కరచాలనమొక స్పర్శ. కౌగలింత మహా స్పర్శ. ముద్దు మహోన్నత స్పర్శ. అవును. దేశ భాషలందు ‘దేహ భాష’ లెస్స. తల్లి తల నిమిరినా, తండ్రి గుండెలకు హత్తుకున్నా, గురువు వెన్ను తట్టినా, ప్రియురాలు ఒంటికి ఒంటిని అంటుకట్టినా స్పర్శే కదా! మనిషిని మనిషి తాకవద్దన్నవాడు ‘దేహ’ద్రోహి!తాకని తనాన్ని వెలి వేద్దాం.
ఏదేని
ఒకవనమయినా,
ఆమె, నేను
వుంటే ఏదెను వనమే.
అక్కడ తినవద్దన్న
ఫలాలను తినకుండా
వుండలేను.
ఒకరి నొకరు తాకవద్దన్నా
వినలేను.
వేరు వేరుగా వచ్చే వరాల కన్నా
కలివిడిగా పొందే శాపాలు మేలు.
సిరి తీసుకున్నా, కలబోసుకునే!
ఉరి వేసుకున్నా పెనవేసుకునే!
రెండు దేహాల ఏకవచనమే
మోహం!
ఆవలి వొడ్డులేని ఆనందమే
మోక్షం!
తాకని తనమే పాపం!
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రిక లో ప్రచురితం)
tick pettestunnara sir. tonite i am going to read as much as i can in your blog.