‘ఈజీ’ నామాలా? ‘క్రేజీ’నామాలా?

రోజూ పెట్టే ‘నామా’లే, రాజీనామాలయ్యాయి. ఎవరు ఎవరికి పెడతారు? అనుమానమేముంది? నేతలు జనానికి పెడతారు.resign

స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ పదవులకు అరుదుగా రాజీనామాచేసేవారు. అందుకే సందర్భం వచ్చినప్పుడెల్లా లాల్‌ బహదూర్‌ శాస్త్రి చేసిన రాజీనామానే పదే పదే పెద్దలు ఉటంకిస్తూ వుంటారు. మరీ ముఖ్యంగా ఈయన ప్రస్తావన, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు వస్తుంటుంది. ఆయన రైల్వే మంత్రిగా వుండగా, ఎక్కడో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసాడని చెబుతుంటారు.

ఇప్పుడలా కాదు, మట్లాడితే రాజీనామా! అంటే మన నేతల్లో పదవీవ్యామోహ స్థాయి అంత దారుణంగా పడిపోయిందా? కుర్చీలన్నా, అధికారాలన్నా లెక్కలేకుండా పోయిందా? ఎమ్మెల్యే, ఎంపీలే కాకుండా, మంత్రులు కూడా రాజీనామాలకు దూకేస్తున్నారు. ఇంత నిస్వార్థపరత్వం వీరికెలా వచ్చేసింది? చూసే వాళ్ళకి నిజంగానే ఆశ్చర్యంగా వుంటుంది.

ఇంత ఈజీగా చేసేస్తున్నారు కాబట్టి, వీటిని రాజీనామాలనటం కన్నా, ‘ఈజీ’ ‘నామా’లు అనడం సబబేమో! ఇప్పుడు రాజీనామాలు చేయ్యటం క్రేజ్‌ గా కూడా మారింది. కాబట్టి ‘క్రేజీ’నామాలూ, అని పిలిచినా తప్పులేదు.

ఇంతటి క్రేజ్‌ ఒక్కటే కారణం. బీమా. ఇది జీవిత బీమాకాదు, వాణిజ్య బీమా కాదు. ఇది కేవలం ఉద్యమ బీమా. అవును. ఉద్యమం అంత గొప్పది. పోగొట్టుకున్న దానిని , రెట్టింపు విలువతో తిరిగి ఇస్తుంది. ఈ రహస్యం ఒక్క తెలుగువాళ్ళకే బాగా అర్థమయింది. 2009 డిశంబరు నెలలో తెలుగు నాట ఈ ఉద్యమబీమా పథకం మొదలయింది. ఇది ఒకరకంగా మన ప్రజాప్రతినిథుల పాలిట ‘ఉపాధి హామీ’ పథకం లాంటిది. ఈ పథకం అమలు లోకి వచ్చాక- కింద చక్కగా అమర్చినవల వుందీ, పడినా దెబ్బ తగలదూ అన్న నమ్మకం కుదిరాక సర్కస్‌ లో జోకర్‌ పరమ వీరోచితంగా దూకేస్తాడు చూశారా- ఆ రీతిగా ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ రాజీనామాలిచ్చేసి ఉద్యమంలోకి దూకేస్తున్నారు. ఒక్క పక్క ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమం. తెలంగాణ ఉగ్రరూపం దాలిస్తే, సీమాంద్ర శాంత రూపాన్ని సంతరించుకుంటుంది; తెలంగాణ చల్లబడితే, సీమాంధ్ర రగిలిపోతుంది. ఇలా రగిలిపోయినప్పుడే, ప్రజాప్రతినిథులు తమ రాజీనామాపత్రాల ప్రతులను (పార్టీ అధినేతలకూ, మీడియా ప్రతినిథులకూ, ఇంకా ఎవరికి కావాలంటే వారికి) కర పత్రాల్లా పంచేస్తారు. మరీ తప్పదంటే ‘సభాపతుల’కు కూడా ఇస్తారనుకోండి. అది వేరే విషయం. సర్వ సాధారణంగా అంత తొందర పడి ‘సభాపతులు’ వీటిని అంగీకరంచరు.( వాటిల్లో వెతికి చూస్తే సాంకేతికలోపాలు ఉండక పోవు. ఒక వేళ కావాలన్నే సాంకేతిక లోపాలతో రాజీనామాలను చేసినా చేయవచ్చు.) ఇది హామీలోపల హామీ, లేదా బీమాలోపల బీమా.

ఒకవేళ అంగీకరించినా వెంటనే ఉప ఎన్నిక జరుగుతుంది. లేదూ, అసలు ఎన్నికల గడువే దగ్గరకొచ్చేస్తే మరీ మంచిది. వారిని ఉద్యమమే మళ్ళీ గెలిపించుకుంటుంది. ఏ సీటులో వున్న వారికి ఆ సీటు రావటమే కాకుండా, మరో అయిదేళ్ళు పదవీ కాలం పెరుగుతుంది. గమనించారా? ‘ ఒక్క రాజీనామా మీ రాజకీయ జీవితాన్నే మార్చేస్తుంది’. ఈ సౌకర్యాన్ని నిన్నటి వరకూ తెలంగాలోని ప్రజాప్రతినిథులు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఈ బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవటంలో సీమాంధ్ర ప్రజాప్రతినిథులు ముందున్నారు.

ఈ రాజీనామాల వల్ల – తర్వాత పెరిగే పదవీ కాలం మాట అలా వుంచండి- ఇప్పటికిప్పుడు వచ్చే కీర్తి, సామాజిక గౌరవం అంతా ఇంతా కాదు. ఉద్యమకారులు( ఎక్కడి నుంచో రారులెండి. మన ఇళ్ళలోని వాళ్ళే. విద్యార్థులూ, ఉద్యోగులూ, చిన్నా, చితకా వృత్తుల వాళ్ళూ) ఈ రాజీనామాను ‘పదవీ త్యాగం’ కింద భావించి, వారికి నీరాజనాలు అర్పిస్తారు. ఊరేగిస్తారు. ‘పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిస్వార్థపరుడు’ అని ప్రశంసిస్తారు. కీర్తి ఇలా ‘ఇన్స్టెంట్‌ కాఫీ’లాగా వచ్చేస్తుంటే, ఎవరికి బాగుండదు. ఇక వాళ్ళ వాళ్ళ పార్టీల హైకమాండ్‌లూ, అధిష్ఠానాలూ అంటారా?- ఆ ప్రాంతంలో వున్న సెంటిమెంటును తమ తమ పార్టీలవైపు మళ్ళిస్తున్నారని లోలోపల మురిసి పోతుంటారు. పైకి మాత్రం- క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని- హెచ్చరికలు జారీ చేస్తుంటారు.

అయితే ఈ రెంటిలో ఏదో ఒక ప్రాంతానికే పరిమితమయిన ప్రాంతీయ పార్టీలయితే వాటికి మరీ సుఖం. ఏకంగా సభ్యులతో పాటు అధినేత కూడా రాజీనామా చేసేయ వచ్చు. మొదట్లో ఈ సౌకర్యం తెలంగాణ లో టీఆర్‌ఎస్‌ పార్టీకీ, సీమాధ్రలో ప్రజారాజ్యం పార్టీకీ వుండేది. టీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం. కానీ ప్రజారాజ్యం రెండు ప్రాంతాల కోసం పుట్టంది కానీ, ఇద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా సీమాంధ్ర వారే కావటంతో, అధినేత(చిరంజీవి) సహా అందరూ అప్పట్లో ‘సమైక్యాంధ్ర’ నినాదం అందుకున్నారు. ఇప్పుడా పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయిపోయింది మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత ఈ సౌకర్యం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చింది. తెలంగాణలో ప్రాతినిథ్యాన్ని కోల్పోయి, సీమాంధ్రకే పరిమితమవుతుండటంతో నేడు అధినేత(జగన్‌) సహా ‘పదవీ త్యాగాల’కు పాల్పడ్డారు. వెంటనే ఎన్నికలొస్తే, వీరందరికీ ‘ఉద్యమ బీమా’ కింద రెట్టింపు రాజకీయ లబ్ధి కలుగుతుందని, వ్యూహకర్తలు సకాలంలో సెలవిచ్చివుంటారు. ఇరుప్రాంతాల నేతలూ కలిసి ఇవ్వదగ్గ నినాదం ఒకటి ఉంది: ‘ఉద్యమ బీమా వర్థిల్లాలి!’

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమిలో 11ఆగస్టు 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *