ఈ నూటొక్క ప్రేమ కథలూ తొమ్మిది సైట్లలో దొరకుతాయి. ఒక్కొక్క సైట్లలోనూ డజను వరకూ వుంటాయి. నిజానికి నూటొక్క కథలంటున్నాను కానీ, రాసింది మాత్రం నూటొక్క మనస్తత్వాలు. అవి లవ్వున్న జీివితాలు, నవ్వున్న మనస్తత్వాలు:
- మార్కెట్ సైట్
ఇవ్వాలీ, పుచ్చుకోవాలీ కాదు. అమ్మాలి, కొనాలి. అదే మార్కెట్. బోడి హృదయాలు ఎవరకయినా వుంటాయి. ఉత్తిని ఇచ్చేస్తానని తిరిగితే ఎవరూ కొనరు. మార్కెటింగ్ లేకుండా ఒక్క మనసూ అమ్ముడు పోదు.పిల్ల బాబుకి పదికోట్ల ఆస్తి. ఒక్కతే పిల్ల. రాతకోతలూ, రిజిస్ట్రేషన్లూ లేకుండా కొట్టెయ్యాలంటే ఎలా? పిల్లను ఎత్తుకొస్తే కేసులవుతాయి. అందుకే కొనెయ్యాలి. రూపాయి బిస్కెట్టుకి, వందరూపాయిల ప్యాకింగ్ చేసినట్టు, పుట్టీపుట్టని ప్రేమను పది పొగడ్తలతో మూటగట్టి అమ్మెయ్యాలి. తాజా ప్రేమల్నే కాదు, వాడి వదిలేసిన ప్రేమల్ని కూడా ‘ప్రీవోన్డ్ కార్లు’ అమ్మినట్టు అమ్మెయ్యవచ్చు. అందుకోసం ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్.. అన్నీ మార్కెట్ సైట్లే. - క్రైమ్ సైట్
‘నువ్వు పెద్దయ్యాక ఏమవుతావూ..? డాక్టరువా, ఇంజనీరువా?’ అని రెండే ఆప్షన్లు ఇచ్చి అడుగుతారు. అడగటం తప్పు కాదు. ఇచ్చిన ఆప్షన్లు తప్పు. ‘బేరగాడివవుతావా? నేరగాడివవుతావా?’అనడగాలి. ఈ విషయం మీరు చెప్పకపోతే, చెప్పటానికి సవాలక్ష యూట్యూబ్ చానెళ్ళున్నాయి.
బేరంలోనో ఏమోకానీ, నేరంలో మాత్రం కిక్కు వుంది. కిక్కంటే ఏమిటీ? అమాంతం పైకి లేపెయ్యటమే కదా! కష్టపడి పైకి రావటమంటే, మెట్లెక్కి పదో ఫ్లోర్‌కు వెళ్ళినట్లుంటుంది. అదే ఎలివేటర్ (లిఫ్టు) మీద వెళ్ళండి, బీరుకొట్టి తేలినట్లుంటుంది. ఎస్కలేటర్ అయితే విస్కీయే..! దానిని ‘విస్కీ’లేటర్ అనుకోవచ్చు. గాలిలో ఎగిరిపోవచ్చు. ‘ప్రేమే నేరమౌనా?’అని పాడుకుంటూ, ప్రేమగా క్రైమ్ చెయ్యవచ్చు. ప్రేయసికి కూడా నేరాన్ని వైరస్‌లా ఎక్కించ వచ్చు. - క్యాస్ట్ సైట్
లేకున్నా వున్నట్లు కనిపించేది ప్రేమ; ఉండి కూడా లేనట్లు అనిపించేది ప్రేమ. అదేమిటో క్యాంపసుల్లో కులాలే లేనట్లుంటాయా? ఒకడి కులం ఒకడు అడగనట్లే వుంటారా? కానీ కలసి కాఫీ తాగే క్యాంటీన్ల దగ్గర నుంచి, ఒకరినొకరు కుమ్మేసుకునే మందు పార్టీల వరకూ, ఎలా వస్తారో, ఒకే కులం వాళ్ళు జమవుతారు.
ప్రేమలూ అంతే. పరిచయమయ్యాక పిల్ల పేరడగుతారు కానీ, చెప్పినప్పుడు వినరు. ఇంటిపేరుతో చెప్పాకే, మనసులోని ప్రేమ పొంగుకొస్తుంది. వెనకా ముందూ చూసుకుని ప్రేమించటం అంటే ఇదే మరి. పేరుకు ముందు ‘ఇంటిపేరు’ చూస్తే కొంతవరకూ తెలిసిపోతుంది. లేదూ అంటే వెనక చూడాలి, రావో, రెడ్డో, చౌదరో, నాయుడో..ఏదో ఒకటి వుండి తీరుతుంది కదా! అలా చూసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయాడనుకో, కులం ఎన్‌కౌంటర్ చేసేస్తుంది. ఐ మీన్ పరువు హత్యలో పోతాడు. - డస్ట్ సైట్
పంట కోసుకుని, పరిగె వదిలేసినట్లు, పెద్ద బేరాలూ, పెద్ద నేరాలూ పెట్టి పుట్టిన వాళ్ళు కొట్టేసి, చిల్లర బేరాలూ, చీప్ నేరాలూ దరిద్రులకొదిలేస్తారు. నిండు బ్యాంకుల్ని ఆగర్భ శ్రీమంతులు దోచుకుంటే, ఖాళీ పర్సుల్ని దిక్కుమాలిన వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళు లండన్ వెళ్ళతారు. వీళ్ళు లాకప్‌కు పోతారు అంతే తేడా. దరిద్రంలో ప్రేమ పుట్టదా- అంటే పుడుతుంది. విశాలమైన ఇళ్ళల్లో కన్నా, ఇరుకు గదుల్లో ముందు పడుతుంది. ఒక్కో గదిలో పది మందిని పడేస్తే, స్పందించేవి హృదయాలు కాదు దేహాలే. చూడకూడనివి చూసేశాక చేయకూడనివి చెయ్యాలనిపిస్తుంది. అక్కడ పుట్టిన పసివాడు వీధిబడిలోకన్నా, పిల్ల వొడిలో ముందు పడిపోతాడు. - క్యాంపస్ సైట్
క్యాంపస్ ప్లేస్‌మెంట్ కు పేరొందిన కంపెనీలే రానక్కర్లేదు. ఆ మాట కొస్తే లైఫ్‌లో సెటిలవ్వటానికి ప్లేస్‌మెంటే అక్కర్లేదు. చిన్న స్టేట్ మెంట్ చాలు. ‘ఐ లవ్యూ’ అని. అది కూడా అందగత్తెనుంచే రావాలని రూలు లేదు. మంచి ర్యాంకున్న అమ్మాయి ఆ మాట అంటే చాలు, నడిచే బ్యాంకు దొరికినట్లే. ఆ పిల్లకు ఎలాగూ ప్లేస్‌మెంట్ వుంటుంది. క్యాంపస్‌లో చేరిన మొదటి ఏడాదే ఆమె హార్ట్‌లో ప్లేస్ రిజర్వ్ చేసుకుంటే అది అసలయిన ప్లేస్ మెంట్. అంతే కాదు, వీలు దొరికినప్పుడెల్లా, ‘ఐ హేట్ డౌరీ’ అని గప్పాలు కొట్టవచ్చు. మరి లాస్ కదా..! కానే కాదు. గోల్డెన్ డక్. నెలనెలా గుడ్డు పెడుతుంది. జీతమంటే నెలసరి కట్నమే కదా! ఈ మాత్రం ప్లానింగ్ లేని వాడు క్యాంపస్ లవ్ కు అనర్హుడు. - వెడ్డింగ్ సైట్
పెళ్ళి ముందా? ప్రేమ ముందా?. అబ్బే.. ఇంత ఆలోచించుకునే టైమ్ వుంటుందేమిటీ? వివాహం వచ్చినా, వీసా వచ్చినా ఆగదు అంటాడు- పెళ్ళి చూపులకు అమెరికానుంచి వచ్చిన కుర్రాడు. అమెరికా సంబంధం అనగానే ‘అల్లుడూ’ అని పిలిచేస్తాడు పిల్ల తండ్రి. అంతే. నెలలో తుర్రుమంటుంది. అప్పుడు పిల్లకు తెలిసి వస్తుంది, ‘ఫ్లయిటు మిస్సవుతానన్న’ హడావిడిలో, ప్రేమను మిస్సయ్యానని. పోనీ పెళ్ళాయ్యాక, మొగుణ్ణే, ప్రియుడనుకుని- ఐ మీన్ ‘హబ్బీ’నీ ‘హనీ’ అనుకుని- సరికొత్తగా ప్రేమించుకోవచ్చుగా..! సస్పెన్స్ ముందే తెలిసిపోయిన సినిమాను సగం నుంచి చూసినట్లుంటుంది. వద్దన్నా ఇంటికొచ్చేస్తాడు. ఎదురు చూసేదేముంటుందీ..!? అయినా కొందరు ట్రై చేస్తారు.. చేస్తూనే వుంటారు. - ఆఫీస్ సైట్
ఉద్యోగం.. ఉద్యోగం అంటారు కానీ, అది వచ్చాక సగం జీవితం చల్లారి పోతుంది. చల్లగానూ వుండదు, వెచ్చగానూ వుండదు, లంచ్ బ్యాక్సుల్లోని అన్నం లాగా. ఆవేశాలుండవు, ఆత్రుతలూ వుండవు. లవ్ ప్రపోజల్ కూడా, లోన్ ప్రపోజల్ అంత తీరిగ్గా చెయ్యవచ్చు. అప్రోవ్ అయినా మంచిది. కాక పోయినా మంచిది. అందుకే అక్కడ పుట్టిన ప్రేమలు వెబ్ సిరీస్ లా వుంటాయి. ఎవరూ ఏదీ తేల్చరు. అలాగని దూరమూ కారు. మరీ భద్రత ఎక్కువయిపోయిన చోట, ప్రేమ అంతగా చిగురించదు. చిగురించినా, నీడపాటు మొక్కలాగా నింపాదిగా పెరుగుతుంది. అమ్మాయి పే స్కేలూ, కటింగులూ, అన్ని చూసుకుని అత్యంత పగడ్బందీగా ప్రేమించుకోవాలనుకుంటారు. ఆలా దొరికిన అమ్మాయి మీద పెట్టుబడి ఎక్కువ పెట్టి ‘అప్పు’లో కాలేస్తుంటారు కూడా. - పబ్ సైట్
ఎగిరిపోవాలనీ, ఊహల్లో తేలిపోవాలనీ వుంటుంది. కానీ, సిస్టమ్ ముందు క్యూబికిల్స్ లో కూర్చుని, కూర్చుని విసుగు పుడుతుంది. వారం అంతా ఎదురు చూసేది, వారం ఎప్పుడు ముగుస్తుందని. శుక్రవారం సాయింత్రం ఎప్పుడు వచ్చి పడుతుందా..అని. ఆఫీసుల్లో అంతవరకూ అతుక్కుపోయిన గొంగళిపురుగులు సీతాకోకచిలుకలు అవ్వాలనుకుంటాయి. అనుకుంటే అయిపోవాలంతే..! ఎలా? స్పేస్‌లోకి వెళ్ళాలి. భార రహిత వాతారణంలోకి వెళ్ళిపోవాలి. అడుగులు వేద్దామన్నా నేల మీద పడకూడదు. లెక్కలన్నీ వదిలేసి కొన్ని గంటలపాటయినా రెక్కలు తొడుక్కోవాలి. పనిలో వినీవినీ విసిగి పోయిన టార్గెట్లూ.. టాస్కులూ ఏవీ వినిపించ కూడదు. అదుగో అప్పుడు గుర్తెచ్చేవే పబ్బులూ. తప్పితే బార్లూ. అక్కడ పుట్టే ప్రేమ క్షణం నిలువ నివ్వదు. ఆ తర్వాత జీవితంలో నడవలన్నా నడవనివ్వదు. - బ్రేకప్ సైట్
ప్రతీ ప్రేమా ‘శుభలేఖ’ వరకూ రావాలని రూలు లేదు. కొన్ని ప్రేమలకు మధ్యలోనే ‘శుభం కార్డు’ పడవచ్చు. కొందరు ప్రేమికులు ఈ బ్రేకప్ కోసమే ఎదురు చూస్తుంటారు. బోరు కొట్టే సినిమాను ఇంటర్వెల్ బ్రేక్ లో వదిలేసి వస్తాడే.. వాడికెంత రిలీఫ్ గా వుంటుందో, ప్రేమను సగంలో తెంచేసుకున్నవాడికీ అంతే ఊరట వుంటుంది. ప్రేమ సఫలమయితే సెలబ్రేట్ చేసుకునేది ఒక్క రోజే. కానీ ఫెయిలయితే రోజూను. రోజూ మందునీ, సానుభూతినీ ఏకకాలంలో కొట్టవచ్చు. కాకుంటే రెండు ఖర్చుతో కూడినవే. మందూ కొనాలి, కంపెనీ ఇచ్చేవాడినీ కొనాలి. కానీ బ్రేకప్ చెప్పిన ఆడపిల్లకు మాత్రం ఈ లగ్జరీ వుండదు. మనసులోనే దరిద్రం వదలిందీ అనుకోవాలి తప్ప, పైకి చెప్పకూడదు.
- సతీష్ చందర్ ( ఈ పుస్తకాన్ని అమెజాన్ ద్వారా పొందవచ్చు. ఈ లింకును http://www.amazon.in/dp/9357685944?ref=myi_title_dp క్లిక్ చెయ్యండి.)