‘సంఘ్’మా

caricature by Balaram

పేరు : పి.ఎ.సంగ్మా

దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి( గెలవవచ్చు. గెలవక పోవచ్చు. అసలు ఒక గిరిజనుడు ఈ పదవికి నామినేషన్‌ వేయటంతో నే చరిత్ర సృష్టించాను. ఓటమి తప్పదని ఇలా మాట్లాడుతున్నానని అనుకోకండి.)

ముద్దు పేర్లు : ‘సంఘ'(పరివార)మా.( క్రైస్తవమతస్తుడయి వుండి కూడా హిందూత్వ సంఘపరివారం మద్దతుతో నామినేషన్‌ వేశాను. పదవి కోసం సెక్యులరిజాన్ని కాస్సేపు పక్కన పెట్టవచ్చు.) పీయ్యే.( ఎవరికీ పర్సనల్‌ అసిస్టెంట్‌ను కాను. పీయ్యే- అంటే ప్రెసిడెన్షియల్‌ యాస్పిరెంట్‌ అనగా రాష్ట్రపతి ఆశావహుణ్ణి.

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ హార్ట్స్‌( వ్యక్తిగతంగా నేతల హృదయాలను దోచుకున్నాను కానీ, వారి పార్టీల మద్దతుకూడగట్ట లేక పోయాను.)

హోదాలు : ముఖ్యమంత్రి. సభాపతి- అన్నీ చేశాను. కానీ మనదేశంలో అన్ని ప్రధాని, రాష్ట్రపతి హోదాల కన్నా పెద్ద హోదా యుపీయే చైర్‌పర్సన్‌. ఆ హోదా మనకి రాదు. నేనెప్పుడూ ఆశించను కూడా.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: వోటు కోసం ఏ గుమ్మమయినా తొక్కేస్తాను. అది ఇంటి గుమ్మం కావచ్చు. జైలు గుమ్మం కావచ్చు.(చంచల్‌ గుడా జైలు కు రాలేదా? కాకుంటే జగన్‌ దర్శనం కాలేదు. అది వేరే విషయం.)

రెండు: కుడి,ఎడమల విషయంలో పట్టింపులుండవు. ఇప్పుడు ‘రైటిస్టుల'(బీజేపీ) పంచన చేరానా? లేదా?

సిధ్ధాంతం : ముందు అంతర్జాతీయత. భారతీయత, ఇప్పుడు ‘భారతీయ జనతీ’యత. (కాంగ్రెస్‌లో వున్నప్పుడు అంతర్జాతీయతవుండేది. కాంగ్రెస్‌ను ఎదిరించి ఎన్సీపీ ను పెట్టినప్పుడు భారతీయత గుర్తుకొచ్చింది. అందుకే కాంగ్రెస్‌కు ఇటలీ దేశీయు రాలు అధ్యక్షురాలిగా వుండకూడదన్నాను. ఇప్పుడు ఎన్సీపీకి రాజీనామా చేసి, రాష్ట్రపతికి పోటీ చేసేటప్పుడు ‘భారతీయ జనతీ’యత స్ఫురణకు వచ్చి బీజేపీ మద్దతు కోరేసాను.

వృత్తి : ‘జంప్‌ జిలానీ’ల వృత్తే. కాకుంటే మనది లాంగ్‌ జంప్‌ కాదు. హై జంపే. ప్రతీసారి పైపై పదవిలోకే ఎగురుతుంటాను.

హబీలు :1. నిద్రలో కూడా ‘ కూర్చోండి. ముందు మీరు కూర్చోండి’ అంటుంటాను. కొన్నాళ్లు లోక్‌సభ స్పీకర్‌ చేశాను లెండి.

2. ‘గుర్తింపు కోసం ఏమైనా చేస్తాను. ఒక్కొక్కసారి ఓటమి ద్వారా గుర్తింపు వస్తుంది. చూస్తూ వుండండి.

అనుభవం : కాంగ్రెస్‌ ఎన్ని ముక్కలుగా విడిపోయినా కాంగ్రెసే. తృణమూల్‌ కాంగ్రెస్‌ , నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌. ఇంకా ఇలా…! కాంగ్రెస్‌ను తన్ని వెళ్ళినా తుడిచేసుకుని ఆహ్వానిస్తుంది. ఆ భరోసా ఎప్పుడూ వుంటుంది లెండి.

మిత్రులు : ఈ మాట నాకు తెలియదు. నాకిప్పుడు తెలిసిన పదం ‘మద్దతు దారులు’ రాష్ట్రపతి ఎన్నికయ్యాక మిత్రుల గురించి చెప్పగలను.

శత్రువులు : ప్రణబ్‌ ముందు ప్రణమిల్లిన వారంతా.

మిత్రశత్రువులు : నేను వదలి వచ్చిన ఎన్సీపీ పార్టీ వారు.

జీవిత ధ్యేయం : తొలి గిరిజన రాష్ట్రపతి.(ఎప్పటికయినా కాగలనని నమ్మకం.)

-సతీష్ చందర్

 

 

 

 

2 comments for “‘సంఘ్’మా

Leave a Reply