ఏ భాష నేను మాట్లాడాలి? ((Which language should I speak?)) అరుణ్ కాంబ్లే అనే మరాఠీ దళిత కవి ప్రశ్నిస్తాడు. నిజమే. దళితులకో భాష ఉంటుందా? ఉంటే ఎలా వుంటుంది?
”ఒరే కొడకా. మనం మాట్లాడినట్టు మాట్లడరా. మనలా మాట్లాడు” అంటాడు కులవృత్తి వీపున మోస్తున్న తాత.
”ఓరి దద్దమ్మా! భాషను సరిగా ఉపయోగించరా! అంటాడు వేదాలు చదివే పిలక బ్రాహ్మణోపాధ్యాయుడు.
”ఇప్పుడు చెప్పండి నేనే భాష మాట్లాడాలీ’’ అంటూ కాంబ్లే తన కవితను ముగిస్తాడు.
అయితే బూతూ లేకుంటే వేదం… మధ్యలో వేరే భాషంటూ ఏమీ లేదా?
భాష ఒకడి సొత్తుకాదు. అది సమాజ సంపద. వేల సంవత్సరాల పాటూ వాడలో వుండిపోయిన వాడు ఇప్పటికైనా ఆ సంపద మీద హక్కు ప్రకటించనవసరం లేదా? క్రిష్టఫర్ కాడ్వెల్ మాటల్లో చెప్పాలంటే భాష సామూహిక విజ్ఞానానికి చెందిన ఉమ్మడి వాహిక’ (The common medium of collective wisdom) అలాంటి ‘సంపద’ మీద సమాజపు చోదక శక్తులైన దళితులూ, శ్రామికులు ఏదో ఒకనాడు తమ ఆధిపత్యాన్ని ప్రకటించాల్సి ఉంది. అందుకు శ్రామికవర్గ దళిత స్పృహలతో సాగే ఉద్యమాలు నేడు బాటలు వేస్తున్నాయి.
ఈ స్థితిలో కొందరు దళిత కవులూ, సోకాల్డ్ దళిత విమర్శకులూ ఇప్పటికీ దళిత కవి ‘బూతే’ వాడాలంటున్నారు. అశ్లీలం కాని ప్రతీ పదాన్నీ ‘బ్రాహ్మణ్యం’ చేసి అగ్రవర్ణ కవులకు అప్పనంగా ఇచ్చేయాలన్నది వారి ఉద్దేశం కాబోలు!
ఈ మధ్య ‘నిశాని‘ అనే పేరుతో నలుగురు దళిత కవుల కవిత్వాన్ని అచ్చువేసారు. దీనికి వారు ‘ధిక్కార కవిత’ అని పేరు పెట్టారు. వారు ‘దళిత భాష’ పేర వాడిన పంక్తుల్ని కింద ఉదహరిస్తున్నాను (పాఠకులు మన్నించాలి)
”ఒక్కొక్కడ్నీ పైనించి కిందికి
చించేసే రోజులు దగ్గరలోనే
ఒక్కొక్క నా కొడుకుని
డాష్ లో తన్నే రోజు
మనకీ వచ్చుద్ది”
– వరదయ్య
‘‘ఒకానొక ఉన్మాదంలో ఊగీ ఊగీ
నవారు మంచం సందుల్లో
సుఖంగా స్ఖలనంచేసుకోవడం కాదురా నాన్నా!
రత్యానంతర శిశ్నాల్లాంటి
నాలుగు ఎంగిలి ముక్కలేరుకుని
కాగితాల కంటించి
అచ్చుకి పంపటం కాదమ్మా
నన్నయ్య వృషణాల మధ్య తడుముకుంటూ
చలం చంకల్లో తచ్చాడుతూ
గురజాడ ఉచ్చ మగుడులో
మాలపక్కెలు పడుతూ…’’
– మద్దూరి నగేష్ బాబు
పన్నెండ్రూపాయల కూలీ సాక్షిగా మీ
అప్ప చెల్లెళ్లని చెరుస్తాం
చిత్రహింసయే చిదానందమూ
మానభంగమే మధురమూ అని పాటలు కట్టి
పల్లె పల్లెకీ తిరిగి ప్రచారం చేస్తాం
– పైడి తెరేష్‌బాబు
ఇవి మచ్చుకు మాత్రమే. పదిపదిహేనేళ్ల క్రితం శ్రామికవర్గ భాష పేరు మీద అక్కడక్కడ ఊత పదాల్లా బూతు పదాలు ప్రజా గాయకులు ఉపయోగిస్తున్నప్పుడే ఈ చర్చలు జరిగాయి. బూతులు ప్రజల మీద రుద్దబడ్డ పదాలే. ఇంకా చెప్పాలంటే ప్రజలకు మిగిల్చిన పదాలు. అప్పటి ప్రజాగాయకులు సహృదయంతో అర్థంచేసుకొని బూతుపదాల ప్రయోగాల్ని మానుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాలు సైతం బిడియపడే బూతుని దళిత భాష పేరుమీద వాడుతున్నారు.
ఏది దళిత భాషో అర్థం కావాలంటే ముందు ఏది దళిత ప్రశ్నో అర్థం కావాలి. దళిత స్పృహకు ఏ భాష తక్షణ సాంస్కృతిక అవసరమయ్యిందో తేల్చుకోవాలి.
మన దేశంలో ‘వాడ’ వరకూ వచ్చిన రెండు విగ్రహాలున్నాయి. ఒక విగ్రహానికి ఒక అంగోస్త్రం మినహా ఒంటిమీద ఏ దుస్తులూ ఉండవు. మరో విగ్రహానికి అవసరానికి మించి వేసుకున్నాడా అనిపించేటన్ని దుస్తులుంటాయి.
మొదటి విగ్రహం గాంధీ.
రెండవ విగ్రహం అంబేద్కర్
ఇద్దరి విగ్రహాల్లోనూ నిరసన వుంది.
నా దేశంలోని అధిక సంఖ్యాకులకు అన్నవస్త్రాలు లేనపుడు నాకెందుకిన్ని వస్త్రాలూ అన్నది గాంధీ నిరసన. నా దేశంలో వేల సంవత్సరాల పాటూ నా తల్లుల గుండెల మీద వస్త్రాల్లేకుండా చేసారు కాబట్టి దొరికిన అన్ని వస్త్రాలు దర్జాగా ధరించాలి అన్నది అంబేద్కర్ నిరసన
మొదటిది ఆర్థిక నిరసన
రెండవది సాంఘిక నిరసన
దళితుడు ఈ దేశంలో అదనంగా చెయ్యాల్సింది సాంఘిక నిరసన.
III III III
ఆధునికాంధ్ర సాహిత్యంలో ఇద్దరు ప్రముఖ కవులున్నారు.
ఒకరు ‘ఛందో బందోబస్తులు ఛట్‌ఫట్’ మని తెంచేసిన వచన కవి.
మరొకరు: ఛందోబద్ధంగానే రాసి ‘భళీ భళీ’ అనిపించుకున్న పద్య కవి.
మొదటివారు అగ్రవర్ణ కవి : శ్రీశ్రీ
రెండవ వారు దళిత కవి : జాషువా
కొన్ని తరాల పాటూ ‘ప్రాసలతో క్రీడించి’ వినోదించిన ‘వర్ణం’ నుంచి శ్రీశ్రీ ఆవిర్భవించాడు. అక్షరానికేే నోచుకోని గతంలోంచి జాషువా పుట్టాడు.
ఛందస్సును వదలడం ఒకరికి నిరసన; ఛందస్సునూ, అలంకారాలనీ తనివి తీరా ఉపయోగించుకోవడం ఇంకొకరికి నిరసన.
వచన కవిత్వ ఫలితాలు చవిచూస్తున్న కాలంలో కూడా జాషువా పద్యమే రాయడం సాంఘిక నిరసన. ఎందుకంటే అంతవరకూ ‘వృత్తం వెలుపలే ఉత్తవచనంలా పరిభ్రమించాల్సి’ వచ్చింది దళిత కవి. ‘హైందవ పద్యానికి అతికిన అయిదో పాదానికి‘ పద్యం మీద తన ఆధిపత్యాన్ని ప్రకటించాల్సి వచ్చింది.
III III III
దళిత ప్రశ్న.. దళితుడు ఆర్థిక ప్రశ్నతో పాటు అదనంగా వేస్తున్న సాంఘిక ప్రశ్నలో ఉంది. అంబేద్కర్ కాలం నుంచి నేటివరకూ దళితుడు సాంఘిక ప్రశ్నల్ని చాలా సూటిగా వేస్తున్నాడు.
ఇంతకీ ఏది సాంఘిక ప్రశ్న. ఉన్న ‘వర్ణ’ వ్యవస్థలో ఏది ‘అగ్రవర్ణుడికి’ గర్వకారణంగా వుంటుందో అది తానెందుకు పొందకూడదన్నది సాంఘిక ప్రశ్న.
అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ (Annihilation of Caste) అనే ఉపన్యాసంలో ఈ ప్రశ్నకు అనేక ఉదాహరణలిచ్చారు.అందులో ఒకటి 1935 ప్రాంతంలో జైపూర్ దగ్గర చక్వారా గ్రామంలో జరిగిన ఘటన. చక్వారాలో ఒక ‘అస్పృశ్యుడు’ తీర్థయాత్రలకు వెళ్లి తిరిగొచ్చిన సందర్భంగా సాటి అస్పృశ్యులకు విందు చేసాడు. ‘గర్వకారకాల’న్నీ అభివృద్ధికరమైన అంశాలే కాకపోవచ్చు. కానీ వాటిమీద ఆధిపత్యం సంపాదించాలను కోవడం దళితుడికి సాంఘిక, సాంస్కృతిక అవసరం అనిపిస్తుంది.
ఇప్పుడు కవిత్వంలో భాష విషయానికొద్దాం. వ్యవహారిక భాషోద్యమ, వచన కవిత్వోద్యమ ఫలితాలను పూర్తిగా అనుభవిస్తున్న కాలంలో మనం వున్నాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలుగు కవిత్వంలో ఇవి అభివృద్ధికరమైన అంశాలు. అవే ‘గర్వకారకాలు’ గా కూడా వున్నాయి. జాషువా కాలంలో ఇలా లేదు. అప్పుడు పద్యం గర్వకారకం. వచన కవిత్వం అందుబాటులో వున్న అభివృద్ధికర అంశం. ఆయన విధిగా ఒకటే ఎంపికచేసుకోవాలి. పద్యాన్నే ఎంపిక చేసుకున్నారు.
ఇప్పుడు కవిత్వంలో వచన కవిత్వం గర్వకారకమే. అందుబాటులో వున్నదీ వచన కవిత్వమే. కాబట్టి నేటి దళిత కవికి సంధ్యా సమస్య లేదు. హాయిగా వచన కవిత్వం రాసుకోవచ్చు. కథా, ఛందస్సులను కాదని, నినాదాలను పక్కనపెట్టి, కాచి వడపోసిన జీవితానుభవాలను స్పష్టంగా, సాంద్రంగా చెప్పగలగడం నేటి వచన కవిత్వ లక్షణం. అదే ‘గర్వకారణం’ కూడాను. అయితే అస్పష్టంగానూ, లేకుంటే నినాద ప్రాయంగానూ వున్న ఆధునిక తెలుగు కవిత్వాన్ని 80 వ దశకంలో వచ్చిన స్త్రీ వాదకవులు రక్షించారని చెప్పుకోవచ్చు. వాళ్లు కవిత్వంలోకి అనుభవాలను ప్రవేశపెట్టి, అస్పష్టత నుంచి, నినాదాలనుంచీ,కవిత్వాన్ని రక్షించారు. అలాంటి వచన కవిత్వాన్ని అందుకున్న ఆధునిక దళిత కవి ఏమి రాయాలి? నినాదాలు రాసి కవిత్వమని బుకాయించడానికి వీలులేదు. అలా చేస్తే నవ్వుకుంటారు. తిట్లూ, శాపనార్థాలూ పెట్టడానికి అశ్లీలాలు వాడితే అసలుకే మోసం వస్తుంది. ఎందుకంటే స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని ప్రకటించి వున్నారు. స్త్రీలను కించపరిచే ‘బూతు’ ను ఏ కవి వాడినా తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుంది. కాబట్టి వెనుక ‘దిగంబర కవులు వాడిన భాషనే నేడు దళిత కవులు మక్కికి మక్కికి దించాలనుకోవడం వీలుపడదు. సరికదా స్త్రీవాద కవిత్వం తెచ్చిన చైతన్యం మీద మొరటుగా దాడిచేసినట్టుంటుంది.
దళిత జీవితానుభవంతోనే దళిత కవిత్వానికి జీవం పొయ్యాలి. ఈ అనుభవం చెప్పడానికి ప్రత్యేకమైన భాష వుంటుందా? ఈ అనుభవాన్ని కవిత్వం ద్వారా ఎవరికి చెబుతున్నాం? దళిత కవిత్వాన్ని కేవలం దళిత పాఠకులే చదవరు. అక్షరాస్యతకి అధిక సంఖ్యాకులైన దళితులు ఇంకా దూరంగానే వున్న నేపథ్యంలో కవిత్వ పాఠకుల్లో దళితులే తక్కువ వుంటారు. దళితేతర పాఠకులే ఎక్కువ. వీరి హృదయాల్లోకి కూడా దళిత కవి ప్రవేశించాలి. దళిత అభివ్యక్తిని నిర్ణయించడంలో ఇదీ ప్రధానాంశమే.
ముందు ఇప్పుడు నడుస్తున్న ‘ఆధునిక అభివ్యక్తి’ మీద దళితుడు జెండా పాతాలి. కవిత్వ భాష వ్యవహారికమైనప్పుడే అందులో శ్రామికవర్గాల, వర్ణాల జాతీయాలు ప్రవేశించాయి. భాష చేత మడికట్టించడం ఇప్పుడు ఎవరివల్లా కాదు. తెలుగులో కలగలిసిన ‘సంస్కృత పదాలనీ,’, బ్రాహ్మణ పదాలనీ, ఇంగ్లీషు పదాలనీ, వలస వాదుల పదాలనీ గిరిగీసుకు కూర్చుంటే మనం మాట్లాడలేం. రాయలేం. సమస్త పదాలను సొంతం చేసుకున్న ‘సహస్రాక్షరుడు’ కావాలి నేటి దళిత కవులు. అలాకాకుంటే అన్ని పదాలను అగ్రవర్ణాల వారికి ధారాదత్తం చేసి మన ‘నిశాని‘ కవుల్లా ‘బూతు’ లతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది.
భాష ఉత్కృష్ట(heightened form) రూపమే. కవిత్వమన్నారు కానీ నికృష్ట రూపం (Frightened form) కాదు. ఇవాళ దళిత కవి కోసం పదాలు అగ్రవర్ణ కాపురాలను కాలదన్ని లేచిపోవాలి. వర్ణక్రమాలు లేని వాడలకు వలస రావాలి.
అయితే ఆ పదాలతో దళిత కవి ‘కొత్త అభివ్యక్తి’ నిర్మించుకోవాలి. కవిత్వం చెప్పే పద్ధతిలో మట్టినుంచి పుట్టిన దళితుడికి సహజ అభివ్యక్తి కచ్చితంగా ఒకటి వుంటుంది. అది కనిపెట్టాలి. ప్రకృతి ఒడిలో నిత్యం పారవశ్యం చెందేవాడు దళితుడు. గద్దర్ పాటల్లోనూ, శివసాగర్ కవిత్వాల్లోనూ ఈ అభివ్యక్తి కనిపిస్తుంది. కాకుంటే అది ‘ఆర్థిక నిరసన’ కే పరిమితం చేసారు. ఇప్పుడు ‘సాంఘిక అభివ్యక్తి’ ని దళిత కవి Discover చేసుకుంటున్నాడు.
ఏ అభివ్యక్తి ‘అగ్రవర్ణ కవి’ కి గర్వకారకమయ్యిందో దానిని కొల్లగొట్టి దానిమీద దళితుడు తాను Discover చేసిన తన అభివ్యక్తిని ప్రతిష్టించబోతున్నాడు. భాషా సర్వస్వం మీద దళిత కవి తన హక్కును ప్రకటించబోతున్నాడు. ఈ సమయంలో మెడలో ముంతకట్టినట్టు, దళితుడి నోటికి బూతు కట్టకండి. దళితుడికి దుర్భాషలే మిగిల్చి, తిరిగి వాడకే పరిమితం చేయకండి. అనాగరీకుణ్ణి చేసి అగ్రహారికుల ఆనందానికి ఆజ్యం పోయకండి.
-సతీష్ చందర్
– ఉదయం, 22 మే1995
(ఈ వ్యాసాన్ని నా విమర్శ గ్రంథం ‘నిగ్రహవాక్యం’లో కూడా చేర్చాను. ఈ గ్రంథం మార్కెట్లో దొరకుతుంది.)
Sir vyasam baguntundi
నిగ్రహ వాక్యం -విశాలాంధ్ర లో దొరికితే తీసుకుంటాను సార్…
95 లో రాసినా ఇప్పటికీ relevance ఉంది..
అగ్నిపర్వతం నుండి వెలువడ్డ లావాలా కళ్ళముందు కడలాడిన ప్రతీ అక్షరం భగ్గున మండుతూ సాగుతోంది …
Thank you sir for writing this fascinating essay. It is very insightful.