర్చుల మీద ఈ రాచకుటుంబాన్ని పోషించుకుంటూ, తిరునాళ్ళకు వెళ్ళినట్టు వాళ్ళ సంబరాలని చూడటానికి వెళ్తుంటారు. అంతేకాదు అంత:పురాలు దాటి వచ్చిన ప్రేమ కలాపాల మీద మురిపెంగా గుసగుసలాడుకుంటారు.

మరి, మనకి రాచకుటుంబం లేకుండా పోయింది. కానీ బ్రిటన్‌ కన్నా ఎన్నో శతాబ్దాల వెనకబడ్డ దేశం మనది. పారిశ్రామిక విప్లవం పుట్టిన గడ్డ మీదనే అంత రాజ భక్తి వుంటే, ఇంకా వ్యవసాయ సంబంధాలతోనే వుండిపోయాం. అలాంటిది- రాజ భక్తి లేకుండా వుండగలమా?

వెనకటి ఎవరో అన్నారు- దేవుడు లేక పోతే ఎలా-అని? ఉంటే సరే. లేక పోతే ఏం చెయ్యాలి? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించుకోవాలి!!

మనదేశంలో దేవుళ్ళకు లోటు లేదు. స్వరాజ్యం వచ్చాక రాజుకు లోటు వచ్చింది. వెంటనే ఎవర్నో ఒకర్ని రాజుగా చేసుకుని, అతని కుటుంబాన్ని రాజకుటుంబంగా మార్చుకోవాలి.

అలా సమయానికి దొరికిన వ్యక్తే నెహ్రూ. ఆయననుంచి మొదలయి, ఇప్పటి వరకూ నెహ్రూ-గాంధీ కుటుంబం ‘అప్రకటిత రాజకుటుంబం’ అయిపోయింది. ఎన్నో ముచ్చట్లు, ఎన్నో ఆరోపణలు.

బ్రిటన్‌లో రాజకుటుంబానికి కేవలం ‘గౌరవం’ మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. కానీ, మనం ‘గౌరవమూ’, ‘అధికారమూ’ రెండూ ఇచ్చేశాం. అయితే ‘సంకీర్ణ రాజకీయాల’ పుణ్యమా- అని అధికారాన్ని పరిమితం చేసినా, గౌరవం మాత్రం- అలాగే వుండిపోయింది.

అయితే, ఈ ‘భక్తి’ కారణంగా, ఆ కుటుంబానికి ‘గొప్ప గొప్ప లక్షణాలన్నీ’ ఆపాదించేస్తూ వుంటారు.

నెహ్రూ కుటుంబాన్ని త్యాగానికి సంకేతంగా- వాడుతుంటారు.

అందుకు తగ్గట్టుగా, నెహ్రూకు ఎలాగూ స్వాతంత్య్రోద్యమంలో జైలు జీవితం-వగైరాలున్నాయి.

నెహ్రూ కుమార్తెను ఇందిరమ్మను సిక్కు తీవ్రవాదులు చంపారు.

ఇందిరమ్మ కొడుకు రాజీవ్‌ గాంధీని తమిళ తీవ్రవాదులు చంపారు.

ఈ ఘాతుకాల వెనుక ఇందిర, రాజీవ్‌ ‘కవ్వింపు చర్యలు’ వున్నాయని కొందరంటారు. వాటిని పక్కన పెడితే, ఇవన్నీ ‘త్యాగాల జాబితా’ల్లోకే చేరిపోయాయి.

ఫలితంగా కూడా, ఈ కుటుంబ పట్ల ‘రాజభక్తి’ కొనసాగుతూ వచ్చింది.

ఒక్కొక్క సారి భక్తి వల్ల దేవుళ్ళకు కూడా కష్టాలు వస్తున్నట్లు పురాణాల్లో చదువుతాం. దేశ ప్రజల వల్ల అప్పుడప్పుడూ నెహ్రూ కుటుంబ సభ్యులకు కూడా కష్టాలు వస్తుంటాయి.

ఆ కుటుంబ సభ్యులుగా వున్న వారందరూ ఒకే వృత్తి చేయాలనుకుంటారు: అదే ‘రాజకీయం’.

అది కాకుండా ‘వ్యాపారం’ చేస్తానంటే- విసుగ్గా వుంటుంది.

కానీ ఈ కుటుంబంలోకి అల్లుడిగా ( రాజీవ్‌, సోనియాల కూతురు ప్రియాంక గాంధీకి భర్తగా) వచ్చిన రాబర్ట్‌ వద్రా తాను వ్యాపారమే చేస్తానన్నారు. అప్పుడే ‘రాజకుటుంబానికి’ వ్యతిరేకంగా వెళ్ళినట్లు జనం భావించారు. అందుకే రాజకుటుంబంలో సోనియా, రాహుల్‌ , ప్రియాంకలకు ఇచ్చిన గుర్తింపూ, గౌరవం ఎప్పుడూ వద్రా కు రాలేదు.

దానికి తోడు రు50 లక్షల వ్యాపారంలోకి, డిఎల్‌ఎఫ్‌ అనే ఒక కనస్ట్రక్షన్‌ కంపెనీ, ‘డ్వాక్రా’ రుణం ఇచ్చినట్టు రూపాయి వడ్డీ లేకుండా రు.60 కోట్ల రుణం ఇచ్చిందంటే.. ఎలా వుంటుంది? జనానికి కోపం రాదూ…?

నెహ్రూ కుటుంబానికి ఎప్పుడూ ‘అల్లుళ్ళ’నుంచి తల నొప్పులు వస్తున్నాయి.

కాస్త ముందు తరంలో ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్‌ గాంధీ నుంచి వచ్చాయి.

ఇప్పుడు కొత్తగా రాబర్ట్‌ వద్రా నుంచి వస్తున్నాయి.

అయితే ఆ తలనొప్పులు వేరు. ఈ తల నొప్పులు వేరు.

నెహ్రూ అవినీతిని సమర్థిస్తున్నారని చట్ట సభలో ధ్వజమెత్తారు అప్పటి అల్లుడు ఫిరోజ్‌ గాంధీ.

తనే అవినీతి ఆరోపణల్లో ఇరుక్కొన్నారు ఇప్పటి అల్లుడు రాబర్ట్‌ వద్రా.

 

ఏమిటీ? నెహ్రూ కాలంలో అవినీతి ఆరోపణలు లేవనా? అప్పటి బడా వ్యాపారులకీ, రాజకీయనేతలకీ మధ్య ‘అపేక్షించదగ్గ’ సంబధాలు వుండేవి కావా?

ఇప్పుడు ఈ సంబంధాల మీద ఒక మాజీ ‘ఐఆర్‌ఎస్‌’ అధికారి కేజ్రీవాల్‌ ధ్వజమెత్తితే, అప్పుడు నేరుగా ఫిరోజ్‌ గాంధీయే విరుచుకుపడ్డారు. ఈ వైఖరి నెహ్రూతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా నచ్చలేదు. అందుకే అందరూ ఫిరోజ్‌ గాంధీని దూరం పెట్టారు.

కానీ ఇప్పుడు అవినీతి ఆరోపణల మధ్య ఇరుక్కున్న రాబర్ట్‌ వద్రాను రక్షించటానికి ఇదే నెహ్రూ కుటుంబం( సోనియా తదితరులు) నేరుగా కాకపోయినా, మొత్తం కాంగ్రెస్‌ పెద్దలందరి చేతా ప్రయత్నాలు జరుపుతోంది. ప్రతి విమర్శలు గుప్పిస్తోంది.

అంటే, నెహ్రూ కుటుంబంలోకి అవినీతిని శోధించే అల్లుడు పోయి, అవినీతి లో ఇరుక్కున్న అల్లుడు వచ్చాడు.

 

నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ గురించి పదే పదే లెక్చర్లు దంచేవాళ్లంతా, ఫిరోజ్‌ ప్రస్తావన కూడా పొరపాటున తేరు. మంచీ చర్చించరు. చెడూ చర్చించరు. అలా చర్చించటం – నాటి ఎఐసిసి అధ్యక్షురాలు ఇందిర నుంచి, నేటి కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీ వరకూ- ఎవరికీ నచ్చదు. ఫిరోజ్‌ తొలుత ఎన్నికయిన, రాయబరెలీ (ఉత్తరప్రదేశ్‌) నియోజక వర్గం నుంచే వీరు పారంపర్యంగా ఎన్నికవుతూ వస్తున్నా సరే, ఆయన్ని తలవనే తలవరు. ఇందిరకీ, ఫిరోజ్‌ కీ వ్యక్తిగత స్థాయిలో విభేదాలు వుండవచ్చు. ఒక నేతగా ఆయన కంటూ, ఒక ప్రత్యేక వ్యక్తిత్వం వుంది. ఒక లక్ష్యం కోసం తన వాళ్ళనే తప్పు పట్టిన నేపథ్యం వుంది.

స్వరాజ్యం తర్వాత, దేశంలో పలు బడావ్యాపార సంస్థలు, రాజకీయ నాయకులకు దగ్గరయ్యారు. పలు రకాలుగా ప్రజాధనంతో తమ సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. అందుకోసం అర్ధిక అక్రమాలకు ఒడిగట్టారు. 1955లో అప్పటి పార్లమెంటు సభ్యుడుగా వున్నప్పుడు ఒక బ్యాంకుకూ, బీమా కంపెనీకు చైర్మన్‌ గా వుంటూ, ఆ కంపెనీలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని రామకృష్ణ దాల్మియా ఒక ప్రచురణ సంస్థను రామ కృష్ణ దాల్మియా కొనుగోలు చేశారని ఫిరోజ్‌ అభియోగం మోపారు. ఇందుకోసం చట్ట విరుధ్ధంగా డబ్బును వాటినుంచి ఈ కంపెనీలకు బదిలీ చేశారని ఆరోపించారు. అలాగే 1958లో ప్రభుత్వ అధీనంలో వున్న జీవితా బీమా కంపెనీ లో జరిగిన (హరిదాస్‌ ముంద్రా)కుంభకోణాన్ని పార్లమెంటు ముందు పెట్టారు. అంతవరకూ ‘స్వఛ్చత’ చిహ్నంగా వున్న నెహ్రూ ప్రభుత్వానికి ముచ్చెమట్లు పోశాయి. ఫలితంగా తన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా వున్న టి.టి.కృష్ణమాచారి చేత రాజీనామా చేయంచటం నెహ్రూకు తప్పింది కాదు. ఇలా దేశ సంపద ను అతి కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పోకుండా వుండేందుకు గాను, కీలకమైన సంస్థలను జాతీయం చేయాలన్న నినాదాన్ని ఇందిర కన్నా ముందే ఫిరోజ్‌ ఇచ్చారు. అంతే కాదు. తాను పార్శీ అయి వుండి కూడా, సాటి పార్శీ టాటా నడుపుతున్న ‘టాటా ఇంజినీరింగ్‌ అండ్‌ లోకోమోటివ్‌ కంపెనీ(టెల్కో)ను జాతీయం చెయ్యాలని ఫిరోజ్‌ పట్టుపట్టారు. జపాను రైలు ఇంజను కన్నా , ఈ కంపెనీ తయారు చేస్తున్న రైలు ఇంజను ధర రెట్టింపు వుందనీ, భారతీయ రైల్వే టాటా ఇంజన్లు కొనటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనీ విరుచుకు పడ్డారు. అప్పుడు దేశంలో పార్శీ ప్రముఖులందరూ అందరూ ఆందోళన చెందారు.

అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. అప్పుడు రాజకీయనాయకులను ఉపయోగించుకుని, వ్యాపారులే తమ సామ్రాజ్యాలను విస్తరింప చేసుకునే వారు. కానీ. ఇప్పుడు అలా కాదు. రెండు పాత్రలూ ఒకరే పోషిస్తున్నారు. రాజకీయనాయకులే వ్యాపారస్తులు అవుతున్నారు. అయితే ఏ రాజకీయ కుటుంబంలో ఈ వ్యాపార వృత్తి చేపట్టినా జనం పట్టించుకునే వారు కారు. కానీ తాము ‘రాజ కుటుంబం’ గా భావించే నెహ్రూ కుటుంబంలో ‘వ్యాపారం’ అంటే వారికి జీర్ణం కావటం లేదు. మళ్ళీ ఆ వ్యాపారం కోసం- అడ్డదారులంటే వారికి ఇంకా చికాకుగా వుంటుంది.

అందుకే అప్పటి అల్లుడు ఫిరోజ్‌ వీటి మీద ధ్వజమెత్తినప్పుడు, ఆ ఆరోపణలతో ప్రత్యక్షంగా నెహ్రూకు ఎలాంటి సంబంధమూ లేక పోయినా,నెహ్రూ ప్రభుత్వ పరోక్ష సాయం వల్లనే, ‘అక్రమాలు’ జరుగుతున్నాయంటేనే ఇబ్బంది అయింది. అందుకే నెహ్రూ తన సఛ్చీలతను నిరూపించుకోవటానికి ఆర్థిక మంత్రిని బలి పెట్టాల్సి వచ్చింది.

ఇప్పుడు కూడా రాబర్ట్‌ వద్రా కోసం, యుపీయే చైర్‌పర్సన్‌ ఆర్థిక మంత్రినే వేరే రకంగా ‘బలి’ పెడుతున్నారు. దీనిని పూర్తిగా వద్రా వ్యాపార అంశంగా చూడాలని, ఇందులో అక్రమాలు ఏమీ లేవని ఇప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంతోనే చెప్పించారు.. ఇది ‘బలి’ కాదూ..!

అప్పటి అల్లుడు ఫిరోజ్‌ కూ, ఇప్పటి అల్లుడు రాబర్ట్‌ వద్రాకూ- పోలిక ఏదయిన వుందా? ఈ ‘రాచకుటుంబాన్ని’ ఉపయోగించుకుని మూడేళ్ళు తిరక్కుండా, రు. 50 లక్షల టర్నోవర్‌ వున్న వ్యాపారాన్ని రు.300 కోట్లకు పెెంచుకున్న అల్లుడూ, తన స్వంతాన్ని లెక్క చెయ్యకుండా ‘అవినీతి’ మీద ధ్వజమెత్తేటప్పుడు సొంత మామ(నెహ్రూ) ప్రభుత్వాన్నీ, సొంత మతాన్నీ(పార్శీ) పక్కన పెట్టిన అల్లుడూ ఒక్కరేనా?

నిజానికి నాడు ఫిరోజ్‌ పోషించిన పాత్రనే నేడు కేజ్రీవాల్‌ లాంటి వారు పోషిస్తున్నారు. కానీ నేడు వద్రా మాత్రం రాజకీయ కుటుంబంలో ‘అత్యాశ’ వున్న వ్యాపారి పాత్ర పోషిస్తున్నారు. కొన్నాళ్ళు పోతే వద్రా రాజీకీయాల్లోకి రావచ్చు. 2009 ఎన్నికలలోనే తనను పోటీ చేయమని వత్తిడి వచ్చిందని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో కాస్త బడాయి గానే చెప్పుకున్నారు. అంటే వీలు చూసుకుని రాజకీయ ప్రవేశం చేయటానికి కూడా అవకాశం వుంది. ఆయన చేయక పోయినా, ప్రియాంక కుండే అవకాశాలు వుండనే వున్నాయి. ఇప్పటి వరకూ ప్రచారానికి పరిమితమయిన ప్రియాంక, ఒక వేళ సోదరుడు రాహుల్‌ విజయవంతంకాని పక్షంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించ వచ్చు కూడా.

అంటే అప్పుడు ఈయన పాత్ర ఎలా వుండబోతుందన్నది కేజ్రీవాలే కాదు, సాధారణ పౌరుడు కూడా ఊహించుకోవచ్చు.

వాణిజ్య సామ్రాజ్యాన్ని కేవలం వాణిజ్య కౌశలంతోనే విస్తరిస్తే అందరూ హర్షిస్తారు. గౌరవిస్తారు. రాజకీయ పలుకుబడితో నేతలు ఇతరుల వ్యాపారాభివృధ్ధికి దోహదపడటమూ, లేదా తమ సొంత వ్యాపారాలు పెంచుకోవటమూ- ప్రజాస్వామ్యానికి ఎప్పటికయనా ప్రమాదమే!!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 12-18 వ సంచికలో కవర్ స్టోరీగా ప్రచురితమయినది)

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply