సంకీర్ణాన్ని మోడీ తుడిచేస్తారా?

modi1రాజ్యం తర్వాత రాజ్యాన్ని కైవసం చేసుకుంటూ వెళ్ళే దండయాత్రలాగా, నరేంద్రమోడీ-అమిత్‌ షాలు రాష్ట్రాన్ని తర్వాత రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ వెళ్తున్నారు. మహారాష్ట్ర, హర్యానాలు ముగిసాయి; ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్‌, జార్ఖండ్‌లు, వెను వెంటనే ఢిల్లీ. మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 22 సీట్లు తక్కువ వచ్చినా, హర్యానాలో సంపూర్ణమైన మెజారిటీయే వీరి నేతృత్వంలో బీజేపీ సాధించింది. రెండు చోట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచీ ‘మోడీ-షా’లు రాజకీయంగా ఒక సందేశాన్ని దేశమంతటా పంపిస్తున్నారు: ‘సంకీర్ణయుగం ముగిసింది’. ఈ సందేశాన్ని ముందు వారు ‘మనోవాక్కాయ కర్మణా’ నమ్మాలి.

‘మహా’సంశయం వదిలిందా?

Fadnavisనమ్మటానికి వీలయినన్ని ఏర్పాట్లూ చేసేసుకున్నారు. ఎన్నికలకు ముందే, సంకీర్ణ భాగస్వాములుగా వున్న మహరాష్ట్రలోని శివసేనతోనూ, హర్యానాలోని హర్యానా జనహిత్‌ కాంగ్రెస్‌తోనూ తెగతెంపులు బీజేపీ తెగతెంపులు చేసేసుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈ నమ్మకాన్ని సడలనివ్వలేదు. హర్యానాలో ఎలాగూ స్పష్టమైన మెజారిటీ వచ్చింది కాబట్టి, ఈ నమ్మకం మరింత బలపడింది. కానీ మహారాష్ట్రలోనే కాస్త ఇబ్బంది అయ్యింది. స్పష్టమైన మెజారిటీ 144 సీట్లు( మొత్తం 287) తెచ్చుకోలేక పోయంది. అయితే తక్కువ పడిన ఈ మేరకు శివసేన నుంచే తీసుకోవాలి. అందుకు శివసేన ముందు ఎన్నో షరతులు పెట్టినా, తర్వాత ఒక్కొక్క షరతూ వదలుకుంటూ వచ్చింది. కడకు స్పీకర్‌ పోస్టును కూడా అడగలేక పోయింది. ఇక ఎన్సీపీ, ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వటానికి సిధ్ధమయ్యింది. అయితే ఎన్నికల్లో బాగా తిట్టిపోసిన ఎన్సీపీ మద్దతును ఎలా తీసుకోవాలి- అన్నది పెద్దసమస్యే. అంతిమంగా బీజేపీ వ్యూహ కర్తలు (బహుశా మోడీ-షాలు కావచ్చు) ఒక నిర్ణయానికి వచ్చారు. శివసేన ఎలా కలుపుకున్నా, ఏర్పాటే ప్రభుత్వం ‘సంకీర్ణం’ కిందే వుంటుంది. ‘సంకీర్ణం’ పోయిందని చెప్పటమే బీజేపీ ప్రధాన రాజకీయ ఎజెండా అయినప్పుడు, ఆ అవకాశం ఇస్తుందా? అలాగని ఎన్సీపీ మద్దతును తీసేసుకుంటే, ‘అవినీతి ముద్ర పడిన పార్టీతో’ చేతులు కలిపారన్న అపప్రద వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం పై జరిగే బలపరీక్షలో, ఎన్సీపీ మద్దతే తీసుకోవాలి కానీ, తీసుకున్నట్టు కనిపించ కూడదు. అందుకనే కాబోలు తాజాగా స్పీకరయిన బీజేపీ సభ్యుడు, మూజువాణి వోటు(వాయిస్‌ వోటు)ను ఆశ్రయించారు. ‘అవును’ అని ఎక్కువమందే అన్నారు- అని దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిందని ప్రకటించేశారు. అంటే ఎక్కడా ఎన్సీపీ మద్దతును తీసుకున్నట్టు రికార్డు కాలేదు. అనుకూల, వ్యతిరేక వోట్లు లెక్కించే పద్ధతిని అనుసరించాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా, స్పీకర్‌ వారి మాటల్ని పెడచెవిన పెట్టారు. అంటే అక్కడ వున్నది ‘హంగ్‌ అసెంబ్లీ’ కాదు, ఏర్పడింది ‘సంకీర్ణ ప్రభుత్వం’ కాదు- అని లోకానికి చాటి చెప్పాలనే ఈ ప్రయత్నం చేసింది.

‘పచ్చ’ని కాశ్మీరం ‘కాషాయమ‘వుతుందా?

mahaboobaఅలాగే ఇప్పుడు జమ్మూ- కాశ్మీర్‌ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అధికారంలో ‘నేషనల్‌ కాన్ఫరెన్స్‌'( ఎన్సీ)తో కాంగ్రెస్‌ ఎప్పుడో తెగతెంపులు చేసుకుంది. అంటే ఎన్సీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అక్కడ కూడా ఇలాగే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలనీ, ‘సంకీర్ణానికి’ ఇవి రోజులు కావనీ చాటిచెప్పటానికి బీజేపీ ఉవ్విళ్ళూరుతోంది. అక్కడి ఒమర్‌ అబ్దుల్లా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) ప్రభుత్వం కావలసినంత వ్యతిరేకతను మూటకట్టుకుంది. అదీకాక, కాంగ్రెస్‌తో కూడా చాలా ముందే తెగతెంపులు చేసేసుకుంది. ఈ వ్యతిరేకతకు తోడు పదవీకాలం ముగస్తున్న సమయంలో జమ్మూ కాశ్మీర్‌ను మున్నెన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. సచివాలయం దగ్గర్నుంచి కీలకమయిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ జలమయమయ్యాయి. కడకు ముఖ్యమంత్రిగా తాను కూడా వరద బాధితుడయి ‘నా ప్రభుత్వం ఎక్కడ?’ (వేరీజ్‌ మై గవర్న్‌మెంట్‌?) అంటూ ఒమర్‌ అబ్దుల్లా విస్తుబోయారు. సరిగ్గా ఈ విపత్తే, కేంద్రంలో వున్న ఎన్డీయే సర్కారు నెత్తిమీద పాలు పోసింది. మోడీ సర్కారు ఆఘమేఘాల మీద సహాయక చర్యలనందించింది. దాంతో కడకు ఒమర్‌కుకూడా కేంద్రం బాగా చేసిందని ప్రశంసించక తప్పలేదు. ఆ విధంగా బీజేపీకి జమ్మూ కాశ్మీర్‌ మీద వున్న ఆశలు రెట్టింపయ్యాయి. కేవలం ఎన్సీనీ, కాంగ్రెస్‌నీ అయితే, బీజేపీ ఎడమ చేత్తో మట్టికరిపించేది. కానీ అక్కడ మరో బలమైన ప్రత్యామ్నాయం వుంది. ఆ పార్టీ పేరు ‘ప్రాగ్సెసివ్‌ డెమాక్రటిక్‌ పార్టీ'(పీడీపీ). మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని ఈ పార్టీ ఒమర్‌ ప్రభుత్వాన్ని బలమైన ప్రతిపక్షంగా ఎండగట్టింది. ఇప్పుడు బీజేపీ ప్రధానంగా పోటీ పడేది ఈ పార్టీతోనే. ఈ పార్టీ 2014పార్లమెంటు ఎన్నికలలో కూడా మంచి ఫలితాలనే సాధించుకుంది. కొన్ని ప్రీపోల్‌ సర్వేల ప్రకారం పీడీపీయే ముందంజలో వుంది. కానీ తాము ‘మేజిక్‌ ఫిగర్‌’ (44+) ను సాధిస్తామన్న ధీమాతో బీజేపీ వుంది. ఎందుకయినా మంచిదని ఒకప్పుడు వేర్పాటు వాదిగా వుండి, తర్వాత స్వంత కుంపటి( పీపుల్స్‌ కాన్పెరెన్స్‌) పెట్టుకున్న సజ్జర్‌ లోన్‌ తో బీజేపీ సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ ఒక వేళ ఇతర పక్షాల కన్నా ముందంజలో వున్నా, ఎన్నో కొన్ని సీట్లు తక్కువవయితే ఏం చేస్తుంది? మహరాష్ట్రలాగే చేస్తుందా? ఒక జార్ఖండ్‌లో కూడా బీజేపీ ఇదే స్థితిలో వుంది. మొత్తం మీద బీజేపీ సంకీర్ణాన్ని ఎంతగా చీదరించుకుంటుందో, అంతగా అది కాళ్ళకు అడ్డుపడుతోంది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 15-21నవంబరు2014 సంచికలో ప్రచురితం)

Leave a Reply