‘మీ నాన్న మాజీ యా?’

సిఎంల సంతానం కోసం కాంగ్రెస్‌ వెతుకులాట


మొన్న
నాదెండ్ల మనోహర్‌ స్పీకరయ్యారు.

నిన్న కోట్ల సూర్యప్రకాశ రెడ్డి కేంద్రమంత్రయ్యారు

నేడు మర్రి శశిధర రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

ముగ్గురి తండ్రులూ( నాదెండ్ల భాస్కరరావు, కోట్ల విజయభాస్కర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి) ఒకప్పడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులే.

కాంగ్రెస్‌పార్టీలో ముఖ్యమంత్రుల తనయులకు వెతికి కుర్చీలు వేయటం కాస్త విడ్డూరంగానే వుంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్‌ లో మరీ ఆశ్చర్యంగా వుంటుంది.

ఎందుకంటే రాష్ట్రంలో మూడున్నరేళ్ళుగా అశాంతి నెలకొనటానికి కారణం ఒక్కటే ఒక ముఖ్యమంత్రి కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేయటానికి నిరాకరించటమే. అవును. వైయస్‌ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో అకాల మృతి చెందిన తర్వాత, సానుభూతి మెండుగా వున్న ఆయన తనయుడు జగన్మోహన రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటానికి అధిష్ఠానం ససేమీ కాదన్నది.

కానీ అదే అధిష్ఠానం మాజీ ముఖ్యమంత్రుల తనయులు ఎక్కడెక్కడున్నారో గాలించి మరీ గుర్తిస్తున్నారు. అ లెక్కన రేపు జలగం వెంగళరావు కొడుకులను (జలగం ప్రసాదరావు, వెంకట్రావులను) కూడా పిలవాలి. కానీ రెండేళ్ళ నుంచీ వీరికి పార్టీలో పెద్దగా గుర్తింపు లేదు. ఒకరు టీఆర్‌ఎస్‌ వైపూ, మరొకరు వైయస్సార్‌ వైపూ చూస్తూ వచ్చారు.

కొడుకులేనా? కూతుళ్లు కూడానా?

ఈ మాజీ ముఖ్యమంత్రులు కేవలం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులయి వుండాలా?

ఈ ‘రిజర్వేషన్‌’ వారి కొడుకులకేనా? కూతుళ్ళకు కూడా వర్తిస్తుందా?

ఈ రెండూ ప్రశ్నలూ వేయగానే గుర్తుకు వచ్చే పేరు- దగ్గుబాటి పురంధరేశ్వరి.

ఈమె తండ్రి ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రే. కాకుంటే కాంగ్రెస్‌ను కుప్పకూల్చి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అమెకు పార్టీ అధిష్ఠానం మాజీ సిఎంల సంతానానికి ఇస్తున్న ‘రిజర్వేషన్‌’ వర్తిస్తుందా?

ఆ మాట కొస్తే వీరందరి కన్నా ముందు, ఆమెకే వర్తించింది. హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ ప్లీనరీ(2006) జరిగిన తర్వాతనే, ఆమెకు ఈ రకమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాతనే ఆమెకు కేంద్రంలో మంత్రి పదవి వరించింది. అది పెద్ద విశేషమేమీ కాదు. కానీ తాజాగా జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో కూడా ముందుగా ‘సహాయ మంత్రి’ గానే వుంచి శాఖను మార్చినా, తర్వాత ‘స్వతంత్ర’ హోదావున్న సహాయ మంత్రిగా ‘పదోన్నతి’ కల్పించి మరో శాఖను ఒప్పగించారు. దాంతో అత్యంత విధేయుడూ, అయిదు సార్లుకు పార్లమెంటుకు ఎన్నికయిన కావూరి సాంబశివరావు అలిగి కాంగ్రెస్‌లో వున్న అన్ని ముఖ్యపదవులకూ రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కుమర్తెకు ‘సముచిత’ స్థానం కల్పించటానికి కాంగ్రెస్‌ ఎంత ‘రిస్క్‌’నయినా తీసుకోవటానికి సిధ్ధపడిందంటే- ఏమని అర్థం చేసుకోవాలి?

మాజీముఖ్యమంత్రుల సంతానానికి ఈ ‘కోటా’ను ఇవ్వటంలో కాంగ్రెస్‌ పార్టీ ఆంతర్యం మేమిటి?

బహుశా ఇందుకు రెండు కారణాలు కావచ్చు:

ఒకటి:జగన్‌ ను కవ్వించటం.

రెండు:జగన్‌ ను ఢీకొనటం.

‘జగనే కాదు, ముఖ్యమంత్రుల తనయులు ఇంకా వున్నారు.’ అని జగన్‌కు పరోక్ష సందేశం పంపించటంతో, ‘తండ్రి పట్ల వున్న సానుభూతిని ఉపయోగించుకుని ముఖ్యమంత్రి కావాలని చేస్తున్న ప్రయత్నాని’కి గండికొట్ట వచ్చన్నది ఒక యోచన కాదు. ఇదే నిజమయితే ఇందులో కాంగ్రెస్‌ నేతలకు జగన్‌ పట్ల వున్న అక్కసే బహిర్గతమవుతుంది తప్ప, మరో ప్రయోజనం సిధ్ధించదు.

అయితే ‘వారసత్వ రాజకీయాల’కు అలవాడు పడ్డ ప్రజలు ‘వైయస్‌ తర్వాత ఆ పదవిని జగన్‌కు ఎందుకు ఇవ్వలేదు’ అని ఎప్పటినుంచో ప్రశ్నిస్తున్నారు. (పలు సంస్థలు వివిధ సందర్బాలలో నిర్వహించిన సర్వేలు ఈ అంశాన్ని ధ్రువపరస్తున్నాయి.) ‘అలా ఇవ్వాల్సి వస్తే, జగన్‌ కన్నా ముందు వరసలో పలువురు మాజీ ముఖ్యమంత్రుల తనయులున్నారు.’ అని జనం ముందుకు తీసుకు వెళ్ళాలని కాంగ్రెస్‌ ఎప్పటి నుంచో చూస్తోంది. కానీ వారిలో కొందర్ని పనిగట్టుకుని గుర్తు చేస్తే తప్ప జ్ఞప్తికి రాని స్థితి వుంది.

జనం మరచిన పెద్దలు!

పి.జనార్థనరెడ్డి వున్నంత వరకూ మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర రెడ్డిని ఏదో మేరకు జనం గుర్తుంచుకొనే వారు. వారిద్దర్నీ కలిపి ‘హైదరాబాద్‌ బ్రదర్స్‌’ అని పిలుస్తుండేవారు. కొన్నాళ్లు వారిద్దరికీ దైనందిన కలాపం ఒక్కటే. ముఖ్యమంత్రిగావున్న వై.యస్‌ రాజశేఖరరెడ్డి పై విమర్శలు గుప్పించటం. వారిద్దరూ అలా ‘అసమ్మతి’కి ఆనవాళ్ళుగా వుంటూ వచ్చారు. కానీ పి.జనార్థనరెడ్డి మరణానంతరం శశిధర రెడ్డికి అంతగా గుర్తింపు లేకుండా పోయింది.

కోట్ల విజయభాస్కర రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ఒకప్పుడు వార్తల్లో వుండే వారు కానీ, గత కొద్దేళ్ళు గా ఆయన ప్రస్తావనే ఎక్కడా రావటం లేదు. కానీ ఆయనను ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఇవ్వటం వల్ల వార్తల్లోకి వచ్చారు.

అంటే కాంగ్రెస్‌ పార్టీయే, వీరిని గుర్తించి ‘మాజీ ముఖ్యమంత్రుల తనయులు’ ఇంకా వున్నారని’ చెబుతూ ‘వారసత్వ రాజకీయానికి’ విరుగుడుగా ‘వారసత్వ రాజకీయమే’ ప్రయోగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇలా వారిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి జగన్‌ను ఎదుర్కొనే చేయాలని కూడా ఆశ పడుతున్నారు.

కానీ ఇంతవరకూ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో ప్రజలు ఇద్దరినే అమితంగా ఇష్టపడ్డారు. అంటే ఇద్దరే ఇద్దరు జనాకర్షక ముఖ్యమంత్రులని తేలి పోయింది. వారే వై.యస్‌ రాజశేఖ రెడ్డి ఎన్టీరామారావులు.

వారసత్వ రాజకీయాల్లో పితృస్వామ్యానిదే పై చేయి. అందుకు కారణం ఇప్పటికీ జనంలో గూడు కట్టుకున్న ఫ్యూడల్‌ సంస్కృతి. ప్రజాస్వామ్య యుగంలో కూడా రాచరికపు నీతులకే ఎక్కువ విలువ. రాజు తర్వాత కొడుకుంటే కొడుకే రాజు. ఒక వేళ కొడుకు సిధ్దంగా లేకుంటే, అప్పుడు కూతురికి అవకాశం. నేటి జనాదరణలో అదే క్రమం కనిపిస్తోంది.

కొడుకుల్ని దాటి కూతుళ్ళ కొస్తుందా?

రాజశేఖర రెడ్డి ‘రాజకీయ వారసత్వం’ స్వీకరించటానికి తనయుడు జగన్మోహన రెడ్డి అన్ని విధాలా సిధ్దంగా వున్నారు. కాబట్టి సహజంగానే సానుభూతి ముందుగా ఆయన మీదకు వచ్చిపడింది.

కానీ ఎన్టీరామారావు విషయంలో అలా జరగలేదు. ఎన్టీఆర్‌ జీవించి వుండగానే మెజారిటీ శాసన సభ్యులను తన వైపునకు తిప్పుకుని( ఈప్రక్రియను అస్మదీయులు ‘తిరుగుబాటు అన్నారు. తస్మదీయులు ‘వెన్నుపోటు’ అన్నారు.) ఆయన్ని తన అల్లుడు చంద్రబాబు పదవీచ్యుతుణ్ణి చేశారు. అలా బాబు ఎన్టీఆర్‌ అధికారాన్ని తీసుకోగలిగారు కానీ, రాజకీయ వారసత్వాన్ని తీసుకోగలిగారు. ఎన్టీఆర్‌ తనయులు అంతిమంగా బాబు గూట్లోకే వెళ్ళిపోవటం వల్ల ఆ వారసత్వం ఇంకా ఎవరికీ పూర్తిగా సంక్రమించకుండా వుండి పోయింది. అప్పుడప్పుడూ ‘బాలయ్య’ అభిమానులూ, మనమడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులూ ఈ వారసత్వాన్ని తమ తమ హీరోలకు దక్కించటానికి తాపత్రయ పడుతుంటారు. బాలయ్య ఎలాగూ బాబు తో ‘వియ్యం’ అందేశారు కాబట్టి, వారిద్దరినీ ఒకే విధంగా చూస్తారు. ఎటొచ్చీ జూనియర్‌ ఎన్టీఆర్‌దే సమస్య. ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి రాలేరు.

ఈ స్థితిలో ఎన్టీఆర్‌ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాబుతో విభేదించటమే కాకుండా, కాంగ్రెస్‌లో చేరిపోయారు. అంతే కాదు, తన సతీమణి, ఎన్టీఆర్‌కుమార్తె అయిన పురంధేశ్వరిని క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశం కల్పించారు. సహజంగానే నాయకత్వ లక్షణాలున్న పురంధేశ్వరికి దేశవ్యాపితంగా ఎన్టీఆర్‌ కుమార్తెగా ఒక ప్రత్యేక మైన గుర్తింపు వచ్చింది. కానీ రాష్ట్రంలో ప్రజలు రాజకీయ వారసత్వం ఇచ్చే విషయంలో మాత్రం బాలయ్య , ఎన్టీఆర్‌ ల తర్వాతే పురంధేశ్వరిని చూస్తారు.

కాంగ్రెస్‌కు కూడా ఈ విషయంలో కొంత స్పష్టత వున్నట్లున్నది. అందుకే తొలుత చంద్రబాబును ఇరుకున పెట్టటానికే దగ్గుబాటి దంపతులకు స్వాగతం పలికారు. కానీ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రుల సంతానం కోటాలో పురందేశ్వరికి మరింత పెద్ద పీట లభించినట్లు కనిపిస్తోంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల సంతానాన్ని ఎంపిక చేసే విషయంలో కులం, ప్రాంతం పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తోంది

ఇటీవల ప్రాధాన్యం లభించిన కోట్ల సూర్యప్రకాశ రెడ్డి , రెడ్డి సామాజిక వర్గానికీ, రాయలసీమ ప్రాంతానికీ చెందిన వారు.

ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన మర్రిశశిధర రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికీ తెలంగాణ ప్రాంతానికీ చెందిన వారు.

పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గానికీ, ఆంధ్రప్రాంతానికీ చెందిన వారు.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాంగ్రెస్‌నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వలసపోతున్నారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం మీద మెల్ల మెల్లగా విశ్వాసం సడలుతోంది.

‘వలసల్ని’ నిరోధించటానికి రెడ్డి సామాజిక వర్గానికి మాజీ ముఖ్యమంత్రుల తనయులనూ, తెలుగుదేశంలోని ‘కమ్మ’ కులానికిచెందిన వాణిజ్యవర్గాలను ఆకర్షించటానికి ఎన్టీర్‌ కుమార్తెనూ కాంగ్రెస్‌ ముందు వుంచబోతోంది. రానురాను, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల్లో కూడా పురంధేశ్వరికి కీలక పాత్ర వహించ వచ్చు కూడా.

ఇటు ‘సానుభూతి’ అటు ‘సెంటిమెంటు’ కీ మధ్య ఇరుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకోవటానికి ఇలాంటి పైపై మార్పులు పెద్దగా దోహదపడక పోవచ్చు.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్  ఆ:ద్ర వార పత్రిక 8నవంబరు 2012 సంచికలో ప్రచురితం)

Leave a Reply