సమరంలో హీరో! ‘ఉప’సమరంలో జీరో!

బీజేపీ పెరుగుతోందా? తరుగుతోందా? పెరిగి తరుగుతోందా? ఈ పార్టీకి ‘సమరం’ అనుకూలించినట్లుగా, ‘ఉప సమరం’ అనుకూలించటంలేదు. ఎన్నికల్లో రెపరపలాడే కాషాయ పతాక, ఉప ఎన్నికల్లో మాత్రం తలవాల్చేస్తోంది. ఇది ఇప్పటి విషయం కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, వెంటనే మొదలయిన ఉపఎన్నికల నుంచీ, ఇదే వరస. అవి పార్లమెంటు స్థానాలకు చెందిన ఉప ఎన్నికలు కావచ్చు; లేక పార్లమెంటు స్థానాలకు చెందిన ఉప ఎన్నికలు కావచ్చు ఫలితం మాత్రం ఒక్కటే.

చిత్రమేమిటంటే, ఒక పక్క 29 రాష్ట్రాలలోనూ, 20 రాష్ట్రాలలో ప్రభుత్వం స్థాపించిన బీజేపీకి ఎదురు లేదని ఎవ్వరయినా భావిస్తారు. కాకుంటే కర్ణాటకలో మాత్రం ఈ మధ్య ఈ పార్టీకి చుక్కెదురయింది. అది వేరే విషయం. ఒక పక్కబీజేపీ ఛత్రం కిందకి రాష్ట్రం తర్వాత, రాష్ట్రం వస్తుంటే, ఈ నాలుగేళ్ళలో లోక్‌ సభస్థానాలు ఒకటి తర్వాత ఒకటి పోతున్నాయి. ఇంతవరకూ ఆరు స్థానాలు పోయాయి. అయితే ఈ ఏడాది మేనెలలో జరిగిన ఉపఎన్నికలలో మరో రెండు స్థానాలు కోల్పోయియంది. దీంతో మొత్తం 543 స్థానాలు వున్న లోక్‌ సభలో, బీజేపీ( భాగస్వామ్య పక్షాల సీట్లు కాకుండా) సంఖ్య 273కు పడిపోయింది. అంటే స్పష్టమైన మెజారిటీకి కేవలం ఒక్క సీటు మాత్రమే ఎక్కువ వుంది.

యోగికి మరో సున్నా

ఈ కోల్పోయిన రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటి ఉత్తరప్రదేశ్‌ నుంచీ, మరొకటి మహరాష్ట్ర నుంచి ఒకటీ వున్నాయి. వీటిలో ఉత్తర ప్రదేశ్‌ లో బీజేపీకి జరిగింది నిజంగా శృంగభంగమే. ఇంకా యూపీ ముఖ్యమంత్రి యోగి ఎంతో కాలంగా ప్రాతినిథ్యం వహించిన గోరఖ్‌ పూర్‌ స్థానం కోలోయి బీజేపీ రెండు నెలల క్రితం షాకు తిన్నది. దాంతో పాటు ఫూల్‌పూర్‌ ను కూడా అప్పుడు కోల్పోయింది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన కైరానా స్థానాన్ని ఇదే రాష్ట్రం నుంచి జారవిడుచుకున్నది. ఇక మహారాష్ట్ర సంగతి సరేసరి. రెండు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే, అందులో ఒకటి(భండారా-గొండియా స్థానం) పోగొట్టుకున్నది. యూపీలో బీజేపీ పైన గెలిచింది అజిత్‌ సింగ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ ఎల్‌డి) అయితే, మహరాష్ట్రలో ఇదే కాషాయ పార్టీని ఓడించింది శరద్‌ పవార్‌ నాయకత్వంలోని ‘నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ( ఎన్‌.సి.పి). ఈ రెండూ ప్రాంతీయ పార్టీలే.

యూపీలో సమాజ్‌ వాదీ పార్టీ( ఎస్పీ), బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లు కలిసి పోటీ చేసినా, లేదా ఇద్దరూ కలిసి ఎవరికయినా మద్దతు ఇచ్చినా వారి గెలుపూ, బీజేపీ ఓటమీ ఖాయమయి పోయింది. ఈ రెండు పక్షాలూ కలసి కైరానాలో ఆర్‌.ఎల్‌.డికి మద్దతు ఇచ్చాయి. పార్టీ నుంచి ముస్లిం మైనారిటీ మహిళా అభ్యర్థి తబుస్సం హసన్‌ ఎన్నికయ్యారు. ఇప్పుడున్న లోక్‌ సభలో ఈమే యూపీ నుంచి ప్రాతినిథ్యం వహించే తొలి ముస్లిం అభ్యర్థి అయ్యారు. ( 2014 ఎన్నికలల్లో యూపీలో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని బరిలో నిలబట్ట లేదు.)

ఇక మహరాష్ట్రలో రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే, అక్కడ బీజేపీ పాల్ఘర్‌ స్థానాన్ని కాపాడుకోగలిగింది కానీ, భండారా-గొండియా సీటును కోల్పోయింది. గెలిచింది కూడా నిన్న మొన్నటి వరకూ భుజం, భుజం రాసుకుని శివసేన పైన. భండారా-గొండియా నుంచి ఎన్సీపీ గెలవటానికి కారణం కూడా, ఎన్సీపీకి కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వటమే.

ఇక ఇదే మే నెలలో మొత్తం 10 రాష్ట్రాలలో 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ గెలిచింది కేవలం ఒక స్థానమే. మిగిలిన వాటిలో కాంగ్రెస్‌ 4 స్థానాలు పొందితే, ప్రాంతీయ పార్టీలు 6 స్థానాలను పొందగలిగాయి. వీటిలో బీహార్‌లో లాలూ స్థాపించిన రాష్ట్రీయ జనతా దళ్‌ వుంది. ఇక్కడ బీజేపీ, నితిష్‌ కుమార్‌ నాయకత్వంలోని జెడి(యు)లు కలసి పోటీచేసినా పరాభవం పాలయ్యాయి.

ఈ ‘ఉఫ’మానం ఇప్పటిది కాదు

అముందు నుంచీ అంతే. ఎన్నికల్లో తెగువ చూపిన బీజేపీ, ఉప ఎన్నికల్లో చతికల బడుతుంది.

అంతెందుకు? 2014లో యూపీలోని 80 అసెంబ్లీ స్థానాల్లో 71 సీట్లను బీజేపీ కైవసం చేసుకోవటం వల్లనే కదా- బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చి, నరేంద్ర మోడీ ప్రధాని కాగలిగారు! అదే రాష్ట్రంలో ఈ ఎన్నికలు జరిగిన కేవలం 4 నెలలకే ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ఇదే రాష్ట్రంలో జరిగిన 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏడు స్థానాల్లో ఓడిపోయింది. సమాజ్‌ వాదీ పార్టీ గెలిచింది. అదే వరవడి నాలుగేళ్ళు గడిచాక కూడా కొనసాగుతోంది.

ఎన్నికల్లో ఘన విజయం- ఉపఎన్నికలలో పరాజయం. ఈ ఫార్ములా ఎవరికయినా వెంటనే కొరుకుడు పడదు. ఇందులో బీజేపీ ప్రమేయం పెద్దగా లేదు. ఉన్నదల్లా బీజేపీ వైరిపక్షాల వైఖరిలోనే. యూపీ అంటే మిని ఇండియా. ఆరాష్ట్రాన్నే తీసుకుంటే, ఎస్పీ, బీఎస్పీలు పాఠాలు నేర్చుకోవు కానీ, గుణ పాఠాలు నేర్చుకుంటాయి. పాఠాలే కనుక నేర్చుకుని వుంటే, ప్రధాన ఎన్నికల ముందే పొత్తుకో, అవగాహనకో వచ్చి వుండేవి. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో కానీ, ఏడాది క్రితం జరిగిన ప్రధాన అసెంబ్లీ ఎన్నికల్లో గానీ రెండూ విడిపోయే పోటీ చేశాయి; ఓడిపోయాయి. ఓటమి తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో కలసి పోటీ చేసి విజయాలు సాధించాయి.

అయితే ఈ ఏడాది మే నెలలో జరిగిన ఉప ఎన్నికలలో ప్రతిపక్షాల ఐక్యతతో పాటు, ఆయా నియోజక వర్గాలలోని సమస్యలు కూడా బాగా ప్రభావితం చేశాయి. కైరానాలో బీజేపీ దివంగత గుజ్జర్‌ నేత హుకుం సింగ్‌ తనయ మృగాంక సింగ్‌ కూతరును బరిలోకి దించాయి. కానీ హుకుం సింగ్‌కు ముస్లింల పై హిందువులక విద్వేషాన్ని కలిగించే ప్రచారం చేసిన నేపథ్యం వుంది. అలాగే మహారాష్ట్రలో అసలు రైతుల సమస్యల పై పరిష్కారం చూపటం లేదన్న నిరసనతో ఉన్న బీజేపీ ఎంపీ రాజీనామా చెయ్యటం వల్లనే ఈ ఉప ఎన్నిక ఏర్పడింది. వీటిని వైరి పక్షాలు ఉపయోగించుకోగలిగాయి. ఉప సమరాన్ని గెలిచాయి.

-సతీష్ చందర్

(గ్రేట్ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)

2 comments for “సమరంలో హీరో! ‘ఉప’సమరంలో జీరో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *