చంద్ర వికాసం


బహుముఖీన
ప్రజ్ఞావంతుడు సతీష్‌చందర్‌.
ప్రాథమికంగా అతను కవే అని నా తలంపు. ‘పంచమ వేదం’తోనే కొత్త దారి తీశాడు. ఆర్ద్రత, ఆలోచనాత్మకత, ప్రగతిశీలత, నిర్మాణ సౌందర్యం అతని కవిత్వంలో ప్రస్ఫుటం అవుతాయి. ఆ సాధన, శక్తి కథారచనలో ఎంతో ఉపయోగపడ్డాయి. కొంతమంది అనుకుంటారు, కథల్లో కవితాత్మకత అవసరం లేదని. కానీ ప్రజ్ఞావంతుడైన కవికి ఔచిత్యం, భాషాధికారం, శైలీ వైవిధ్యం, పద సంయోజనం, గాఢత, క్లుప్తత మొదలైనవన్నీ అబ్బుతాయి. ఆ అబ్బిన గుణాలు కథా నిర్మాణంలోనూ చక్కగా ఉపయోగపడతాయి.

సతీష్‌చందర్‌ కథల్లో ఈ కవితాత్మకత ముచ్చట గొల్పుతుంది. ఒక పుట మేర చెప్పే వచన సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పగల నైపుణ్యం అది.

సిగ్గు: కపటంలేని దేహ కాంతి

స్త్రీ శరీరానికి ‘కపటం లేని నిగారింపు’ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఏ మేకప్పులూ లేనప్పుడు నిష్కపటమైన నిగారింపు ఉంటుంది. ఉంటుందని రచయిత చెప్పాడు, అంతే. ‘సిగ్గు’ కథ చదవండి. అది ‘దళిత ఈస్తటిక్స్‌కి బైబిల్‌ వంటిది’ అన్నాడు డా॥ వి. చంద్రశేఖరరావు. అందులో గ్రేస్‌ అనే అమ్మాయి అంటుంది, ‘నన్నెవరూ హీనంగా చూడకూడదు. తక్కువ చేసి మాట్లాడకూడదు. నలుగుర్లోనూ తీసిపోకుండా కనపడాలి. కడుపు మాడినా సరే, శుభ్రమైన బట్ట కట్టాలి’. కానీ ఇష్టపడి చాటుగా తీసుకెళ్లిన రాజుల కుర్రాడికీ ‘నేనంటే లోకువ. నా జాతంటే లోకువ’ అనే సంగతి ఆమెకర్థమవుతుంది. కనుక ఒక అగ్రవర్ణుడికి దళిత యువతి కామానికి పనికొస్తుంది, ప్రేమకి పనికి రాదు. జాకెట్‌ వేసుకోని తరం గ్రేస్‌ అమ్మమ్మది. అందంగా, హుందాగా, గౌరవంగా బతకాలనుకునే తరం గ్రేస్‌ది. అది గ్రహించినప్పుడే ‘మూడువేల యేళ్లు ముంత వేళ్ళాడిన స్థానంలో నెక్‌టై, కోటుమీద కోటు, మడత నలగని ప్యాంటూ, మెరిసే బూటుతో’ నిలిచిన అంబేద్కర్‌ హుందాతనానికి కారణమేమిటో అర్థమవుతుంది. మహాత్మ గాంధీ అర్ధనగ్నత, అంబేద్కర్‌ నాగరిక వస్త్రధారణ మధ్య గల వైరుధ్యం కూడా అర్థమవుతుంది.

స్త్రీ శరీరానికి ‘కపటం లేని నిగారింపు’ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఏ మేకప్పులూ లేనప్పుడు నిష్కపటమైన నిగారింపు ఉంటుంది. ఉంటుందని రచయిత చెప్పాడు, అంతే. ‘సిగ్గు’ కథ చదవండి. అది ‘దళిత ఈస్తటిక్స్‌కి బైబిల్‌ వంటిది’ అన్నాడు డా॥ వి. చంద్రశేఖరరావు.

‘ఇంత చల్లని తల్లి లోకానికి అంటరానిదెలా అయింది?’ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం అంత తేలిక కాదు. ఆ ప్రశ్న ఒకానొక కొడుకు ప్రేమమూర్తి అయిన తల్లి గురించి అనుకొన్న మాటే కాదు. మొత్తం సమాజానికే సంధించిన ప్రశ్న.
అప్పటికీ ఇప్పటికీ (బహుశా ఎప్పటికీ) ఈ దేశంలో కులం కఠిన వాస్తవం. కులాంతరాలు వాస్తవం. కులాంతర వివాహాల సందర్భంలో ‘పరువు హత్యలు’ వాస్తవం. అన్ని కులాలూ సమానమని మనం ఎంతగా భావిస్తున్నా అందులో ‘తక్కువ సమానమైన’ కులంతో సంబంధం ఘర్షణకే దారి తీస్తుంది. అట్లాంటి సందర్భంలో ఏ దారి చూసుకోవాలి? ఎటు నడవాలి? అనేది ‘తప్పు’ కథలో తెలుస్తుంది.

కులానికి ‘ఎస్కేప్ రూట్స్’ వుంటాయా?

కుల రోగానికి మూడు పలాయన వైద్య విధానాలు కూడా రచయిత వ్యంగ్యంగా చెపుతాడు, ‘ఎర్ర కమ్మెలు’ కథలో. కులం నుంచి పారిపోవటం, వేరే కులమని చెప్పుకోవటం, కులాన్ని ప్రకటించకుండా ఉండటం. ఇవి మూడూ బాధాకరమైనవే. కథ చివర్లో రచయిత చెప్పిన మాటలు మనల్ని కలతపెడతాయి. ‘ఈ దేశంలో కులంనుంచి ఎవరూ పారిపోలేరు’ అన్నది సత్యం. ‘కులపీడితుడు ‘ఒకవైపు ‘కులం చేతిలో బందీ ఒక వైపు. ఈ వైరుధ్యాన్ని రచయిత తన కథల్లో ఆవిష్కరించిన తీరు, పరిష్కరించిన వైనం సమతూకంగా ఉండి అతని భావ పరిణతిని పట్టి చూపిస్తుంది.

గోదావరి జిల్లాల్లో అగ్రవర్ణాలకి, దళితులకి మధ్య ఏర్పడే వైవాహిక, వైవాహికేతర సంబంధాల గురించి ఆలోచనాత్మకమైన కథలు చెప్పాడు సతీష్‌చందర్‌. అరిటాకుముల్లు సామెతలో మాదిరిగా ఏ సంబంధాలు ఎట్లా జరిగినా, పెడదిరిగినా దెబ్బ తగిలేది నిమ్న వర్గాలకే అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఏ రంగులూ పులమకుండా నిఖార్సుగా చిత్రించాడు రచయిత. ఒక పక్షం వహించినట్టు ఎక్కడా కనపడడు. దళితుడే అయినా, దళిత ప్రేమతో, దళిత కథా వస్తువునే గ్రహించి వివరిస్తున్నా ఎక్కడా నిగ్రహమే తప్ప ఆగ్రహం కన్పించదు. ‘సిగ్గు’ కథే ఉదాహరణ. ‘తప్పు’ కథే దృష్టాంతం.

ఎక్కడా పీడక వర్గం పట్ల ద్వేషం కనపడదు. ఒక్కొక చోట తన కోపాన్ని కప్పిపుచ్చటం కోసం అతను హాస్య వ్యంగ్యాల్ని అశ్రయిస్తాడు. పరిణతి చెందిన రచనాశిల్పం అది. రచయిత ‘పెయిన్‌’ అతని భావజాలంలోను, భావజాలం శిల్పంలోనూ పాలల్లో నీళ్లులాగా కలిసిపోతాయి. ఆ బాధ అందరి బాధ అవుతుంది. మన కళ్లు తడిబారతాయి. మనస్సు కలతపడుతుంది. ఏదో పశ్చాత్తాపం లోపల్నుంచి తన్నుకొస్తుంది. చాలా ఆలోచనలు రేకెత్తిస్తుంది సతీష్‌చందర్‌ కథనం. నమ్మకపోతే ‘కాక్‌టెయిల్‌’ మరోసారి చదవండి. ముసలమ్మ చావును గూడా (కన్నీటి చుక్క లేకుండా) బ్రతుకుతో సమానంగా ‘సెలబ్రేట్‌’ చేసుకునే మనుషులు అందులో కనబడతారు. ముందు మనం తొట్రుపాటు పడతాం కథలో శర్మ మాదిరిగా మరణ సందర్భంలోనూ కంటిచెమ్మ లేకపోవటమేమిటని. తర్వాత అర్థం చేసుకుంటాం, ఆ మనుషులు జీవన్మరణాల తత్త్వాన్ని సహజంగా, సరళంగా అర్థం చేసుకున్నారని.

గోదావరి నీళ్లు తాగి పెరిగిన వాడవటాన సతీష్‌చందర్‌కి రచనలో ధారాళత, హాస్యం, వెటకారం సహజంగానే అబ్బాయి. అట్లాగని దేన్నీ, ఎవరినీ గాయపరచటం పనిగా పెట్టుకోలేదు అతను. వేమన గురించి రాస్తూ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అంటారు వేమనది గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లుండే నైపుణ్యం అని. అదుగో అట్లాంటి సున్నితమైన లక్షణమే ఈ రచనల్లో ఉంది.


‘భూతనాయకుడు’ వ్యంగ్య కథలో ‘నిమ్మపండులా మెరిసిపోయే’ నాయకులుగా కనపడే ప్రతినాయకులు ఆడపిల్లలపై ఎట్లా ‘ఆరాధన’ వల విసురుతారో, అట్లాంటి ‘మనోహరు’లకు ఎట్లాంటి శిక్ష విధించాలో తెలిపే సూచన ఉంది. ఎంతటి అత్యాచారాలనైనా చట్ట ప్రకారం ఏళ్ల తరబడి విచారించి, మానవతాదృష్టితో, నాగరిక దృక్పథంతో, ఏడు రోజుల కోమల కారాగార శిక్షతో సరిపుచ్చితే నష్టమేమిటని వాదించే మానవ హక్కుదారులకు చెంపపెట్టు పెట్టాడు రచయిత.

పాత్రల స్వే ఛ్ఛకు పెద్ద పీట

పాత్రల్ని రచయితే సృష్టిస్తాడు. కదిలిస్తాడు. నడిపిస్తాడు. కొండొకచో తెలివితక్కువ రచయిత వాటిని శాసిస్తాడు. వాటిని కీలుబొమ్మలు చేసి ఆడిస్తాడు. అప్పుడవి బొమ్మలే. జీవం గల పాత్రలు కావు. రచనాశిల్పం గుట్టుమట్లు తెలిసినవాడు ఆ పాత్రల ప్రాథమిక సూత్రం తన చేతుల్లోనే ఉన్నా అవి తిరగటానికి కావలసినంతగా తాడు వదులుతాడు. వాటి నడవడికని శాసించడు. ఈ గొప్పలక్షణం సతీష్‌ చందర్‌ కథల్లో చూడొచ్చు. అతను కల్పించిన పాత్రలు క్రిష్టియన్‌ పేటల్లోనో, మన చుట్టూనో తిరిగే మనుషులే. అది వాస్తవమే అనిపించే పాత్ర కల్పన. కుక్కను కూడా సజీవంగా మన కళ్లముందు తిప్పే కల్పనా నైపుణ్యం అది. (చూ. డాగ్‌ ఫాదర్‌)


రకరకాల పాత్రల్ని కల్పించేటప్పుడు కుమ్మరి సారెమీద మట్టిని ఎంత మెత్తగా, మృదువుగా స్పృశిస్తూ పాత్ర నిర్మాణం చేస్తాడో, అట్లాంటి మృదుత్వం చూశాను ఈ రచయితలో. అంత ఆప్యాయంగా ఆ పాత్రల్ని తడుముతూ రూపొందించాడన్నమాట. ‘ఆప్యాయత విరజిమ్మినప్పుడే మనిషి ప్రకాశిస్తాడు’ అనే గొప్ప వాక్యం ‘డాగ్‌ ఫాదర్‌’ కథలో దాగి ఉంది. ఈ ఆప్యాయత లోకంలోని మనుషుల పట్లా తుదకు తను కల్పించే పాత్రలపట్ల గూడా చూపించాడు. తమ పాత్రల్ని తామే అమాంతం గొంతు నులిమి చంపేసే వాళ్లుంటారు రచయితల్లో. పాఠకుల సానుభూతి కోసం. కరుణరసం కట్టలు తెంచుకొని మనసుల్ని ముంచెయ్యటం కోసం. ఆ మహానుభావుల ధోరణి కాదు. ఈ కథలు చదువుతుంటే ఆ మనుషుల పట్ల చాలా ఆప్యాయత కలుగుతుంది మనకి.

గోదావరి మార్కు వెటకారం

గోదావరి నీళ్లు తాగి పెరిగిన వాడవటాన సతీష్‌చందర్‌కి రచనలో ధారాళత, హాస్యం, వెటకారం సహజంగానే అబ్బాయి. అట్లాగని దేన్నీ, ఎవరినీ గాయపరచటం పనిగా పెట్టుకోలేదు అతను. వేమన గురించి రాస్తూ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అంటారు వేమనది గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లుండే నైపుణ్యం అని. అదుగో అట్లాంటి సున్నితమైన లక్షణమే ఈ రచనల్లో ఉంది. తను గాయపడిన చోట సైతం ఎదటి వాళ్లని గాయపరచకుండా పునరాలోచనకి ప్రేరేపించటం ఈ రచనల్లో నేను గమనించాను.

జనజీవితంలో అత్యాధునిక జీవన విధానం తెచ్చిన మార్పు ‘పండగలూ, ‘భర్త’డేలూ’ వ్యంగ్య రచనలో కనపడుతుంది. ‘అదేమిటో మా చిన్నప్పుడు గ్రామాల్లో సొంత పండగలుండేవి కావు. అన్నీ ఊరుమ్మడి పండుగలే’ అంటూ మొదలుపెట్టి ‘బతుకే వర్తకమైన చోట పండుగలెందుకు? ‘డే’లు చాలు’ అని ముక్తాయించటం వెనుక వ్యంగ్యం చురుక్కుమనిపిస్తుంది. ‘గాట్‌’ ఒప్పందంపై భారత ప్రభుత్వం సంతకం చెయ్యటంతో విత్తనాలపై పేటెంట్‌ హక్కులు సామ్రాజ్యవాద దేశాలకు దఖలు పడ్డాయనే సంగతి మనకు తెలుసు. ఆ ఒప్పందం ఫలితమేమనగా పంటలు ఇక్కడే పండుతాయి. తిరిగి వెద పెట్టటానికి విత్తనాలు రాని పంటలు. అంటే ద్రాక్ష పంట పండిరచగలం. ద్రాక్ష పళ్లు (విత్తులు లేనివి) తినగలం. కాని విత్తనాలు సామ్రాజ్యవాద దేశాలనుంచి దిగుమతి అవుతాయి. ఎంత ధర అయినా కొనక తప్పదు. మూలం మన చేతుల్లో ఉండదు. మన జుట్టు వాళ్ల చేతుల్లో ఉంటుంది. ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు హయాంలో జరిగిన ఈ అందమైన మాయని సామ్రాజ్యలక్ష్మిగా వ్యంగ్యావిష్కరణ చేశాడు రచయిత. (చూ: సామ్రాజ్యకాంక్ష)

తెలుగు తెలుగంటే తెలుగని అనుకుంటున్నాం గాని తెలుగు గురించి అందరికీ తెలీదు గాక తెలీదు. అటు ఇంగ్లీషు ఇటు తెలుగు కలగాపులగం చేసే రచయితలున్నారు. ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాసే వాళ్లున్నారు. కాని తెలుగు నుడికారం తెలిసి, సామెతలూ ఆమెతలూ కలగలిపి ఆహ్లాదం కలిగించేవాళ్లు ఎంతమంది? భాషలో ప్రాంతీయత ఉంటుంది. ఒక్కొక్క సామాజిక వర్గం భాషా వ్యవహారం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అందులో మళ్లీ యాస. యాసలో జీవం. అదంతా పల్లెపట్టున పుట్టి పెరిగిన వాళ్ళకి బాగా తెలుసు. ఈ రచయితకి మరీ బాగా తెలుసునని అతని కథలే చక్కగా చెపుతాయి.

అడుగడుగునా పదాల విరుపులే

‘నర్సు నవ్విపోయింది’ అంటున్నాడంటే నవ్విపోయిందా? నవ్వి,పోయిందా? నవ్వు దాచుకొన్న రచయిత చెప్పడు. అదొక చమత్కారం. ఇట్లా లెక్క లేనన్ని భాషాచమత్కారాలు ‘పెగ్గుమాలిన తనం’లో చూడవచ్చు. జీవితాన్ని ‘స్కాచి’ వడపోసినవాడు, మందు భాగ్యుడు, మద్య ద్రోహం, విదేశీ మద్యమం, దుశ్శాసించటం, కీచకులాటలు వగైరా వగైరా. అయితే చమత్కారాల ఉరవడిలో అసలు సంగతి మరిచే రకం కాదు ఈ రచయిత. 1990 దశాబ్దిలో సాగిన సారా వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో మన దేశం ‘మద్యదేశం’గా మారుతున్న క్రమాన్ని ఈ కథలో తెలిపాడు. ‘అతడు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోబోయాడు. ఆమె అరచేతితో అతడి నోటిని అడ్డుకుంది. అది వట్టి అరచెయ్యి కాదు. చేతి రుమాలున్న అరచెయ్యి. అది ఉత్త చేతి రుమాలు కాదు. క్లోరోఫాం ఉన్న చేతి రుమాలు.’ (భూత నాయకుడు) ‘పగ తీరినవాడు నిద్రపోతాడు. పగ తీరనివాడు మెలకువగా ఉంటాడు. మరి పగ సగమే తీరినవాడు? నిద్రలో ఉలిక్కిపడుతుంటాడు.’ (పొందు) ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చూపొచ్చు, ఈ రచయిత శైలీ విన్యాసం తెల్పటానికి.

సతీష్‌చందర్‌ విమర్శనాకళ గురించి తెలుసుకోవాలంటే ‘నిగ్రహ వాక్యం’ తప్పక చదవాలి. పత్రికారచన ప్రావీణ్యం తెలుసుకోవాలంటే ‘బి ఫర్‌ బ్యాలెట్‌’ చదవాలి. కవితాకళ గురించి తెలుసుకోవాలంటే ‘పంచమ వేదం’, ‘పసుపు జాబిల్లి’ ‘ఆదిపర్వం’ చదవాలి. ‘వచనం, కవిత్వం రెండూ ఇష్టమే. వచనం నా మాట వింటుంది. కవిత్వం మాట నేను వింటాను. వచనాన్ని నేను రాస్తాను. కవిత్వం రాయించుకుంటుంది’ అన్నాడు సతీష్‌చందర్‌. కవిత్వం దినచర్య కాదని, అందుకు ఏకాంత మానసిక స్థితి, భావోద్వేగం, కన్నీటి చెమ్మ, నిప్పు వేడి వంటివేవో కావాలని తెలిసి రాస్తున్న విశిష్ట కవి అతను. అయితే ప్రస్తుత సందర్భం కథానికా కళ. ‘సిగ్గు’ కథ1998లో, ‘కాక్‌టెయిల్‌’ కథ2010లో, ‘తప్పు’ కథ2011లో మా సంపాదకత్వంలో ప్రచురించాం. ఇంకా ‘మూతి విరుపులూ, వాలు చూపులూ’, ‘చంద్రహాసం`అనురాగ కథలు’ అతని కథల మేలిమికి చిహ్నాలు. ఆ కళలో కళకళ చూసి ఆనందిద్దాం.

డా॥ పాపినేని శివశంకర్‌

15 ఆగస్టు 2022,

1 comment for “చంద్ర వికాసం

  1. సమాజిక సహజత్వానికి చెరుగని చిరునామా…. సతీష్ చందర్ జీ… !!
    సంపాదకీయాల సంపుటి “కంకి” ని కూడా స్ఫృజించి వుంటే… మరింతగా వన్నె పెరిగేదని ఆశిస్తూ…. 24+++కేరట్////
    డా. పెద్దిరాజు కోలాటి @అంబేడ్కర్ సాహితీ వేదిక ఏపి @పాలకొల్లు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *