నిద్రగన్నేరు చెట్టు

నిద్రపోతేనే కదా…కల వచ్చేదీ! మళ్ళీ ఆకలలో నిద్రపోతే…!?
ఒక్కొక్కప్పుడు అలాగే జరుగుతుంది. ఇలలో చేసిన అన్ని పనులూ, కలలో కూడా చేస్తాం కదా! ఎవరినో కౌగలించుకున్నట్లూ, ముద్దు పెట్టినట్లూ , సుఖం పొందినట్లూ మాత్రమే కాదు…పరుగెత్తినట్లూ, అలసి పోయినట్లూ, నిద్రపోయినట్లూ కలవస్తుంది.
మొద్దు నిద్ర. నిద్రలోని నిద్ర. కలలోని నిద్ర. మెలకువ వస్తే బాగుణ్ణు. గింజుకుంటున్నాడు. కళ్ళు తెరవలేక పోతున్నాడు. ఎవరో ఒకరు తన్ని లేపాల్సిందే. ఆ పని తన పక్కలో పడుకున్న ప్రార్థన చెయ్యాలి. కానీ చెయ్యలేదు.
‘తన్ను ప్రార్థనా.. నన్ను తన్ను ప్రార్థనా..!’
తడిమి చూశాడు, ఆమె దొరకలేదు; అరచి చూశాడు, పలకలేదు. ఇదంతా కలలోపలి నిద్రలోనే..కడకు తానే ఒక్క ఉదుటన లేవ బోయాడు. నొప్పి!
కలలోని కల చెదరింది. నిద్రపోతున్నట్లు వచ్చిన కల తొలిగింది. అలల్లేని కడలి లాగా, కలల్లేని సాదా సీదా నిద్ర మిగిలింది. చిన్నగా మూలిగాడు కలిదిండి విభాత వర్మ.
‘…ండీ…! ఏమండీ..! ఏమయ్యిందీ..?’ ఒక చేత్తోనే అతడి భుజంమీద చెయ్యివేసి, చెట్టును ఊపినట్లు ఊపేసింది ప్రార్థన.
వర్మకు పూర్తి మెలకువ.. సంపూర్ణ విముక్తి..! చేప పిల్ల, నేల విడిచి నీటిలోకి దూకినంత సంతోషం. తన శరీరాన్ని తాను అనుకున్నట్లు కదపగలుగుతున్నాడు. కుడికాలి చిటికెన వేలులో చిన్న నొప్పి. తాను పొందిన విమోచన ముందు, నొప్పి చాలా చిన్నది. అయినా తన కాలి వైపు చూసుకున్నాడు. వీల్‌ చైర్‌ గోడకు కొట్టుకుని, పాతకాలపు గోడగడియారంలోని లోలకం లాగా ఊగుతోంది.
పక్కలోనే, లేచి కూర్చుని తన తల నిమురుతోంది ప్రార్థన.
‘అవేం కలవరింతలూ..!? నేను మిమ్మల్ని తన్నాలా..!?
‘అలా అన్నానా?’
‘నేనసలు తన్నగలనా..!?’ ఇలా ప్రార్థన అనబోతుంటే, తానూ లేచి కూర్చుని ఆమెనోటికి చెయ్యి అడ్డుగా పెట్టి, ‘ఛ.ఛ. అలా ఆలోచించకు రా!’ అని మంచం దిగిపోయాడు. ఊగుతున్న వీల్‌ చైర్‌ను పట్టుకుని మంచ పక్కకు ప్రార్థన కూర్చున్న వైపు తెచ్చి, ఆమెను అమాంతం ఎత్తి అందులో కూర్చోబెట్టి, వాష్‌ రూమ్ వైపు తిప్పాడు.
‘కాళ్ళు పనిచేస్తే మాత్రం.. మిమ్మల్ని తన్నగలనా..? అంత అపచారం చేస్తానా..!?’
‘ప్రార్థనా ప్లీజ్‌..!’ మరో సారి ఆమె నోటికి అడ్డు పెట్టి, వాష్‌ రూమ్ లోకి తోసుకుని వెళ్ళి, తలుపు వేశాడు.
రోజూ అంతే. ఉదయమే ఆమెను నాలుగు గంటలకెల్లా నిద్ర లేపెయ్యాలి. అయిదు గంటలకే తలంటింపచేసి, ఇంటి పెరట్లో వున్న తులసి మొక్క దగ్గర అదే వీల్‌ చైర్‌లో హాజరు పరచాలి. అంతే కాదు దాని చుట్టూ తిప్పి, పూజగదికి తేవాలి. అప్పటికి పనమ్మాయి వచ్చేస్తుంది. పేరుకు పనమ్మాయి కానీ, పని చేసే అమ్మాయి కాదు, పని చూసే అమ్మాయి. ప్రార్థన చేసుకుపోతుంటే, ఆమె చూస్తుందంతే. ప్రార్థన చెయ్యనిస్తే కదా! చక్రాల కుర్చీని పని అమ్మాయి కిచెన్‌లో కదుపుతుంటే, ప్రార్థనే అన్ని పనులూ చేస్తుంది.వంట పాత్రలన్నీ తానే కడుక్కుని, కూరగాయలూ తానే తరుక్కుని, తానే కాఫీ కలిపి వర్మకు అందించి, వంటకు శ్రీకారం చుడుతుంది. లేచింది మొదలు, పడుకునే వరకూ ఆమె చేతులు ఎప్పుడూ కదుల్తూనే వుంటాయి. నలభయ్యేళ్ళ నుంచి ఇదే తంతు. ఒకప్పుడు కాళ్ళు కూడా ఇలాగే… ఇలాగే ఏమిటి? ఇంత కన్నా ఎక్కువ కదలేవి; కిచెన్‌ చుట్టూనో, ఇంటి చుట్టూనో కావు..గుళ్ళ చుట్టూ. పైపెచ్చు ఏ కొండ మీద వున్న దేవుణ్ణయినా మెట్లెక్కే దర్శించుకునేది. మోచిప్పలు అరగకుండా వుంటాయా..?
అయిదున్నరకే రెడీ అయ్యి, హాలు లోకూర్చుని వాకింగ్‌ షూస్‌ వేసుకుంటుంటే ‘కాఫీ కప్పు’ చేతికిచ్చింది ప్రార్థన…, వీల్‌ చైర్‌ పనిమనిషితో తోయించుకుంటూ వచ్చి.
నిద్ర మత్తు ఇంకా పోలేదు వర్మకి. వణకుతున్న చేత్తోనే తీసుకున్న కాఫీ కప్పు పొగల్లోంచి ప్రార్థనను చూశాడు. నుదుటి మీద అతి పెద్ద కుంకుమ బొట్టూ, మూడొంతులు నెరసిన జుట్టూ. చిన్నగా నవ్వుకున్నాడు.
సోఫాలో పక్కనున్న మొబైల్‌ మెరుపులా వెలిగి, చిన్నగా ఉరిమింది. ఫేస్‌ బుక్‌ మెస్సెంజర్‌లో సంక్షిప్త సందేశం. అది కూడా ఇంగ్లీషు లిపిలోని తెలుగు: నిద్ర గన్నేరు చెట్టు.
రాత్రంతా నిద్రలేకుండా చేసి, తెల్లవారు ఝామున నిద్రలోకి పంపి, అప్పుడు వచ్చిన కలలో నిద్ర వచ్చినట్లు చేసింది కూడా ‘నిద్ర గన్నేరు చెట్టే!’
తన ఫేస్‌ బుక్‌ ఫ్రెండ్‌ సంతోష్‌ పంపిన మెస్సేజ్‌ ఇది. వర్మ ఏ పోస్టు పెట్టినా, ఏ ఫోటో షేర్‌ చేసినా, దాదాపు తొట్ట తొలుత వచ్చే ‘లైక్‌’ సంతోష్‌దే. తన అరవయ్యయిదేళ్ళ వయసుకీ, ఫేస్‌బుక్‌కీ పెద్దగా సంబంధం లేదు కానీ, తన కొడుకు అమెరికా వెళ్తూ, వెళ్తూ ఫేస్‌ బుక్‌ అలవాటు చేసి వెళ్ళాడు. కానీ ఫేస్‌ బుక్‌ లో మాత్రం చురుకుగా వుండేది ఆస్ట్రేలియాలో వున్న ఇద్దరు కూతుళ్ళూ. కొడుకూ ప్రతీ ముచ్చటా ఫేస్‌ బుక్‌లో పంచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వర్మకు అది ‘ఫేస్‌ బుక్‌’ కాదు, ‘ఫ్యామిలీ బుక్‌’. ‘ఫ్రెండ్స్‌’ జాబితాలోవున్నది, తన కుటుంబ సభ్యులూ, దగ్గర బంధువులూను. వీళ్ళు కాక వెలుపలి మిత్రుడు ఒక్కడే: సంతోష్‌. అతడు ఎప్పుడూ పెద్ద పెద్ద పోస్టులూ, కామెంట్లు పెట్టిన పాపాన పోడు. ‘ఎబౌట్‌’ లో ఢిల్లీ లో వున్న తెలుగు వాడనీ, కళలూ, సాహిత్యం ఇష్టాలనీ చూసి, అతడు పంపిన ‘ఫ్రెండ్‌ షిప్‌ రిక్వెస్ట్‌’ ను అంగీకరించాడు విభాత వర్మ.
అలాంటి వాడు, తనకు తానే నర్సాపురం వస్తున్నట్లు మెస్సేజ్‌ పెట్టాడు. అతనికీ ఈ ఊళ్ళో బంధువులున్నారట. పొద్దున్నే గోదావరి వొడ్డున, లాంచీల రేవు దగ్గర, నిద్రగన్నేరు చెట్టు వద్ద కలవవచ్చని వారం రోజుల నుంచీ మెస్సేజ్‌లు పెడుతున్నాడు. ఫేస్‌బుక్‌లో అతడి పుట్టిన సంవత్సరం ఇవ్వలేదు కానీ, అతడి స్పందనల్ని బట్టి తన ఈడు వాడేనని వర్మకి గట్టి నమ్మకం. పొద్దున్నే ఆరుగంటలకెల్లా వచ్చేస్తానన్నాడు. సంతోష్‌ ని కలవటం పట్ల ఆసక్తీ లేదు, అనాసక్తీ లేదు. కారణం పైపై ‘ఫేస్‌ బుక్‌’ పరిచయం. కానీ అతడు కలుద్దామన్న స్థలమే తన గుండెల్లో గుబులుని రేపింది.
పేరుకు నిద్రగన్నేరు చెట్టే. గోదావరి లాంచీల రేవును ఆనుకుని వుంటుంది. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా చేసిన చెట్టు. వర్మకే కాదు, వర్మ మిత్రులందరికీ. బిడ్డల్ని నిద్రపుచ్చబోయి, తాను నిద్దురలోకి జారుకునే తల్లిలా వుండేది. చీకటి పడితే చాలు కళ్ళు మూతలు పడ్డట్లే, దాని ఆకులూ ముడుచుకుంటాయి. మళ్ళీ పొద్దు పొడవగానే కొమ్మ కొమ్మకీ తెరచిన కళ్ళే.



ప్లాటినం రంగు ‘సాంత్రో’ కారులో నిద్రగన్నేరు చెట్టు పక్కకు వచ్చాడు వర్మ. కానీ వీడని పొగమంచువల్ల అది బూడిద రంగులో కనిపిస్తోంది. తాను చేసిన ఉద్యోగానికి కారు ఎక్కువ. వచ్చిన దూరానికి మరీ ఎక్కువ. నడచి కూడా పది నిమిషాల్లో రావచ్చు. ఆంటే ఆ దూరం ‘వాకబుల్‌’ మాత్రమే కాదు; ‘డేక’బుల్‌ కూడా. ఉండేది పక్కనే శివాలయం వీధిలో. లోన్‌ మీద కొని, నెలనెలా వాయిదాలు కట్టి, రిటయిరయ్యేలోగా తీర్చి పారేసేడేమో..దానిని బయిటకు తీయటం కోసం ఏదో వంకను కనిపెడుతుంటాడు. ఆ వంక కూడా ఎప్పుడో కానీ రాదు. దానికన్నా నెలవంకే ముందొస్తుంటుంది. కానీ ఇప్పుడు వచ్చింది నెల ముందు వంక.
చెట్టు కింద చూస్తే వెలిసిన కాషాయ వస్త్రాల్లో ఒక సాధువు కూర్చుని వున్నాడు. సంతోష్‌ సన్యాసం పుచ్చుకుని వుంటాడా..? సన్యసించినవాడు సంతోష్‌ అవుతాడా..? తేల్చలేడు. ఎందుకంటే.. సంతోష్‌ వర్మను గుర్తుపట్టగలడు కానీ, వర్మ సంతోష్‌ను పోల్చుకోలేడు. సంతోష్‌ ఫేస్‌ బుక్‌ అక్కౌంట్‌లో తన ఫోటో పెట్టుకోలేదు. ఆ స్థానంలో పికాసో పెయింటింగ్‌ వుంటుంది. వర్మ అలాకాదు. తన ఫోటోయే కాదు, తన కుటుంబ సభ్యుల ఫోటోలూ, పిల్లల పెళ్ళిళ్ళ ఫోటోలూ, విదేశాలలో వాళ్ళు పెంచుకునే కుక్కల ఫోటోలూ, ఆకుక్కలతో చెలిమి చేసే పక్కింటాళ్ళ జాగిలాల చిత్రాలు కూడా వుంటాయి. వీళ్ళ ఇళ్ళల్లో శునకాలు కూడా సెల్పీÛలు దిగుతాయా- అని ఆశ్చర్యపడేలా వుంటాయి కొన్ని చిత్రరాజాలయితే..!
కారు భద్రంగా పార్కు చేసి, సాధువుకి దగ్గరగా వెళ్ళాడు. ఆ వాసనేమిటో చెప్పలేడు కానీ, ముక్కు మూసుకోవాలనిపించింది. వర్మను చూసి అతడు నల్లగా నవ్వాడు. తప్పు సాధువుది కాదు, గారపట్టిన అతని పళ్ళది. ఇంతలోనే ఒక తెల్లని దృశ్యం. సాధువు భుజాల మీదుగా పుష్కరాల రేవు వైపు చూస్తే ఒక తెల్లని ఆకారం. మంచును చీల్చుకుంటూ వర్మ వైపు వస్తోంది.
వర్మ కళ్ళజోడుతోనే చూస్తున్నాడు కానీ, గోదావరి లో ముఖం చూసుకుని మీద పడుతున్న ఉదయ కిరణాలు చూడనివ్వటం లేదు. చీకటే కాదు, ఒక్కొక్కప్పుడు వెలుతురు కూడా చూపును అడ్డుకుంటుంది. ఆకారం దగ్గరవుతోంది. మెత్తని కదలిక. నాట్యం నేర్చిన పాదాలకు మాత్రమే తెలిసిన నడక. వర్మలాగే నిద్రగన్నేరు చెట్టుకూడా కళ్లు చిట్లించి చూస్తోంది. నీడ పడే కొద్దీ, వెలుతురు తగ్గి, ఆకారం సుస్పష్టమవుతోంది. నీడ లేకుంటే వెలుగుకు ఉనికి లేదు. తెల్లని చొక్కా, నాచురంగు జీన్‌ఫాంటూ.., లావూ కాదు, సన్నమూ కాదు… గాలికి లేస్తున్న రింగు రింగుల కురులు. అంతా తెలుపే ఒక్క నల్ల వెంట్రుకా లేదు.
నవ్వు.. పేద్ద నవ్వు…అలలు అలలుగా.. కలలు కలలుగా.. అదే నిద్రగన్నేరు చెట్టు కింద ఏళ్ళ క్రితం విన్న నవ్వు. సిగ్గు ఎరుగని నవ్వు. శరీరమంతా కుదుపుకుని నవ్వే నవ్వు. ఆమే ఆనందం.. ఆనందమే ఆమె.
‘గ్లాడిస్‌!’
వర్మ పోల్చుకోకుండా వుంటాడా..? పైకి ఆనేశాడు. ఆమె దగ్గర కొచ్చేసింది. అదే శరీరపు రంగు. తెలుపు నలుపుల సమ్మిశ్రమం. అదే చామన ఛాయ. అంతకు మించి తగ్గలేదు.. పెరగలేదు. ఆకాశమంత నుదురు. విశాలతను కుదించటానికి ఒక్క బొట్టూ లేదు.
‘రేయ్‌..విభూ!’
అలా తానొక్కతే పిలవగలదు. ఆనందపడిపోతూనే అటూ, ఇటూ చూసుకున్నాడు విభాత వర్మ. ఈ వయసులో తనని ఈ మధ్య ‘ఏరా’ అని ఎవరూ పిలిచి ఎరుగరు.
‘మరి సంతోష్‌..!?’-
‘నేనే..నా పేరుకు తెలుగు అనువాదం.’ అంది గ్లాడిస్‌.
మోసం! అందమైన మోసం! గ్లాడిస్‌ అందంగా వుండటమే కాదు, తాను ఏం చేసినా అందంగా చేస్తుంది. అందగా నవ్వటం అందరూ చేసే పనే. కానీ, ఆమె అందంగా తిడుతుంది. అందంగా కొడుతుంది కూడా. అందానికి ఆధార్‌ కార్డు వుండదు కానీ, వుంటే, అది ఆమే.
మోహమంత తియ్యగా వుంది ఆమె చేసిన మోసం. తీపి పడటం లేదు అతడి దేహానికి, చాలా యేళ్ళ నుంచి.
‘రేయ్‌ విభూ, మరీ అంత్‌ వోల్డ్‌గా లేవు. ఫోటోల్లో ఏమిట్రా .. ఆ ముసలి వాలకం? రెస్పెక్ట్‌ కోసం తాపత్రయమా?’ అని నవ్వేసింది కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేటంత ఎక్కువగా, బిగ్గరగా, తీవ్రంగా.
‘డ్యూ!’
వర్మ అలా అన్నది. ఆమె చెక్కిలి మీద జారిపడి మెరుస్తున్న ముంచు బిందువులాంటి, కన్నీటి బిందువుని చూసి కాదు. ముద్దొస్తే ఆమెను అలాగే పిలిచేవాడు. ప్రేమలేఖ రాసేటప్పుడు కూడా ‘డ్యూ!’ అని మొదలు పెట్టేవాడు. ఆ మాట ముందు, ‘డియర్‌’ అని కూడా పెట్టేవాడు కాదు. అలా సంబోధించనందుకు, ఒక సారి వర్మ బుగ్గ మెలిపెట్టేసింది. అప్పుడు వర్మ తేరుకుని-
‘తియ్యనైన తీపి, ప్రియమైన ప్రేమా వుండవు కదా, ‘డ్యూ’ అంటే డియ్యరే నోయ్‌ దయ్యం!’ అనేశాడు. అది అప్పుడు. మరి ఇప్పుడో..!
‘విభూ! నువ్వొద్దన్నా సరే, నిన్ను కట్టుకోవాలనుకున్నాను’ అంది గ్లాడిస్‌.
‘డ్యూ…!?’
‘అవును. అదొక్కటే నువ్వు నాకు ‘డ్యూ’ (బాకీ)- వున్నావ్‌? తీర్చెెయ్‌ మరి?’ అంటూ అతడి అరచేతిలో చెయ్యి వేసి, పట్టుకుని, గోదావరి రేవు వైపు లాక్కొనిపోతోంది.
స్పర్శ. దగ్గర చేసిందీ అదే, దూరం చేసింది అదే.
‘డ్యూ! నాకు అరవయ్యయిదు… తెలుసా?’. ఆప్పటికే ఆమెతో ఆరడగులు నడిచేశాడు, రేవు దిగేశాడు.
‘స్వీట్‌ సిక్స్టీ ఫైవ్‌.. దెన్‌ వాట్‌? .. రా!’
‘నీకూ అంతే కదా?’
‘కాదు, నొక్కేశాను.. పాతిక దగ్గర. దేవతలు అంతే చేస్తారు. నేను నీకు ఏంజెల్‌ని కదా!’ రా ముందు.’ అప్పటికే ఇద్దరూ నావ ముందున్నారు. వర్మ చేత ఏడో అడుగును నావలో వెయ్యించేసింది గ్లాడిస్‌. తూలాడు వర్మ. నీళ్ళు అంతే. మీద పడితే ఊరుకోవు. ఓడల్నే నాట్యం చేయిస్తాయి. ఇక పడవలెంత? ‘తప్పటడుగు. నాతో రావటం కదా! ఆమాత్రం తూలుడుంటుంది. విభూ! నాకు నలభయ్యేళ్ళు ఆలస్యంగా అర్థమయ్యింది, నచ్చితే కట్టేసుకోవాలని.
‘హి..హి..హి! అన్నాడు. ఎవరూ? విభాత వర్మ కాదు. నావ సరంగు.
‘ఇదుగో. ఈ అబ్బాయీ కట్టుకునే వుంటాడు.’ అని వర్మతో అన్న గ్లాడిస్‌ ‘అవునా?’ అన్నట్లు, సరంగుతో చూసింది.
‘ఆయ్‌. కట్టేసుకున్నానండి… ఈ నావని. యేట్లో దిగాలి కదండి. ఇప్పుడు ఇప్పేత్తనానండి’ అంటూ నిజంగానే ఒడ్డున స్తంభానికి కట్టివున్న నావ తాడు ముడుల్ని విప్పాడు సరంగు.
‘నా పధ్ధతి వేరు. ఒడ్డున వుంచటానికి కాదు, యేట్లో దించటానికే కట్టుకుంటాను. అర్థమయిందా?’ అని సరంగు వైపు చూసి, కిసుక్కున నవ్వింది. తెడ్డు వేసి, నావను కదలిస్తూ సరంగు. ‘
ఆయ్‌!’ అనేశాడతడు. అంటే అవుననీ కాదు, కాదనీ కాదు. ఒక్క ‘ఆయ్‌’ను నూటొక్క అర్థాల్లో వాడగలడతడు. నావకున్న అడ్డచెక్కల మీద ఎదురు బదురు కూర్చున్నారు వర్మ, గ్లాడిస్‌ లు. పడవ తూలుడు ఆపింది. ఇప్పుడు నీళ్లు మాత్రమే మాట్లాడుతున్నాయి. తెడ్డు మాట్లాడిస్తోంది.
‘మేడమ్ గారండీ! ఏమనుకోపోతే ఓ మాటండీ..తమరిద్దరూ కల్సి, సకంలో దూకెయ్యరు కదండీ..?’ అన్నాడు సరంగు. వర్మా, గ్లాడిస్‌ ఒకరినొకరు తీక్షణంగా చూసుకుని, పకాలను నవ్వారు. నావా నవ్వింది. క్షణం క్రితం అన్న తన ‘ఆయ్‌’కు అర్థం అదన్నమాట- అని తేరుకున్నారు.
వర్మ, గ్లాడిస్‌ ముఖాన్ని చూస్తున్నాడు. తెల్లని వంకీల ముంగురులు ముఖాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నాయి, గాలికి. కళ్ళుపెద్దవే. కష్టంగా కాదు, ఇష్టంగా చూడాలనుకున్నప్పుడే చిట్లిస్తుంది. నలభయ్యేళ్ళ క్రితం వదలుకున్న మొత్తం ప్రపంచం విభాత వర్మ. ఇన్నాళ్ళకు ఎదురుగా వస్తే చిట్లించకుండా వుంటుందా?
పూర్తి లెదర్‌తో వున్న హ్యాండ్‌ బ్యాగ్‌ జిప్‌ తీసి, అందులోంచి కాఫీరంగులో వున్న సిగార్‌ కేస్‌ తీసి వర్మ చేతిలో పెట్టింది. తెరిచాడు. పేర్చిన హవానా చుట్టలు. కమ్మటి పొగాకు వాసన. ముక్కుపుటాలు జివ్వుమన్నాయి. మానేసిన అలవాటు, అణచివేసిన యవ్వనం లాంటిది.
‘మానేశానుగా’! అన్నాడు వర్మ, బలంగా పీల్చిన గాలిని వదలుతూ.
‘నేను వదల్లేదు గా!’ అంటూ భగ్గుమనిపించింది, తన చేతిలో వున్న సిగరెట్లు లైటర్‌ని.
విభాత వర్మ, ఒక సిగార్‌ తీసి, ఆమె పెదవులకు దగ్గరగా వుంచాడు. వణుకుతూ అందుకున్నాయి ఆమె పెదవులు. వణుకు వయసుతో కావచ్చేమో అనుకున్నాడు వర్మ. ఒకప్పుడవి తనమీద ప్రేమతో వణికేవి.
‘రేయ్‌ విభూ! ఈ అలవాటును ఎలా వదలించుకున్నావ్‌ రా! నువ్వు కాలుస్తుంటే, నాకు దగ్గు వచ్చేది. అయినా చూస్తూ వుండిపోయేదాన్ని. ఆ స్టయిలే వేరు. ఏదీ, ఎలా చూపించు. కాల్చొద్దులే. ఉత్తినే.. అలా రెండు వేళ్ళ మధ్యలో వుంచు.’ అంటూ గుప్పుమని. ఒక్క తృప్తికరమైన దమ్ములాగి, వదలుతూ అడిగింది గ్లాడిస్‌.
ఇంకో సిగార్‌ తీసి తననోట్లో పెట్టుకున్నాడు. వంగి ఆమె నోటి వరకూ వెళ్ళాడు. దమ్ము,దమ్ముకీ గ్లాడిస్‌ నోట్లోని చుట్ట కెంపులా మెరుస్తోంది. ఇద్దరి ముఖాలూ దగ్గరి కొచ్చాయి. ముద్దు. అవును. ముద్దే. అగ్గి ముద్దు. రెండుచుట్టలు ముద్దు పెట్టుకున్నాయి. నిప్పున్న చుట్ట, నిప్పులేని చుట్టను వెలిగించింది. గ్లాడిస్‌ ఊపిరి వెనక్కి లాగుతున్న కొద్దీ, చుట్ట చివరి నిప్పు ఎర్రబారుతోంది. తాను ఎర్రబారుతూ, ఎదుటి చుట్టను ఎరుపెక్కిస్తోంది. రెండు ఊపిరులు కూడా ఇలానే కలుస్తాయా? తూకం తప్పిన నావ కదలబోయింది. వర్మ తూలబోయాడు. గ్లాడిస్‌ పట్టుకుంది. తేరుకుని, ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు.
కాలు మీద కాలేసుకుని కూర్చుని, మడచిన ఆరికాలిని, ఏడమచేత్తో తాకుతూ, గుండెనిండా పీల్చిన పొగను గుప్పున వదిలాడు. పీల్చేకొద్దీ చుట్ట చివరి ఎరుపువెనక్కి తరుము కొస్తోంది. వెనక్కి తెడ్డు వేస్తున్న కొద్దీ, ముందుకు పోతున్న నావ. గ్లాడిస్‌ తన నోట్లో చుట్ట వుంచుకొనే, మొబైల్‌ లోని కెమెరాను క్లిక్‌ మని పించింది. స్క్రీన్‌ నిండా కమ్మేసిన ‘పొగవర్మ’ ను చ్రూసుకుని నవ్వుకుంది.
‘డ్యూ.. మళ్ళీ నలభయ్యేళ్ళ తర్వాత.’ అన్నాడు వర్మ.
‘నలభయ్యేళ్ళ నుంచీ కాలుస్తున్నాన్రా నేను.’ అంది గ్లాడిస్‌.
‘బ్యాడ్‌ హ్యాబిట్‌. ప్రేమలాగే. కానీ సినిమాలోని ఏ ప్రేమ సన్నివేశం వచ్చినా ఎవ్వడూ వెయ్యడు: ప్రేమించటం ఆరోగ్యానికి హానికరం’ అని చెబుతూ నవ్వబోయి, దగ్గింది. నావ ఊగిసలాడింది.
‘సదుంకున్నోల్లు సిగరెట్లు కాల్చాలి కానీ, ఈ సుట్టలేంటండే బాబూ..!?’ సరంగు కూడా చిన్నగా దగ్గుతూ సణిగేశాడు.
వర్మ, గ్లాడిస్‌ లో ఒకరి ముఖంలో ఒకరు తీక్షణంగా చూసుకుని, ఒక్కసారిగా కిసుక్కున నవ్వేశారు. సరంగు కూడా ‘ఆయ్‌’ అని ఇబ్బందిగా నవ్వేశాడు. ఈ సారి ‘ఆయ్‌’కు ఏమర్థమో మరి? కనిపెట్టలేక పోయినా, వాడికి ఒక ధూమ సందేశం ఇచ్చింది:
‘నాయనా, నావికోత్తమా? కుకర్‌ లో వండినా, కుండలో వండినా అన్నం అన్నమే. సిగరెట్టుతో తగలేసినా, చుట్టతో తగలేసినా పొగాకు పొగాకే. పైన తోలు ఒక్కటే తేడా. అది తెలుపు. ఇది నలుపు.’
‘ఆయ్‌!’ ఈ సారి సరంగు ముఖంలో సగం నవ్వే కనిపించింది. కానీ, వర్మనీ, గ్లాడిస్‌నీ మార్చి, మార్చి చూశాడు. దబ్బపండు రంగులో వర్మ, చామన ఛాయలో గ్లాడిస్‌. మిగిలిన సగం నవ్వూ తలవంచుకుని పూర్తి చేశాడు. అప్పటికే, నావకు నేల తగిలింది. ఒడ్డుకు చేరినట్లే. ఇద్దరూ కాలుతున్న చుట్టల్ని నీటి పాలు చేశారు. ముందు వర్మ ఫ్యాంటు రెండు వైపులా పైకి మడతపెట్టి దిగి, గ్లాడిస్‌కు చెయ్యందించాడు. అయినా దిగలేకపోతోంది. రెండు చేతులూ చాచాడు.
‘రేయ్‌ విభూ! మొయ్యగలవా?’
‘ప్రార్థనను రోజూ ఇలాగే దించుతాను. అలవాటేలే. రా!’
అది కొన్ని క్షణాలే కావచ్చు. కానీ, గ్లాడిస్‌ నవ్వుతూనే వుంది. దించేశాక కూడా నవ్వుకొనసాగుతోంది. ఆ నవ్వు, గోదావరి గాలితో కుమ్మక్కయి వర్మను వెనక్కి వెనక్కి.. నలభయ్యేళ్ళ వెనక్కి నెట్టేసింది. అప్పటి విభాత్‌ మేల్కొన్నాడు. రాజా వారి పోజు పెట్టాడు, ‘సఖీ! నేటికీ పల్లి చేరితిమి కదా!’ అన్నాడు గ్లాడిస్‌తో.
‘సకినేటిపల్లేనిండి. గోదారివతల కదండీ?’ అన్నాడు సరంగు. గ్లాడిస్‌ ఒక్కసారిగా నవ్వు ఆపేసి, అబ్బ, ఛా!’అన్నట్లు సరంగు వైపు చూసింది.
‘ఇసిత్తరం ఏంటంటేనండీ…, ‘ఇవతలన్నోల్లు… ఆటెంపిన వున్నోల్లని ‘యేటవతలోల్లు’ అంటారండి’ అన్నాడు సరంగు.
‘అలాగా? మరి అవతలవున్నవాళ్ళని, ఇటువైపున వున్నవాళ్ళని ఏమంటారు?’ గ్లాడిస్‌, సరంగు నడిగింది.
‘యేటవతలోల్లే అంటారండి. అదేనండి ఇసిత్తరం. ఒకటే గోదారమ్మ. ఎవలకాల్లు సొంతమనేసుకుని, ఎదుటోల్లకి పరాయిదనుకుంటారండి.’
ఇంతకు ముందుకు ‘ఆయ్‌’ కు ఇదన్న మాట అర్థమని గ్రహించి, అంతవరకూ వర్మకు అల్లుకుని వున్న గ్లాడిస్‌ దూరం జరిగింది. ఈ తత్తరపాటుకు, కాస్త బిత్తరబోయిన వర్మ,
‘నీ పేరేమిటన్నావ్‌?’ అనడిగాడు.
‘ఇంకా అన్లేదుకానిండీ, అబ్బులండి’ అన్నాడు, నావ తాడును ఒడ్డున వున్న స్తంభానికి కట్టేస్తూ.
‘అబ్బులా?’
‘అబ్బులే కానిండి. నా అక్కకూతురు డబ్బులంటాదండీ? ఆయ్‌!‘ అన్నాడు సరంగు అబ్బులు.
‘ఆయ్‌’కు ఈ సారి అర్థం వెంటనే స్ఫురించి, గ్లాడిస్‌ తన హ్యాండ్‌ బ్యాగ్‌ తెరచి, రెండువేల రూపాయిల నోటు తీసి ఇచ్చింది.
‘అయిబాబోయ్‌. నేను డబ్బులడగలేదిండి బాబూ.. నా యక్కకూతురెలా పిలుత్తాదో సెప్పానంతేనండి. దానిదగ్గర మాత్తరం రోజుకో వందన్నా నొక్కెత్తానండి. పనుందనుకోండి. యెయ్యిమన్నా యిచ్చేత్తాది…’
‘ఆమె ఉద్యోగం చేస్తుందా?’
‘ఏంటి మా గంగిదానికా? ఉజ్జోగమా? పదొక్లాసు తన్నేసిందానికా? దానికి లెక్కలొత్తేగా? ఆదే లెక్కల పరీచ్చ ఏడాదికో పాలు రాత్తానే వుంటాది.’
‘మరి పైసలెలా ఇస్తుంది?’
‘ఆదిచ్చేదంటండే… దాని బాబిత్తాడు..యియ్యలేదనుకోండి.. గోదాట్లో దూకేత్తానంటాది.. ఉత్తిదే… గుమ్మం కూడా దాటదు. కానీ అడిచ్చేతాడు..కట్నం కింద రాసుకుంటాడు లెండి. అది పుట్నప్పుడే నా యక్క సెస్పేసిందండి… రేయ్‌ అబ్బులా.. నీకు పెల్లాం పుట్టేసిందిరోయ్‌… అని’ వర్మకు చెప్పి, ‘సిల్లరట్టుకొత్తానుండండే!’ అని గ్లాడిస్‌ కు భరోసా ఇచ్చి, కొంచెం దూరంగా షెడ్డు పక్కన పార్కు చేసిన ‘యమహా’ బైక్‌ వైపు వెళ్లబోయాడు.
‘డబ్బులూ.. సారీ అబ్బులూ…ఇలా రా!’ అని పిలిచి, ఇంకో రెండు వేల రూపాయిలనోటు అతని చేతిలో పెట్టి, ‘నీ బైక్‌ మాకు ఓ నాలుగు గంటలు ఇవ్వగలవా?’ అంది. అతడు క్షణం ఆలోచించి, వర్మ వైపు చూసి, ‘మీరు బాంకోరే కదండీ!’ అని ‘మీరెలాగంటే అలాగేనండీ..సేన్నాల్ల కితం, ఓ పాలు తవర్ని బాంకులో సూసాన్లెండి.. ఆయ్‌!’ అన్నాడు. ఈ సారి ‘ఆయ్‌’కు తన సెక్యూరిటీ తాను చూసుకున్నానని అర్థ మని గ్లాడిస్‌ గ్రహించేసింది.

గోదావరికి ఒక వైపు వున్న వాళ్ళు, మరొక వైపు వున్న వాళ్ళను ‘ఏటవతల’ వాళ్ళంటారు. ఊరూ, వాడలూ అంతేనేమో! ఊళ్ళోవుండిపోయిన వర్మ వాళ్ళ నాన్న, గ్లాడిస్‌ వాళ్ళ వాడను ‘ఊరవతల’ అన్నాడు. మరి గ్లాడిస్‌ వాళ్ళనాన్న..? ‘వాడవతల’ అని అనుకున్నాడా… ఏమో!

గడిచిన నలభయ్యేళ్ళనూ, నాలుగు గంటలకు కుదించేసుకున్నారు ఇద్దరూ, బైకు వేగం వాళ్ళ వార్థక్యాన్ని దాచేసింది. కాలచక్రం ఆగనట్లే, బైకు చక్రాలూ ఆగలేదు. ఎక్కింది మొదలు తిరుగుతూనే వున్నాయి. తిండీ, తిప్పలు లేవు. వెన్నంటిన వెచ్చదనాన్ని వదులుకోలేక, విభాత వర్మ బైకు దిగితే వొట్టు. సాయింత్రం సూర్యుడు, చుట్ట చివరి ఎర్రటి బింబలా మారేసరికి, బైకు ఆపి, జీడిపప్పులున్న బాదం పాలు సీసాలో సగం తాగి గ్లాడిస్‌ ఇస్తే, వర్మ తాగాడు. నలభయ్యేళ్ళ తర్వాత, అతడి నాలుకకు తగిలిన ఎంగిలి! టపటపా కళ్ళ నీళ్ళు జారిపడ్డాయి, ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా. వాటిని గ్లాడిస్‌ పెదవులతో తుడవాలనుకుంది. కానీ అప్పటికే బైకు దిగిపోయిందేమో, వయసు గుర్తుకొచ్చింది. కర్చీఫ్‌ తీసింది. తుడవ బోయి, వెనక్కితగ్గి, అతడి చేతికిచ్చేసింది.
అబ్బులు బైకు స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ నావ మీదకు ఎక్కించాడు. తిరుగు ప్రయాణం. ఎదురెదురుగా మళ్ళీ చుట్టలు వెలిగాయి. దిగిపోతున్న సూర్యుడికి ఎదురుగా గ్లాడిస్‌, ముందు కూర్చున్న వర్మను చూసింది. నీడ. మొత్తం నీడ. నల్లని నీడ. ఫోటోను తీస్తే, వివరాలు లేకుండా, ఆకృతిని మాత్రమే రికార్డు చేసే ‘సిల్‌హౌటీ’. నీడ నోట్లో చుట్ట నిప్పు. రికార్డు చెయ్యాల్సిందే. కానీ మొబైల్‌ కెమెరాతో కాదు. ఇలా అనుకుంటూ, తన హాండ్‌ బ్యాగ్‌ లో ఏవేవో కాగితాల్లోంచి, ఒక వైపు తెల్లగా వున్న కాగితాన్నీ. మైక్రోటిప్పిడ్‌ పెన్నునూ తీసుకుని, బ్యాగ్‌ మీదే పెట్టుకుని, అతడి బొమ్మ వేస్తూ.. కూని రాగం అందుకున్నది గ్లాడిస్:
‘…నేలతో నీడ అన్నది నను తాకరదనీ… పగటితో రేయి అన్నదీ నను తాక రాదనీ’
‘డ్యూ… కృష్ణశాస్త్రి పాట… మంచిరోజులు వచ్చాయి.. లోనిది…ఇంకాస్త బిగ్గరగా…!’ అన్నది విభూ నీడ.
‘రేయ్‌ విభూ… కదలకు రా!’
తెల్లని విభూతి వర్మ నల్లని ఆకారంలో మెరుస్తున్నది కేవలం చుట్ట చివరి మెరుపే. ఛామన ఛాయ గ్లాడిస్‌ మీద సాయింత్రపు సూర్యుడి వెలుతురు పడి పండిన నారింజలా వుంది. జుత్తయితే వెండి ధగధగలే. వణికీ, వణకని వేళ్ళను అదిమిపెట్టుకుంటూ గీసింది వర్మ స్కెచ్‌.
గీస్తున్నంత సేపూ అదే మాట.. కొన్ని పదాలు పలుకుతూ.. కొన్నింటి స్థానంలో కూని రాగాన్ని నింపుతూ.
‘వేలి కొసలు …. దే, వీణ పాట… నా’ అని మధ్యలో, ‘విభూ.. ఇప్పుడు కదలరా!’ అని గ్లాడిస్‌ ఆదేశానికి నీడ కదిలింది; నిప్పు ఆరింది.
‘నేనేనా…?! నీడలా..? నలుపు ఇంత అందమైనదా?’ అని ఆశ్చర్యపోతూ, ఆ కాగితాన్ని మార్చి, మార్చి చూసి, మడచి జేబులో పెట్టుకున్నాడు.
ఒక్కసారి గ్లాడిస్‌ గొంతు తూర్పునుంచి పశ్చిమానికి మారింది. స్వరం మొత్తం పాశ్చాత్యమయిపోయంది.
‘య్యా.. య్యా.. య్యా.. నౌ… ఇట్స్‌ బ్లాక్‌, ఇట్స్‌ వైట్‌…ఇట్స్‌ టఫ్‌ ఫర్‌ దెమ్ టు గెట్‌ బై.. ఇట్స్‌ బ్లాక్‌, ఇట్స్‌ వైట్‌.. హాహా…!’ లేచి నిలబడి మరీ శరీరాన్ని కుదుపుకుంది. మైఖైల్‌ జాక్సన్‌ మూన్‌ వాక్‌ బదులు, బోట్‌ వాక్‌ చేసినట్లనిపించింది.
‘అద్భుతం.. ఆమోఘం… మార్వెలెస్‌.. ఊపేశావ్‌!’ చప్పట్లతో వర్మా లేచినిలబడ్డాడు.
‘ఆయ్‌.. ఊపేశారండి నావని!’ సరంగు మళ్ళీ అన్న ‘ఆయ్‌’ లో వున్నది ప్రశంసో, విమర్శో అర్థం కాలేదు.
‘దటీజ్‌ మై డ్యూ! అప్పుడే ఈస్టరన్‌… అంతలోనే వెస్టరన్‌… తూర్పు, పడమరల్ని ఏకం చెయ్యగల స్వరం’ అనే ఆమెను కూర్చోబెట్టి, తనూ కూర్చుని, ఆమె స్వరపేటికను తన మునివేళ్ళతో నిమిరాడు. అంతే.. గ్లాడిస్‌ ఒళ్ళో, వర్మ పడ్డాడు. కారణం: అప్పటికే నావ ఒడ్డును తాకటం.
బిడ్డల కోసం కళ్ళల్లో వొత్తులేసుకుని, ఎదురు చూసి, చూసి, తల్లి రెప్పలు వాల్చినట్టు, అప్పటికే లాంచీల రేవులోని నిద్రగన్నేరు చెట్లు తన ఆకుల్ని ముడిచేసుకుంది. విద్యుద్దీపాలు వెలిగిపోయాయి. ఎక్కడినుంచి వచ్చిందో, ఎర్రటి మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు వచ్చి గ్లాడిస్ ను ఎగరేసుకుపోతుంటే, విండో దించి, విభాత వర్మకు చెయ్యి ఊపింది.
అంతవరకూ నలభయ్యేళ్ళూ, ఒక రోజులా గడచిపోయాయనుకునే వాడు విభాత వర్మ. ఈ ఒక్క రోజులో నలభైయేళ్ళు గడచిపోవటం అతడికి ఒక కొత్త అనుభూతి.



ఏం చేసినా తేలుతున్నట్లే వుంది విభాత వర్మకి. కుదుపుల రోడ్డు పైన కూడా తన సాంత్రో కారు మెత్తగా, అలలమీద నుంచి లేచి పడ్డట్టుంది. ఇంటికొచ్చినా అంతే. బాత్‌ టబ్‌లోనుంచి లేవబుధ్ధి కావటంలేదు. వెచ్చటి నీటిలో తేలుతూనే వుండాలనిపిస్తుంది. నడుమ వాల్చినా అంతే. అది కుషన్‌ బెడ్డే. కానీ వాటర్‌ బెడ్‌ లా వుంది. అలల మీద పడుకున్నట్టుంది. నిద్రలోనూ అంతే. నావ పక్కకు వాలితే, తుళ్ళిపడ్డట్టు, తుళ్ళిపడి లేచినట్లుంది.
‘ఎక్కడెక్కడ తిరిగారో… ఒక్కసారి హనుమాన్‌ ఛాలీసా నోట్లో అనుకోండీ.. గాలీ, ధూళీ వుంటే, అదే పోతుందీ..!’ అని వర్మని తనవైపు తిప్పుకుంటూ అంది ప్రార్థన.
అప్పటికే తెల్లవారబోతోంది.
‘ప్రార్థనా! నన్ను ప్రేమిస్తున్నావా?’ ఆమె మీద చెయ్యవేసుకుంటూ అడిగాడు వర్మ. వెంటనే అతడి నోటి మీద చెయ్యి వేసి. ‘మీరు. నాకు దేవుడితో సమానం.’ అన్నది. ‘అవును కదా! ఆరాధన!!’ అని పైకి అనేశాడు.
‘ఆరాధనా..? ఆమె ఎవరు?’ ఆందోళనగా అడుగుతూ, మెడకు వేళ్ళాడుతున్న మంగళ సూత్రాన్ని తడుముకుని, పైకి తీసి కళ్ళకద్దుకుంది.
‘ఎవరూ కాదు’లే పడుకో, అని వెల్లికిలా తిరిగాడు. కళ్ళుమూసుని మెలకువను అనుభవించ బోయాడు: ప్రేమ ఇంత వ్యసనమా? వర్మే బొమ్మలు వేసేవాడు. వర్మే చుట్టలు కాల్చేవాడు. ఇవి వర్మ వ్యసనాలు. గ్లాడిస్‌ పాటలు పాడేదంతే. గ్లాడిస్‌ అంటేనే వాయిస్‌. ఇద్దరి అలవాట్లను తనే మిగుల్చుకుంది. కారణం ప్రేమ. ఎడతెగని ప్రవాహం. నది. అందులో వున్నంత సేపూ, ‘ఇవతల’ ఏమిటి? ‘అవతల’ ఏమిటి? అబ్బులు చెప్పింది నిజం: అసలు ఇవతలనేది లేదు. గోదావరికి ఒక వైపు వున్న వాళ్ళు, మరొక వైపు వున్న వాళ్ళను ‘ఏటవతల’ వాళ్ళంటారు. ఊరూ, వాడలూ అంతేనేమో! ఊళ్ళోవుండిపోయిన వర్మ వాళ్ళ నాన్న, గ్లాడిస్‌ వాళ్ళ వాడను ‘ఊరవతల’ అన్నాడు. మరి గ్లాడిస్‌ వాళ్ళనాన్న..? ‘వాడవతల’ అని అనుకున్నాడా… ఏమో!
మెలకువను ఎప్పుడు నిద్ర ఆక్రమించుకుందో తెలీదు. తిరిగి, ప్రార్థన మేలుకొలుపుతోనే లేచాడు: ‘ఏమండీ, మీ షర్ట్‌, వాషింగ్‌ మెషిన్‌ లో వేయిస్తున్నాను. జేబులో కాగితం వుంది. తీసెయ్యొచ్చా…!?’ అనగానే, ‘తీసె… ’ అనబోయి, గుర్తుకు వచ్చి, ‘నో…నో..నో.. ఉంచు’ అన్నాడు. అంతలోనే అనుమానం: ‘నేను లేపి, కుర్చీలో కూర్చోబెడితే కదా.. ప్రార్థన కదిలేదీ..!?’ అని అనుకునే లోగా, తన బెడ్‌ దగ్గరకే చక్రాల కుర్చీ వచ్చింది, పొగలు కక్కే కాఫీతో. పనిమనిషి చేత తోయించుకుని ప్రార్థన వచ్చేసింది. అప్పటికే పూజ పూర్తయినట్లుగా నుదుటి మీది బొట్టు చెబుతోంది.
ప్రార్థన తన కోసమే పుట్టేసిందా? అవును. ప్రార్థన కోసం అంతకన్నా ముందు తాను పుట్టేశాడు. ఒక వేళ తాను ప్రార్థనను తప్పించుకున్నా, ప్రార్థన చెల్లెలు శ్లోక ను పెళ్ళాడే వాడు. పడవ సరంగు అబ్బులు లాగే. అబ్బులు కోసం, వాడి అక్క కూతురు పుట్టేసింది. ఇలా ఎవరికి కావలసిన వారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లోనే పుట్టేస్తే ఎలా? ప్రేమల్ని కూడా అదే ఇళ్ళల్లో పుట్టించెయ్యాలా?
కాఫీ కప్పు ఖాళీ అయ్యింది. చక్రాల కుర్చీ వెళ్ళి పోయింది.
ఒక్క సారి, ఇంకొక్క సారి, మరొక్క సారి,, గ్లాడిస్‌ స్వరం వింటే..!? మొబైల్‌ అందుకుని, అంతకు ముందురోజే ‘డ్యూ’ పేరు మీద ఫీడ్‌ చేసుకున్న నంబర్‌కు డయిల్‌ చేశాడు. ‘బ్లాక్‌ ఆర్‌ వైట్‌’ డెయిల్‌ టోన్‌ వినిపిస్తోంది. ఈ లోగా పక్క మీద, ప్రార్థన వుంచిన కాగితాన్ని చూశాడు. మడతలు విప్పాడు.. తన నల్లని నీడ.. చుట్ట కాల్చే తన స్టయిల్‌…! ‘బ్లాక్‌ ఆర్‌ వైట్‌’ సాంగ్‌ నడుస్తూనే వుంది. ఈ లోగా చేతిలోని కాగితం చటుక్కున జారింది. వంగి తీసుకోబోయాడు. గాలికి కాగితం బోర్లాపడింది. ‘అపోలో హాస్పిటల్స్‌’ అని రాసివుంది. నిజమా? కాదా? రెండు కళ్ళకీ ‘కాటరాక్ట్‌’ సర్జరీలు కూడా అయిపోయాయేమో.. ప్రతీదీ స్పుటంగా కనిపిస్తోంది. మొబైల్‌ ఎడమ చెవి దగ్గర వుంచుకునే, కుడి చేత్తో కాగితం దగ్గరకు తీసుకుని చూశాడు. డయాగ్నిస్టిక్‌ రిపోర్టు అది. పేషెంట్స్‌ నేమ్: ప్రొ. ఎం.ఎం. గ్లాడిస్‌ అని వుంది. స్వరపేటికలో ఏర్పడే ‘గ్లోటిక్‌ క్యాన్సర్‌’. గుండె ఝళ్ళుమంది. అప్పుడే మొబైల్‌ లో స్వరం. ‘డ్యూ!’ అన్నాడు. ‘ఎవరూ?’ అని బదులు వచ్చింది. అది గ్లాడిస్‌ వాయిస్‌ కాదు.
‘గ్లాడిస్‌ కారా?’
‘కాదు. నేను వాళ్ళ చెలెల్ని మెర్సీను’ అంది కాస్త వణుకుతూ. గ్లాడిస్‌ స్వరంలా కాదు. ఈమె స్వరంలో వార్థక్యం తెలిసిపోతోంది.
‘మరి గ్లాడిస్‌?’
‘… ఎలా చెప్పాలీ..? ఆపరేషన్‌ ది¸యేటర్లో వుంది. ఇప్పుడే తీసుకు వెళ్ళారు.’
‘ ఏం ఆపరేషన్‌?’
‘వోకల్‌ కార్డ్స్‌ రిమూవ్‌ చేస్తారు…,’ మెర్సీ ఇంకా చెబుతూ వుంది. వర్మ వినలేక పోతున్నాడు. ఊ- కొడుతున్నాడంతే..
‘ కోకిలకు స్వరపేటికను తొలగిస్తున్నారా…? పాటను చంపి కోకిలను బతికిస్తున్నారా?’ ఇలా అనుకునేలోగా, కాల్‌ దానంతటదే కట్టయిపోయింది. తన చెక్కిళ్ళు తడిసిపోతున్నాయి. ఈ ముఖాన్ని ప్రార్థన చూడకూడదు- అనుకుని బాత్‌ రూవ్‌ులోకి వెళ్ళాడు. గొంతెత్తి ఏడ్చాడు. బ్రష్‌ చేస్తూ ఏడ్చాడు, స్నానం చేస్తూ ఏడ్చాడు. తేరుకుని, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చోగానే, చక్రాల కుర్చీ చప్పుడు లేకుండా వచ్చింది. ప్లేట్లో ఉప్మా వడ్డిస్తోంది ప్రార్థన.
‘ఏమండీ..!’ అని ఏదో చెప్పబోతోంది ప్రార్థన
‘ఏరా… ఏరా… అని నోరారా ఒక్క సారి అనలేవా? రేయ్‌ విభూ.. అని అనలేవా..?’ అని దీనంగా ఆడిగాడు విభాత వర్మ.
ప్రార్థన అవాక్కయిపోయింది. ‘నేనా… మిమ్మల్నా… ఏరా.. అనాలా !? అపచారం. అపచారం.’ అని లెంపలు వాయించుకుంటోంది. అవే చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు తన చెంపలు వాయించుకున్నాడు. ‘యూ నో ప్రార్థనా!? ఇది తలకిందుల సమాజం. ఇక్కడ లవ్‌ ఈజ్‌ ఇన్జూరియస్‌ టు హెల్త్‌. ప్రేమ ఆర్యోగానికి హానికరం!’ అన్నాడు, వర్మ ఏడ్వలేక నవ్వుతూ.
———–

-సతీష్ చందర్

చిత్రాలు: చారి

(ఆదివారం ఆంధ్రజ్యోతి 7 నవంబరు 2021 సంచికలో ప్రచురితం.)

2 comments for “నిద్రగన్నేరు చెట్టు

  1. “గుండె ఘనీభవించింది”. ఇది నా మాట కాదు. సరిగ్గా ఓ రెండు వారాల తర్వాత వచ్చిన ఆదివారం ఆంధ్రజ్యోతి మ్యాగజైన్ చూస్తుంటే ఈ మాట కనిపించి, నిద్రగన్నేరు చెట్టు కథను చదివించేలా చేసింది నన్ను. నిజంగానే “హృదయాంతరాల్లో ఏదో అలజడి.. అది అలజడి కాదు, గుర్తుకు వస్తున్న పాత జ్ఞాపకాల తలపులవి” అని అన్న కె. లహరి గారి మాటలు పదేపదే గుర్తుకు వచ్చాయి నాకు. కథ చాలా బాగుంది. అంత తేలిగ్గా మరిచిపోలేని కథ ఇది. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *