సీత చేతి ఉంగరం

నోరారా పలకరిస్తారు కొందరు
మనస్ఫూర్తిగా మాట్లాడతారు మరికొందరు.
తనివి తీరా సంభాషిస్తారు ఇంకొందరు

ఈ మూడూ ఒక్క సారిగా చేయగలిగిన వారు ఎవరన్నా వుంటారా?
ఎందుకుండరూ? అలా చెయగలిగిన వారు ఇద్దరే ఇద్దరు: పసిపిల్లలు, వాగ్గేయకారులు.

పాడి,ఆడి, గెంతుతారు. నిలువెల్లా కదలిపోతారు.
అవధులుండవు వారికి. పడిపోతామన్న చింత కూడా వుండదు.
గాయమైనా, నెత్తురొచ్చినా సరే- ఆగరు వాళ్ళు.
తిండీ, తిప్పలూ, పగళ్ళూ, రాత్రిళ్ళూ- ఏవీ పట్టవు వారికి.
వేళకింత పెట్టేదెవరు?
పసివాడికయితే తల్లి.
మరి కవికో,వాగ్గేయకారుడికో..? ఇంకెవరూ ఉద్యమమే అమ్మ.
కానీ, ఆ ఆమ్మే చేయి విడిస్తే…!?
ప్రపంచం కూలిపోతుంది.నాలుగు దిక్కులూ ఒక్కలాగే కనిపిస్తాయి.
అమ్మనే కలవరిస్తాడు. అమ్మకై పరితపిస్తాడు.

రాతిబొమ్మను చూసి ముడుచుకున్న అమ్మలాగా,
ఉరుముతున్న మేఘాన్ని విని తనకోసం గొంతెత్తి అరుస్తున్న తల్లిలాగా
ఏ కొమ్మను తాకినా కదలిపోతున్న మాతృమూర్తిలాగా
భ్రమ పడుతూనే వుంటాడు.

ఆ ఊహలే మళ్ళీ కవితలయి వెలిగిపోతాయి. ఆ స్వప్నాలే పాటలయి మోగిపోతాయి.
హోరు.. హోరు.. హోరు…
చేజారిన పోరు కొరకు కలల అలల హోరు!
ఇప్పుడు జయరాజు పాటల నిండా అదే రోదన.
తన కళ్ళముందే వెళ్ళిపోయిన, తనకు కాకుండా పోయిన ఒక మహోద్యమాన్ని వెతుకుతున్నాడు. విలపిస్తున్నాడు.
ఎవడు పిడికిళ్ళు బిగించినా ఆశగా చూస్తున్నాడు.
తీరా దగ్గరికి వచ్చాక, అవి పగతో బిగించినవి కావనీ, అతడు సొంత వణుకుతో చేతులు ముడుచుకున్నాడనీ గ్రహించి- భంగపడిపోతున్నాడు.
ఆవేశం ఇక్కద వుంటే, ఆశయం ఆవలి వొడ్డున వుండి పోయింది.
అతని దు:ఖాన్ని చూడలేక పోతున్నాను.
కరిగిపోతున్న మహాపర్వతాన్ని ఎవరు ఊరడిస్తారు?
గొప్పలూ, మెప్పులూ; చప్పట్లూ, తప్పెట్లూ… ఎవడిక్కావాలి?
అతడిక్కావలిసింది ఒక ఆచూకీ. ఒక ఆనవాలు. ఒక సీత చేతి ఉంగరం.
అది లేనప్పుడు ఎందుకీ ఊరడింపులు.
దు:ఖించనివ్వండి. ఈ దు:ఖం పరమ పవిత్రం.దానిని పాటయి ప్రవహించనివ్వండి.
తనకు తానుగా వెతుకుతున్నాడు. వెతక నివ్వండి.
నిన్నటిదాకా మైదానం దాటిందని అడవిలోనూ, అడవి దాటిందని మైదానంలోనూ వెతికాడు.
ఇప్పుడు ఊరు దాటి వాడ కొచ్చాడు.
పాట పోటెత్తింది.
ఓసి వెర్రి ‘వసంత మేఘమా!’- నువ్వు ‘గర్జించాల్సింది’ ఇక్కడేనే…!!

– సతీష్‌ చందర్‌,17 జూన్‌ 2011

Leave a Reply