తినేటప్పుడు కబుర్లు చెబితే అమ్మకు నచ్చేది కాదు. ‘నోరు మూసుకుని తిను,’ అనేది. ఈ వాక్యం విన్నప్పుడెల్లా, నవ్వొచ్చేది. కానీ, నచ్చేది. వెంటనే ఈ వాక్యానికి పేరడీలు చేయాలనిపించేది. ‘కళ్ళు మూసుకుని చూడు’, ‘కాళ్ళు ముడుచుకుని పరుగెత్తు’ ‘చేతులు కట్టుకుని చప్పట్లు కొట్టు.’
అమ్మ వాక్యాన్ని అక్షరబధ్ధంగా అమలు చెయ్యటానికి నేనేమన్నా పార్థుణ్ణా? వొళ్ళు వంచి సంపాదించుకొచ్చినట్లు, విల్లు వంచి తెస్తాడు ద్రౌపదిని. ఆ విషయం శుధ్ధ వచనంలో చెప్పొచ్చు కదా! ‘అమ్మా! పండు తెచ్చానే’ అని కవిత్వం వెలగబెడతాడు. ఆమెకు మాత్రం అది వచనంలాగానే అనిపిస్తుంది. ‘అయిదుగురూ పంచుకోండి’ అంది. కొన్ని విషయాల్లో మాతృవాక్పరిపాలకులయిన పాండవులు, వాక్యాన్ని వాచ్యంగా తీసుకుని అమలు జరిపేశారు. కథే కావచ్చు. వాక్య రహస్యం చెబుతోంది.
ఆలా నేనూ అమ్మ వాక్యాన్ని అమలు చేస్తే, మెతుకు కూడా లోపలకి పోదు. అలాగే, ‘ఆవేశపడకుండా వాక్యం రాయి’ అన్నారనుకోండి. ఒక్క మాట పడదు.
తిండికి నోరెంత ప్రధానమో, వాక్యానికి ఆవేశం ముఖ్యం.
‘నిన్ను నువ్వు నిగ్రహించుకుని రాయి’ అని అనటం సులువే. కానీ రాయటమే కష్టం. కళ్ళ నీళ్ళు రాకుండా ఏడ్చినంత కష్టం. ఏడ్చినట్టుంది ఈ నియమం.
కానీ అవేశాన్ని ఆవేశంలా చెప్పటం ఎంత అవసరమో, ఆలోచనని ఆలోచనలా చెప్పటం కూడా అంతే అవసరం. ఆలోచించే యుగానికి ఆవేశకావేశాలంటని వాక్యంతో చాలా వని వుంటుంది.
లేకుంటే ‘పండు’లాగే, భావం కూడా అయిదు ముక్కలయి పోతుంది. సమాచారాంతరం జరిగి, సమాజం విలావిలా తన్నుకుంటుంది.
కోరిక మీద మోజు, తీర్చుకున్న వాడికన్నా, నిగ్రహించుకున్నవాడికి ఎక్కువ వుంటుంది. కోరికను తీరిక లేకుండా మోసుకు వెళ్ళగలిగిన వాడు కూడా అతడే. కాబట్టి శుధ్ధ వచనంలా కననడే ‘నిగ్రహ వాక్యం’లో అణచి పెట్టుకున్న కోపాలూ, దు:ఖాలూ, అవమానాలూ లోలోపల కనిపిస్తూనే వుంటాయి. కానీ ఒళ్ళు విరుచుకుని మీద పడవు.
విమర్శ చేసే వాడికి ఈ వచనంతోనే పని. ఇదే ‘బౌధ్ధిక వచనం’
అందరం పనులు చేస్తాం.. మీద వేసుకున్న పనులు కావచ్ఛు; మీద పడ్డ పనులు కావచ్చు.నా వరకూ వస్తే, కవిత్వమో, కథో, వ్యంగ్యమో… ఇవి మీద వేసుకున్న పనులు. విమర్శ మీద పడ్డ పని. నా బైక్ మీద నేను పోతుంటే, ప్రయాణాన్ని ఆపి పోలీసాయన ‘ఫైన్’ కట్టమంటాడు. తప్పుడు కేసే అని తెలుస్తుంటుంది. నిరూపించుకోవాలి. ఒక్క లాయరూ సహకరించడు. ఏం చేస్తాను? నాకు నేనే నల్ల కోటు వేసుకుని ‘యువరానర్’ అన్ని బల్ల గుద్దేస్తాను..’లా’ చదువుకునే లెండి. ఇది మీద పడ్డ పని.
ఒక్క సారి మనకేసు మనం వాదించుకోవటం వచ్చేసిందంటే, ఎవరి కేసయినా తీసేసుకోవచ్చు. సాహిత్యంలో విమర్శకుడి దగ్గరకి పెద్ద పెద్ద కేసులొస్తాయి. ఒక రచయిత ‘వెనక్కి వెనక్కి వెళ్తూ ముందుకు నడుస్తున్నాని దబాయిస్తాడు’. ఇప్పుడు విమర్శకుడు నిరూపించాల్సింది నడక గురించి కాదు; పాదాల గురించి. ‘అయ్యా! రచయిత గారూ. మీకున్నవి ‘భూత’ పాదాలు. వెనక్కి తిరిగి వున్నాయి.’ అని చెప్పగలగాలి. ఇంకో పని వుంది. ‘ప్లాస్టిక్ పువ్వు తెచ్చి, చెట్టుకు పూసిందే’ అని ఇంకో రచయిత బుకాయిస్తాడు. అప్పుడూ విమర్శకుడి అవసరం వుంది. ‘కొలిచి చూశాను. అన్ని రేకలూ ఎంత సైజు వుండాలో, అంతే సైజులో వున్నాయి. ఇన్ని లెక్కల్తో పూసేంత శక్తి చెట్టుకు లేదని’ నిరూపించగలగాలి. ముందు కష్టమనిపించింది కానీ, చేసే కొద్దీ ఇష్టమయి పోయింది.
మూడు దశాబ్దాలు. ముడుచుకుని కూర్చున్నా, గడిచిపోతాయి. మనం సోమరులుగా వుండటం మిత్రులకు నచ్చుతుంది కానీ, శత్రువులకు నచ్చదు. గిచ్చి లేపుతుంటారు. అలా లేచినప్పుడెల్లా రాస్తూ వచ్చాను. అన్నిటితో పాటు విమర్శా చేశాను. ఇందులో పనికొచ్చే పరిశీలనలుంటే శత్రువుల చలవే. శత్రువులంటే పీకలు తెగ్గోసేవారని కాదు. వారికీ ప్రేమించటం తెలుసు. దయ్యాల కథల్లో ‘కామెడీ’ దయ్యాలుంటాయి. ఆరుబయిట మంచం వేసుకుని పడుకుంటే, నిద్రాభంగం కలగకుండా,ఇంకా విశాలమైన స్మశానం దగ్గర మంచాన్ని పెడుతుంటాయి. ఇలాంటి శత్రువులు సాహిత్యంలో వుంటారు. ఏదో ముచ్చట కొద్దీ శత్రువులంటున్నాను కానీ, వారు కూడా ‘సాహిత్యం’ దాటితే మిత్రులే. వీరు కూడా మంచాలను మార్చినట్లు క్యాలెండర్లు మార్చేస్తారు. నకలును అసలులాగా, అసలును నకలులాగా చేస్తారు. తమాషాకే.
కానీ చరిత్రలో ఏ రచయిత స్థానంలో, ఆ రచయితను కూర్చోబెట్టాలి. ఒక్కోయుగంలోఒక్కొక్కరు ముఖ్యమయిపోతారు. వారు స్త్రీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, దళితులు కావచ్చు, వెనుబడిన కులాలు కావచ్చు, ప్రాంతీయంగా వెనుకబడిన వారు కావచ్చు, ఆదివాసులు కావచ్చు. వీరి పట్ల పక్షపాతం లేకపోవటం, నిజమైన పక్షపాతమవుతుంది. ఇలా పక్షపాతానికి పాల్పడినందుకు, ఈ పుస్తకం చదివి నా మీద కేసు పెట్టవచ్చు.
-సతీష్ చందర్
25 అక్టోబరు 2015
(29 అక్టోబరు 2105 న విడుదలయన నా విమర్శగ్రంథం ‘నిగ్రహ వాక్యం‘ లోని నా ముందు మాట)
Nice review. Satish chandargaaru is a very talented writer that we have in Telugu literature world