‘హౌస్‌’ ఫుల్‌! ‘బాక్సు’డల్‌!!

రాష్ట్రం రెండు గా చీలింది.

నిజం.

ఈ దృశ్యం ఎవరికీ కనిపించక పోవచ్చు. కానీ ఇద్దరికి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆ ఇద్దరూ ఎవరో కాదు.

ఒకరు: కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఇంకొకరు: చంద్రబాబు నాయుడు.

రెండుగా అంటే- ఒకటి సీమాంధ్ర లాగా, మరొకటి తెలంగాణ లాగా కనిపించటం కాదు.

ఒకటి జగన్‌లాగా, మరొకటి కేసీఆర్‌ లాగా కనిపిస్తోంది.

ఇంత స్పష్టంగా రాష్ట్రం ‘వేరు పడి’ వుండగా, ఇంకా ‘రాష్ట్ర విభజన’ కోసం ఇతర పార్టీలు ఎందుకు అడుగుతున్నాయో వీరిద్దరికీ బోధపడంలేదు.

రాష్ట్రంలో తామున్నామన్న సంగతి పక్కన పెట్టి, వీరిద్దరికీ రాసిచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే.

వైయస్‌ మృతి తర్వాత, సానుభూతితో జగన్‌ ఎదక్కుండా వుండేందుకు, ఒక చోట తెలంగాణ ఉద్యమానికి, మరొక చోట ‘సమైక్యాంధ్ర’ ఉద్యమానికి కాంగ్రెస్‌ పరోక్ష సహకారాన్ని అందించింది. కానీ కొన్న నెలల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ‘సమైక్యాంధ్ర’ ఉద్యమం నిమ్మళించాక ఆ స్థానంలో జగన్‌ ప్రభంజనం వుంది. తెలంగాణలో ఎలాగూ, తెలంగాణ ఉద్యమమే వుంది. ఈ తెలంగాణ ఉద్యమానికి శాశ్వత చిరునామాగా టీఆర్‌ఎస్‌ నిలిచిపోయింది.( ఈ మధ్యనే ఇక్కడి జనం ఒక అసెంబ్లీ స్థానంలో బీజేపి వైపు కూడా చూసారనుకోండి. అది వేరే విషయం!)

అలా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉనికిని కోల్పోయింది. అది పోతే పోయింది. ‘రాచ పీనుగు తోడు లేకుండా వెళ్ళదన్నట్లు’ , అది మునిగి పోతూ, ప్రధాన ప్రతిపక్షంగా వున్న తెలుగుదేశం పార్టీని కూడా ముంచేసింది.

ఈ రెండు పార్టీలూ నేడు ‘హౌస్‌'(శాసన సభ)లో పులులే. వీధిలోకి.. అంటే… ఎన్నికల బరిలోకి వస్తేనే పిల్లులయి పోతున్నాయి.

ఈ రెంటి పార్టీలను ‘విజయ పథం’లో నడిపించటానికి నడుము కట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు- ఉప ఎన్నికల ఊసెత్తటానికే వణికి పోతున్నారు.

ఈ ఇద్దరూ ఇటీవల జరిగిన ఏడు స్థానాల ఉప సమరంలోనూ పరమ వీరోచితంగా పోరాడి, పరాజయం పాలయ్యారు.

ఇప్పుడు 18 అసెంబ్లీ స్థానాలకీ( చిరంజీవి ఖాళీ చేసిన స్థానంతో పాటు), ఒక పార్లమెంటు (నెల్లూరు) స్థానానికీ ఎన్నికలంటే- పరాజయం మామూలే- అని తెంపు చేసుకున్నా ‘డిపాజిట్లు గల్లంతయ్యే’ పరాజయం వస్తే- ఎలా అన్నది ఇబ్బంది పడుతూనే వుంది.

ఇంతటి ఘోరమైన స్థితిలోనూ, అటు కాంగ్రెస్‌ కు కానీ, ఇటు తెలుగు దేశం కానీ, చిగురంత ఆశ కూడా లేదు. అదేమంటే ప్రభుత్వం కూలి పోయి మధ్యంతరం రాదని.

చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మీద ఎంతగా తొడలు చరిచినా, ప్రభుత్వాన్ని కూల్చరు. ప్రభుత్వం కూలదన్న భరోసా వున్నప్పుడే ‘అవిశ్వాస తీర్మానం’ పెడతారు. తన శ్రేయస్సును ఇంతగా పట్టించుకునే ప్రధాన ప్రతిపక్షం వున్న చోట , సర్కారుకు ‘మధ్యంతర’ భయం ఎందుకు వుంటుంది? కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా ఎంత కుమ్ములాడుకున్నా, తమంతట తాము సర్కారును కూల్చుకోదన్న నమ్మకంతో చంద్రబాబు సైతం ‘మధ్యంతరం’ వీడారు.

నిజానికి ‘మధ్యంతరం’ మీద బాగా మోజుపడుతున్నది టీఆర్‌ఎస్‌. తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుచుకుని, కేంద్రంలో ఏ ప్రభుత్వం వుంటే, ఆ ప్రభుత్వంతో ఆట ఆడుకోవచ్చనీ, అలా తెలంగాణను తెచ్చుకోవచ్చనీ ఆ పార్టీకి వుండటం సహజం.

కానీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ మాత్రం మధ్యంతరం గురించి మరీ అంత ముచ్చట పడదు. వైయస్పార్‌ మృతి పట్ల చేపట్టిన ‘ఓదార్పు’ యాత్ర ‘అశ్వ మేథ యాగం’ లా సాగి పోతుంటే, ఒకప్పుడు దానిని తెలంగాణ వద్ద అడ్డుకున్నారు. సీమాంధలో మాత్రం ‘అజేయం’గా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో కూడా ‘ఓదార్పు’నకు మార్గం సుగమమవుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ‘యాత్ర’ సంపూర్ణమయ్యాక అన్ని స్థానాలకూ పోటీ చెయ్యవచ్చని ఆ పార్టీ యోచన.

అయితే సిబిఐ విచారణ పేరు మీద కేసుల ఉచ్చు ఆ పార్టీ నేత పీకకు బిగుసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా జరిగితే కాడు సానుభూతి పెరిగి, పెరిగి.. 2014 ఎన్నికల నాటికి ఆ పార్టీకి పూర్తి అనుకూల పవనాలు ఏర్పడతాయి కాబట్టి, అప్పుడే ఎన్నికలకు వెళ్ళటం లాభదాయకమని భావిస్తోంది.

అయితే కిరణ్‌, చంద్రబాబులకు మధ్యంతర భయాలు కాకుండా, ఈ ‘ఉప ఎన్నికల’ భయాలెందుకో?

ఎలాగూ ఈ 18 అసెంబ్లీ స్థానాల్లోఒక్కటి( చిరంజీవి ఖాళీ చేసిన తిరుపతి)మినహా అన్నీ అనధికారికంగా ‘వైయస్సార్‌ కాంగ్రెస్‌’ వే. నెల్లూరు పార్లమెంటు స్థానం కూడా వారిదే కదా! ఇక అందులో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు పెద్దగా పోగొట్టుకునేదేముంది?

కాంగ్రెస్‌కు పార్టీగా పెద్ద ఇబ్బంది లేక పోయినా, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కి మాత్రం వ్యక్తిగతంగా ఇబ్బందే. ఇప్పటికే ఏడు స్థానాల వోటమి నెపంతో, ఆయన కుర్చీకి ఎసరు పెట్టటానికి పార్టీలో పెద్ద దుమారమే లేచింది. రేపు రాబోయే ఉప ఎన్నికల తర్వాత, ఇదే మార్కు పరాజయం వుంటే కిరణ్‌ కుర్చీ ఖాళీ చేయటం అనివార్యం కావచ్చు.

పార్టీ హైకమాండ్‌ కూడా ఈ దిశగానే ఆలోచిస్తుందన్న పుకార్లు బాగానే వ్యాపించాయి. ఆ 18 స్థానాల పరాజయాన్నీ, కిరణ ఖాతాలోనే వేసేసి దించేస్తే, కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిని మచ్చలేకుండా 2014 ఎన్నికలకు ముస్తాబు చెయవచ్చని కాంగ్రెస్‌ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక చంద్రబాబు తెలంగాణ విషయంలో ‘రెండు కళ్ళ’ ( సీమాంధ్ర, తెలంగాణ నాకు రెండు కళ్ళు- అని అన్నారు.) సిధ్ధాంతంతో , ‘రెంటికీ చెడ్డ రేవడి’ లాగా మారారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో తిరగ గలగుతున్నారు. తన పార్టీ అభ్యర్థులను తెలంగాణ ఉప ఎన్నికల బరిలోకి దించగలుగుతున్నారు. కొద్దో, గొప్పో వోట్లశాతాన్ని పెంచుకోగలుగుతున్నారు. సీమాంధ్రలో కూడా శక్తి వంచన లేకుండా తిరుగుతున్నారు. ఏడాది పోతే, మార్పు రాకపోతుందా- అన్నది ఆయన ఆశ. తెలంగాణలో ‘తెలుగుదేశం’ పార్టీ గెలుచుకోక పోయినప్పుడు పొందిన పరాభవం కన్నా, సీమాంధ్రలో గెలుచుకోక పోతే పొందే పరాభవాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా భావిస్తాయి.

ఇంకా చెప్పాలంటే, కేసీఆర్‌ చేతిలో వోటమి కన్నా, జగన్‌ చేతిలో వోటమిని చంద్రబాబు ఎక్కువ అవమాన కరంగా భావిస్తారు. గతంలో భావించారు కూడా. ఈ 18లో ఏదీ గెలుచుకోలేక పోతే, ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని ప్రజలు గుర్తించటం మానేస్తారు.

కాబట్టి, ముంచుకొస్తున్న మలి ఉప ఎన్నికలు-

కిరణ్‌ కు ‘పదవీ గండాన్నీ’ , చంద్రబాబుకి ‘పరువు గండాన్నీ’ తెచ్చిపెట్టేలా వున్నాయని భావించాల్సి వస్తోంది.

అందుచేతనే-

వీరిద్దరు మాత్రమే రాష్ట్రం రెండుగా చీలిన ‘ఉద్విగ్న సన్నివేశాన్ని’ దర్శించగలుగుతున్నారు.

-సతీష్‌ చందర్‌

Leave a Reply