ముంచుకొస్తున్న ‘భయమే’ ముందస్తుకు కారణం!

అయిదేళ్ళ సభను ముందే రద్దు చేసి, మరో అయిదేళ్ళ అధికారాన్ని కోరుతున్నారు కేసీఆర్‌. అయినా ఈ ఎన్నికలను ‘ముందస్తు’ అనకూడదు. అంటే ఆయనకు కోపం వస్తుంది. ఎంత ముందయితే ‘ముందస్తు’ అనవచ్చో మరి? ఇంకా ఎనిమిది నెలలు (అయిదురోజులు తక్కువ లెండి) పదవీ కాలం వుందనగా ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే, కేవలం ముందుగా కాదు, బాగా ముందుగా, మునుముందుగా వెళ్తున్నారు. అందుచేత ముందస్తు కాదు, ‘మునుముందస్తు’ అనవచ్చు. ఏలికలకు నచ్చినవే పత్రికల్లో శీర్షికలవుతున్న రోజులివి. ఏమి రాయాలో కాదు, ఎలా రాయాలో కూడా వారే సెలవిస్తున్నారు.

ఈ ‘మునుముందస్తు’కి వెళ్ళటానికి కారణం? ఆయన చెప్పినది ఒక్కటే: ప్రతిపక్షాల తీరు. వారేం చేస్తున్నారు? అడ్డుకుంటున్నారు. కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. ఎలా అడ్డుకుంటున్నారని, ఎవరూ అడక్కుండానే ఆయనే చెబుతారు. తాము వంద యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తుంటే, కాంగ్రెస్‌ వారు రెండు వందల యూనిట్లు ఇస్తామంటున్నారుట. అలాగే పించన్లు కూడా ఎక్కువ ఇస్తామంటున్నారుట. కేసీఆర్‌ బాటనే, కాంగ్రెస్‌ వారు వెళ్తామంటుంటే అడ్డుకోవటం ఎలా అవుతుంది? ఆ మాట కొస్తే, కాంగ్రెస్‌కు ఆ విద్యే (అడ్డుకునే విద్యే) తెలిస్తే, గట్టి ప్రతిపక్షంగానే నిలిచేది. సర్కారుకు వ్యతిరేకంగా ఏ ఒక్క అంశం మీదా, ఏ ఒక్కనాడూ, ఏ ఒక్క చోటా కాంగ్రెస్‌ వారు ఒంటి కాలి మీద లేచిన దాఖలాలు అసలు వున్నాయా- అని!? ఇంకా చెప్పాలంటే ఒంటి ‘చేత్తో’ (వారి గుర్తే అది!) చప్పట్లు కొట్టిన సందర్బాలే వున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు సరిగ్గా సన్నధ్ధం అయ్యే సందర్భంలో కాంగ్రెస్‌ శాసన సభా పక్షనేత జానారెడ్డి ఏం చేశారు? నగరంలో అయిదు రూపాయిలకే కేసీఆర్‌ సర్కారు ఏర్పాటు చేసిన భోజనాన్ని తెప్పించుకుని, ‘ఆహా ఏమి రుచి!’ అని మెచ్చుకోలేదూ..! ఏ ప్రతిపక్ష నేతయినా ఇంత పని చేస్తారా? ఇలాంటివి కోకొల్లలు. ఈ 4 యేళ్ళ 3 నెలల 5 రోజుల పదవీ కాలంలోనూ కేసీఆర్‌ సర్కారుని నిలబెట్టి కడిగేసిన ఉదంతం కాంగ్రెస్‌ కు ఒక్కటీ లేదు.

మరి ఇంకెలా అడ్డుకున్నారు? కేసులతో అభివృధ్ది పనులు ఆగిపోయాయన్నారు. ఏ కేసుతో ఏ అభివృధ్ది పని ఆగిపోయిందో వివరణ లేదు. తనవనుకున్నవి తన శైలిలో చేసుకు పోతుంటే, చోద్యం చూస్తూ ‘ఏదీ అనక పోతే బాగుండద’ని తగిలీ తగలకుండా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చేసే విమర్శలెప్పుడూ ‘జల్లెడ అడ్డు పట్టి ఊకతో కొట్టినట్టుంటుంది’. సచివాలయంలోనుంచి కాకుండా ప్రగతి భవన్‌ నుంచే సర్కారును నడుపుతానంటే, వారే మన్నా కాదన్నారా? తెలంగాణ రాష్ట్రంలోని తొట్టతొలి క్యాబినెట్‌ లో ఒక్క మహిళ కూడా లేకుండా పాలన సాగిస్తే, ఈ కాంగ్రెస్‌ నేతలు నిరసనగా ఏనాడయినా ఒక భారీ ఉద్యమాన్ని చేశారా? మహిళా శిశు సంక్షేమంలో కూడా మగమంత్రే కొలువు తీరినా ముక్కుమీద వేలేసుకున్నారే తప్ప, నిలదీశారా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఉద్యమించిన వారిలో మహిళలు లేరా? గట్టిగా మాట్లాడితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు లోక్‌ సభ ఆమోదంలో ముగ్గురు స్త్రీల ( యూపీయ్యే చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, విపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌, స్పీకర్‌ మీరా కుమారిల) పాత్ర నయినా గుర్తుకు రానందుకు పల్లెత్తు మాటన్నారా? దళిత నేత కన్నా ఎక్కువ గా దళిత సంక్షేమాన్ని ఆలోచించగలనని నమ్మించి ‘దళిత ముఖ్యమంత్రి’ కి ఎగనామం పెట్టిన కేసీఆర్‌, మహిళా, శిశు సంక్షేమాన్ని ఎప్పుడూ మహిళే చెయ్యాలా? అని మారు మాట్లాడకుండా తిప్పి కొట్టగలరు కూడా. నిజంగానే రద్దయిన శాసన సభలో పాలకపక్షంగా టీఆర్‌ఎస్‌ వైఫల్యం ఎంతో లెక్కదీయటం కష్టం కానీ, విపక్షంగా కాంగ్రెస్‌ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కాబట్టి వారికి టీఆర్‌ఎస్‌ సర్కారును ‘అడ్డుకునేంత’ దృశ్యం లేదు.

అసెంబ్లీని అర్థాంతరంగా ఎందుకు రద్దు వైపు కేసీఆర్‌ తీసుకు వెళ్ళాల్సి వచ్చిందో, ఏదో చెప్పాలి కాబట్టి ఈ కారణం చెబుతున్నారు కానీ, అసలు కారణం ముందే తెలిసిపోయింది. ప్రభుత్వమన్నాక వ్యతిరేకత వుంటుంది. అందులోనూ కొత్తగా ఏర్పడ్డ ఏ రాష్ట్రంలోనయినా అధికారంలో వున్న పార్టీ మీద పుట్టెడు వ్యతిరేకత వుంటుంది. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు అలా వుంటాయి. తెలంగాణలో ప్రజలు కోరుకున్నవి చాలా వున్నాయి. కేసీఆర్‌ తీర్చలేనివి చాలా చాలా వున్నాయి. (కానీ అడగనివీ, మ్యానిఫెస్టోలో లేనివీ చాలా చేశానంటున్నారు. నిజమే. నిరుద్యోగి జీతమొచ్చే ఉద్యోగం అడుగుతాడు. పించను అడగడు. అడిగినా మరీ వృధ్ధాప్య పించనులో సగంతో సరిపుచ్చుకుంటానని అనడు.) ఇలాంటి పథకాలు వచ్చేశాక సమస్యలు తీరిపోయాయని మీడియా గొంతుతో మోతెక్కించెయ్య వచ్చు. అయినా, నల్గొండలో ఎముకల వంగి నవయవ్వనులే ముసలి వాళ్ళలాగా ఫ్లోరొసిస్‌ వ్యాధిని మోసుకుంటూ తిరుగుతూనే వున్నారు; ఇంకా మహబూబ్‌ నగర్‌ నుంచి ముంబయికి బువ్వకోసం బస్సు ఎక్కుతూనే వున్నారు. నిజమాబాద్‌ నుంచి ఏ వీసా యేదో తెలీకుండా గల్ఫ్‌కు వలస పోతూనే వున్నారు. ప్రభుత్వం మీద ఆసంతృప్తి లేకుండా ఎలా వుంటుంది?

ఇలా చూస్తూ వుంటే ఈ వ్యతిరేకత పెరిగి పోవచ్చు. కానీ కేసీఆర్‌ స్థాయి నేత రాష్ట్రంలో ఏ విపక్షంలోనూ లేరు. కానీ ఒక్కొక్క సారి వ్యతిరేకత ఎలా వుంటుందంటే, అవతలి వాడు నేతా, కాడా, అన్నది కూడా పక్కన పెట్టించేస్తుంది. అసలు నేతే లేని పార్టీ అయినా సరిపెట్టేసుకుంటానంటుంది. కేసీఆర్‌ పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలనే చూద్దాం. 1989లో ఎన్టీఆర్‌ పాలన మీద కూడా వ్యతిరేకత వచ్చేసింది. కాంగ్రెస్‌లో ఎన్టీఆర్‌ లాంటి జనాకర్షక నేత లేరు. (చెన్నా, నేదురుమిల్లి, కోట్లలకు అనుభవం వుంటే వుండొచ్చు కానీ, వారికి ఆకర్షణ లేదు.) అయినా వ్యతిరేకత చూపటానికి అంతకు మించి పార్టీ కనపడలేదు. వేసేశారు కాంగ్రెస్‌కి వోట్లు.

ఇలాంటి ప్రమాదం పొంచి వుందని అందరి కన్నా కేసీఆరే ముందు గ్రహించారు. ఇది మాత్రం విజ్ఞతే. ఉండే కొద్దీ వ్యతిరేకత పెరిగే అవకాశం వుందని ఇట్టే పసిగట్టిన కేసీఆర్‌ అసెంబ్లీ రద్దుకు ఉపక్రమించారు. అందుకనే కాంగ్రెసే కాదు, ఇతర పక్షాలకు ఊపిరి పీల్చే సమయం కూడా ఇవ్వకూడదనుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండానే చక్కబడిపోదామనుకున్నారు. అన్ని సార్లూ, కేసీఆర్‌ అనుకున్నట్లే జరిగిపోతే, ఇతర నేతలు నిజంగానే రాజకీయ సన్యాసం చెయ్యాలి. కేసీఆర్‌ ముచ్చటపడి వారిని ‘సన్నాసులు’ అని తిడతారు కానీ, వారు ఆయన మాటను నిజం చేస్తారా? ఏమిటి?

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *