సెటిలర్లు కారు.. వారు ‘షటిల’ర్లు!

టాపు(లేని) స్టోరీ:

photo by dewittrobinson

వలసలు.వలసలు. నిన్నటి వరకూ ప్రాంతం నుంచి ప్రాంతానికి. నేడు పార్టీనుంచి పార్టీకి.

మొదటిరకం వారికి ‘సెటిలర్లు’ అనే ముద్దు పేరు వుండేది. ఎందుకంటే వారు చుట్టపు చూపునకు వచ్చి సెటిలయిపోయేవారు. అయితే రెండోరకం వారికి ఏం ముద్దు పేరు పెట్టవచ్చు? బహుశా ‘షటిల’ర్లు – అంటే సరిపోతుందేమో! ఎందుకంటే ఆ పార్టీనుంచి ఈ పార్టీకే కాదు, ఈ పార్టీనుంచి ఆ పార్టీకి కూడా వెళ్ళ వచ్చు. వీళ్ళకి రాజీనామా అంటే ప్రియం. మీద ‘అనర్హత’ వేయించుకోవటం మహా ముచ్చట. ఆ పై వచ్చే ఉప ఎన్నికలను ఎదుర్కోవటం -అంటే పండగే. ఈ ‘షటిల’ర్లకు ఇంత ఉత్సాహం ఎక్కడ నుంచి వస్తోంది. ఒకప్పుడు పదవి పోతుందంటే వణికిపోయేవారు- ఇప్పుడు ఎగిరి గెంతులు వేస్తున్నారెందుకు? విడాకులనాడు ఈ మంగళవాయిద్యాలేమిటి? ఉండవేమిటి? వేరు పడ్డప్పుడెల్లా కొత్తగా పెళ్ళి. కొత్తగా కట్నం.’నిత్యపెళ్ళికొడుకులకు’ ఇంతకన్నా కావలసిందేమిటి? కానీ కట్నం లేకుండా సొంతఖర్చులతోనే పెళ్ళి చేసుకోవాల్సి వస్తే, జన్మకో పెళ్ళి చాలనుకుంటాడు. అలాగే, సొంత ఖర్చులతో ఎన్నికయి రాజీనామా చేసి మళ్ళీ సొంత సొంతఖర్చులతోనే ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే, ఒక్కరు చేస్తారా? వణికి చచ్చిపోరూ? అయినా సరే, ఇంత వీరోచితంగా ‘షటిలర్లు’ గోడ ఎలా దూకటానికి సిధ్ధపడుతున్నారు?

ఇప్పుడు జరుగుతన్న ఉప ఎన్నికల్లో వోటు రేటును చూడండి. పడిపోతున్న రూపాయి విలువను కూడా గణనలోకి తీసుకున్నారోఏమో, వోటు రేట్లు పెంచేశారు. కొన్ని నియోజకవర్గాలలో వోటుకు మూడువేల రూపాయిలు పలుకుదుంది(ట). ఇప్పటికే వోట్లకొనుగోలుకోసమే రవాణా అవుతున్న లేదా దాచిపెట్టినట్టు భావిస్తున్న సొమ్ము 50 కోట్లకు చేరింది. ఇంకా దొరకని మొత్తం ఎంత వుందో? అంటే, ఉప ఎన్నికల ఖర్చు ఎంత బారీగా పెరిగిపోయింది? ఈ మొత్తాన్ని కేవలం అభ్యర్థులే భరించగలరా? లేక ఈ మొత్తాల్లో పార్టీనుంచి వచ్చే గ్రాంటులు వుంటాయా? అభ్యర్థే పెట్టుకోవలసి వస్తే , ఉప ఎన్నికలలో పోటీకి ఇంత ఉత్సాహం చూపుతాడా? ఒక వేళ గెలిచినా పదవీ కాలం ఎన్నాళ్ళు? రెండేళ్లు కూడా లేదు. ఒక వేళ ఇలా పెద్ద యెత్తున గుంపులు గుంపులుగా పార్టీలు ఫిరాయిస్తే సర్కారు కూలిపోతుందని భావించ వచ్చు. కానీ రాష్ట్రంలో ఆ చిక్కు లేదు. మధ్యంతర ఎన్నికలకు కాంగ్రెసే కాదు, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా సిధ్ధంగా లేదు. మొత్తం మీద షటిలర్లు దూకటానికి ఒక్కటే కారణం కనిపిస్తుంది. రాజీనామా వల్లే కాకుండా, ఉప ఎన్నిక వల్ల కూడా ‘ఆర్థిక నష్టం’ లేకుండా చూసే హామీని ఆహ్వానించే పార్టీలు ఇవ్వటం. ఇక పోతే, ఇలా రాజీనామా చేసిన సభ్యుడు బరిలోకి వచ్చినప్పుడు అతనికి పోటీగా ఇతర పార్టీల అభ్యర్థులు కూడా వుండటానికి మరో కారణం వుంది. 2014 ఎన్నికలకు ముందే టికెట్లు ఆయా పార్టీల్లో రిజర్వు చేసుకోవటం. కాబట్టి ఎలా చూసినా, ‘షటిలర్లు’ తమ రాజీనామాలా ద్వారా ఉపఎన్నిక తెప్పించుకోవటం వల్ల ఆర్థికంగానో, రాజకీయంగానో లబ్ధి పొందుతున్నారు తప్ప , నష్టపోవటం లేదు. అందుకే ఇప్పుడు రాష్ట్రాన్ని వేధిస్తున్నది ‘సెటిలర్ల’ సమస్య కాదు, కేవలం ‘షటిల’ర్ల సమస్యే.

 

న్యూస్‌ బ్రేకులు:

 నీతికి ‘పటం’!

ప్రజలు నీతికీ, నిజాయితీకీ పట్టం కట్టాలి

-జయప్రకాష్‌ నారాయణ్‌, లోక్‌సత్తా

సారీ, మాస్టారూ! పట్టం కట్టరు. కావాలంటే, ఆ రెంటికీ ‘పటం కట్టి’ పూజిస్తారు. కానీ వోటు మాత్రం పైసలు తీసుకునే వేస్తారు.

ఈ జనాన్ని చూస్తే మీకేమని పిస్తోంది? నేను తప్పు చేసి వుంటే వీరంతా నన్ను చూడటానికి వచ్చే వారా?

-ఎం.పి రాజా, టీజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు

అవును. సానుభూతి ముందు అవినీతి ఎప్పుడూ చిన్న బోతూనే వుంటుంది.

ట్విట్టోరియల్‌

అవి నోళ్ళా?

ఎన్నికల ప్రచారం కాలంలో ఎంతో మంది బాగుపడతారు. లారీలు ట్రక్కుల యజమానులు మనుషుల్ని సరుకులాగా సరఫరా చేస్తుంటారు. వారికీ డిమాండే. కొద్దో గొప్పో, డప్పులూ గట్రా ‘వాయించే’ కళాకారులు కూడా ఈ కాలంలో బాగుపడి వుంటారు. షామియానాల వాళ్ళ సంగతి చెప్పనవసరమేలేదు. జెండాలూ, బ్యానర్లూ చెయ్యాలు కాబట్టి గార్మెంటు కంపెనీల వాళ్ళు లాభాలు సంపాదించి వుంటారు. అన్నింటికన్నా, బార్లూ, బెల్టు షాపులూ మీద వచ్చిన లాభాలతో ‘యజమానుల’కు ‘కిక్కెక్కి’ పోయి వుంటుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రచారంలో పాల్గొన్న నేతలకు ‘ఉపన్యాసాల్లో శిక్షణ’ ఇచ్చిన వారూ, ‘స్క్రిప్టు’ రాసిపెట్టిన వారూ ఎంతోకంత గడించి వుంటారు. సరే రేపు ఫలితాలు వచ్చాక ఎలాగూ బాణా సంచా తయారు చేసే కంపెనీలూ, పూల కంపెనీలు బాగుపడతాయి. అయితే ఈ మధ్య కాలంలో అంటే ప్రచారం ముగిసినప్పటి నుంచీ, ఫలితాలు వచ్చే లోపు ఏ కంపెనీలు బాగు పడతాయి? సమాధానం సింపుల్‌. నోటిని శుభ్రపరచే ‘మౌత్‌ వాష్‌’ కంపెనీలు లాభాలు గడిస్తాయి. ఇన్ని కంపు మాటలు మాట్లాడిన నేతలు తమ నోళ్ళు కడుక్కో వద్దా?

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

దేశానికి ‘మోడి’ంది!

పలు ట్వీట్స్‌ : నరేంద్ర మోడీ 2014 ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయిపోతారేమో?

కౌంటర్‌ ట్వీట్‌: అంతే నంటారా? అయితే, దేశ రాజధానిని ‘అయోధ్య’కు మార్చేస్తారా?

ఈ- తవిక

మహా ‘పీత’లు

వాగి వాగి వాడూ

తాగి తాగి వీడూ

తూలుతున్నారు.

ఒకడు నేత.

ఇంకొకడు పీత.

పట్టుకోకండి. పడేది మీరే.

 

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘అతడు చేతులు కడుక్కుంటున్నాడేమిటి?

‘అబ్బే. ఏం లేదు? వోటేసి వచ్చాడు.’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

సొంత పార్టీలో ‘కోవర్టు’ గా వుండటం కన్నా, పరాయి పార్టీకి ‘ఇన్ఫార్మర్‌’ గా వుండటం మేలు.(రెండు ఒకటి కావా?)

(సూర్య దినపత్రిక 12జూన్‌ 2012 వ తేదీ సంచికలో ప్రచురితం)

 -సతీష్ చందర్


 

 

1 comment for “సెటిలర్లు కారు.. వారు ‘షటిల’ర్లు!

Leave a Reply