ఇక్కడ అందరూ దానిలోనే పుడతారు. దాని చుట్టూనే తిరుగుతారు. దానితోనే పోతారు. అదే కులం. దానికి అన్నీ ముఖాలే. కానీ ఈ ఏడూ ముఖ్యం. ఆ ఏడూ ఈ పుస్తకంలోని ఏడు అధ్యాయాలు:
1. కులం లేదంటే ఉన్నట్లే
ఉన్నా కనిపించని ముఖమిది. ‘ఇప్పుడింకా కులమెక్కడ వుందీ?’ అన్న వారు ఈ ముఖంతో తిరుగుతారు. ఈ అధ్యాయం చదివాక ‘కులం లేనిదెక్కడ?’ అని ప్రశ్నిస్తారు. అరిస్టాటిల్ వేరే దేశంలో పుట్టాడు కాబట్టి ‘మానవుడు సంఘ జీవి’ అనేశాడు కానీ, అదే మన దేశంలో పుడితేనా? ‘మానవుడు వర్ణ జీవి’ అనేసేవాడు.
2. తాళిబొట్టే కులం గుట్టు:
అవును. ఓ అబ్బాయి చేత అమ్మాయి తాళి కట్టించేసుకుని, ‘మేమిద్దరూ కలసి కుటుంబం’ అంటుంది. ఆమెకు తెలిసి చావదు కానీ, అది కుటుంబం ఎందుకవుతుందీ? కులమే. ఆమె భార్యా కాదు, అతడు భర్తా కాదు. ఆమె ‘కుల’సతి, అతడు ‘కుల’పతి.
3. శ్రామికుల విభజన:
పుట్టాక పని చెయ్యటం వేరు. పనిలో పుట్టెయ్యటం వేరు. మనది భారతం కదా! కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు, ఎవరి పనిముట్టుతో వాళ్ళు పుట్టేస్తారు. సుత్తితో ఒకరూ, మగ్గంతో ఒకరూ, వలతో ఒకరూ.. ఇలా. ఎవరో అదృష్టవంతులుంటారు. ఉత్త చేతుల్తో పుడతారు. యాచించి, దీవించటానికి.
4. ఉత్పత్తికి ఆవల:
ఊరవతల.. ఊరవతల.. అంటారు పాపం, తెలియక. వాళ్ళుండేది ఊరికి ఆవల కాదు.., ఉత్పత్తికి ఆవల. వాళ్ళను గుడికీ, బడికీ దూరం చేశారని మాత్రమే సంస్కర్తలు గొంతు చించుకున్నారు కానీ, మడికి దూరం చేశారని అనలేదు. ఎందుకనో..?
5. వివక్షకు విరుగుడు:
‘వస్తు’మార్పిడి గురించి విన్నాం. ‘వృత్తి’ మార్పిడి గురించి విన్నామా? వినం. ఇండియాలో పుడితే అస్సలు వినం. ఎందుకూ అంటే ‘రిజర్వేషన్లు’. నూరు శాతం రిజర్వేషన్లు. మంత్రాలు చదివే వృత్తి కావచ్చు, చెప్పులు కుట్టే వృత్తి కావచ్చు. ఆ కులం వాళ్ళే చెయ్యాలి. ఇవే శతాబ్దాల తరబడి వున్న ‘రిజర్వేషన్లు’. వాటికి ‘విరుగుడు’ కనిపెడితే కొంపలంటుకు పోవూ..?
6. చెంచాలే నేతలయితే:
ఒర లోంచి తీస్తే రావాల్సింది కత్తి కదా.. చెంచా వచ్చిందేమిటి? అట్టడుగువర్గాల నుంచి వచ్చిన నేతలు చెంచాలానా? కాదు. తమంతట తాము పుట్టుకొస్తే కత్తులే. ఎవరో దయదలచి రానిస్తే చెంచాలే. పుట్టుకొచ్చిన నేతలకీ, రానిచ్చిన నేతలకీ ఒక్కటే తేడా. వెన్నెముక. ఒకరికి వుంటుంది; ఇంకొకరికి వుండదు.
7. మాధ్యమ స్వామ్యం:
ఇదేమిటీ అంత గంభీరంగా? భూస్వామ్యమూ, ధనస్వామ్యమూ లాగా? కాదు మరీ! ఒకప్పుడు ‘నోట్లో నాలుక లేని’ వాళ్ళ మీద జాలిపడేవారు. ఇప్పుడలాకాదు ‘మూతికి మైకు లేని’ సమూహాలను చూసి జాలి పడుతున్నారు: ‘పాపం! ఆ కులపోళ్ళకి మీడియా లేదట కదా?’ అని.
ఈ పుస్తకం పుటలు: 940, ధర: రు. 950 లు
మీరు అమెజాన్ ద్వారా https://amzn.eu/d/grTHpSc ఈ గ్రంథాన్ని పొందవచ్చు.