అక్కడ ‘జస్ట్‌ మెర్సీ’! ఇక్కడ ‘జై భీమ్’!!

Actress Lijomol Jose as Senggeni in Jai Bhim Movie HD Images


అవసరాల మధ్యనే జీవిస్తుంటాం. అవసరాలు తీర్చుకోవటమే జీవిస్తుంటాం. తిరిగి అవసరాలను అన్వేషిస్తూనే జీవిస్తుంటాం.
చెయ్యటానికో ఉద్యోగం, ఉండటానికో ఫ్లాటూ, తిరగటానికో కారు. తోడుకో సహచరీ లేదా సహచరుడూ, గొప్పలు పోవటానికి పిల్లలూ, వాళ్ళ ప్రాగ్రెస్‌ రిపోర్టులూ.. ఇవన్నీ అవసరాలే.
ఇన్ని అవసరాల్లోనూ ఆవేశం కూడా అప్పుడప్పుడూ అవసరమయిపోతుంటుంది. దీనిని తీర్చిపెట్టటానికి కోట్లకు పడగలెత్తే వినోద పరిశ్రమ వుంటుంది. ఎప్పుడు ఏ ఆవేశం అవసరమో ఆ ఆవేశమే తీర్చిపెడుతుంటుంది.

అవసరానికో ఆవేశం
ఒకప్పుడు అడవిలో అన్నలంటే, ఆవేశం కట్టలు తెంచుకునేది. అందరూ అన్నలు సినిమాలే తీశారు. పాపం! దాసరి లాంటి ఒకరిద్దరు మాత్రం ‘అక్కల’ సినిమాలు (ఒసేయ్‌ రాములమ్మా!య) లాంటివి తీశారు. ఆ తర్వాత అవినీతి పైన ఆవేశం కట్టలు తెంచుకొంది. ‘లంచం.. లంచం.. లంచం’ అని హీరో పళ్లు పటపటలాడిస్తుంటే, ధియేటర్లలో జనానికి వొళ్ళు జలదరించేది. కమల్‌ హాసన్‌ ‘భారతీయుడు’ నుంచి విక్రవ్‌ు ‘అపరిచితుడు’ వరకూ ఇలాంటి గగుర్పాటులే. మళ్ళీ ఆవేశం ముఖం మార్చుకుంది. సీమ ఫ్యాక్షనిజం వచ్చింది. గన్నులూ, మందు పాతరల కన్నా, నాటు బాంబులు పేల్చటంలో ఆవేశం తీర్చుకున్నారు. తెర మీద హీరో తొడలు కొడుతుంటే, సీట్లో ప్రేక్షకుడి ఒడలు పులకరించేవి. ఈ ఆవేశమూ కొన్నాళ్ళే. అన్నలూ, ఫ్యాక్షనిస్టులూ, అవినీతి కాకుండా, దేశభక్తి తన్నుకొచ్చేసింది. ఈ సారీ గన్ను తప్పలేదు కానీ, ఆ గన్ను ‘అన్నల’ చేతుల్లో కాకుండా కాకుండా, ‘సిపాయిల’ భుజాల కుండాలి. దేశభక్తి మొత్తం దేశం వెలుపలే. సరిహద్దులు దాటి లోపలకి రాకూడదు. ఇతర దేశాలతోనూ సరిహద్దులు పంచుకోవచ్చు. అక్కడా యుధ్ధం చెయ్యవచ్చు. కానీ పాకిస్తాన్‌ సరిహద్దు దగ్గర పోరాడితేనో, ప్రాణాలొదితేనో దేశభక్తి. నిజానికి ఇప్పుడు దేశభక్తి ఋతువే నడుస్తోంది. ప్రేక్షకుడి ఆవేశం తీర్చిపెట్టాలంటే, హీరోకి సైనికుడి పాత్రే ఇవ్వాలి. విలన్‌ గాడి తిక్క కుదర్చాలంటే, వాణ్ణీ సైన్యంలో తోసెయ్యాలి.

ఊరివెలుపల కెమెరా
ఇలా ఋతువుల వారీ ఆవేశాలను కాదని, ఊహించని జీవితాలను తెర మీదకు తెచ్చి, ఊపిరందని ఆవేశానికి గురి చేస్తే ఆ నిర్మాతలను ఏమనాలి? సూర్య-జ్యోతికలనాలి. ఆ దర్శకుడినేమనాలి? జ్ఞానవేల్‌ అనాలి. ఋతువులకు అతీతమైన ఈ ఆవేశం పేరే ‘జై భీమ్’ . దేశమంతటా కేవలం అంబేద్కరైట్లు మారు మోగించే నినాదం. భీమ్ రావ్ అంబేద్కర్ ను కొనియాడే నినాదం. హఠాత్తుగా ఒక చిత్రం పేరయి కూర్చుంది. దక్షిణాదిన అగ్రతార సూర్య నిర్మించటమే కాకుండా నటించాడు.
అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, అనే మాటల మాటున దాగకుండా – ఊరివెలుపలి లేదా మురికివాడలలో దళితుల జీవితాలు ఇవీ అని- సినిమాలు తియ్యటం ఈ మధ్యనే మొదలు పెట్టారు. తమిళ నాట (కాలా, కబాలి లతో) పా రంజిత్‌ ఈ పనిచేశారు. ఏకంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని పెట్టే వందల కోట్ల ఖర్చుతో చిత్రాలను పూర్తి చేసి, వదిలారు . ఇక రజనీకాంత్‌ అల్లుడు ‘ధనుష్‌’తో కూడా ఇతర దర్శకులు ఇలాంటి చిత్రాలు తెరకెక్కించారు. తెలుగు నాట కూడా ఈ తరహా ప్రయోగాలు చేశారు. కుల వివక్ష మీద క్రిష్‌, సుకుమార్‌లు ‘కంచె’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలు తీశారు, కానీ, వారి వారి కెమెరాలు ‘ఊరి వెలుపల’ వరకూ పోనివ్వలేదు. రజక, మత్స్యకారుల జీవితాలు వరకూ వచ్చి ఆగాయి.

ముందు ’నీల్‘ వెనుక లాల్’
కానీ, ‘జై భీమ్’ పేరుతో జ్ఞానవేల్‌ గిరిజనుల జీవితాలను తీసుకున్నా, కులవివక్షను, కళ్ళారా చూపించారు. సినిమా పేరులో ‘నీల్‌ (అంబేద్కర్‌) నినాదం వున్నా, సినిమా అంతటా ‘లాల్‌’ (ఎర్ర) జెండాలే ఎగిరాయి. చంద్రు పాత్ర వేసిన ‘సూర్య’ కార్యాలయంలో కార్ల్‌ మార్క్స్‌ కనిపిస్తూనే వున్నారు. చంద్రు కల్పిత పాత్ర కాదు. నిజజీవితంలో వున్న పాత్ర. న్యాయవాది నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగి జనంలో ఇప్పటికీ ఒదిగివున్న నిలువెత్తి మనిషి పాత్ర. చంద్రు విద్యార్ధి దశనుంచి కమ్యూనిస్టు ఉద్యమాల్లో వున్నారు. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.ఎఫ్‌.ఐ)లో చురుకయిన పాత్ర పోషించారు. విద్యార్థి ఉద్యమంలో వుండటం కోసమే ‘లా’ చేశారు. ఆయన విద్యార్థి ఉద్యమనేతగా వున్నప్పుడే ఇందిరమ్మ ఎమర్జన్సీని చూశారు. పౌరహక్కులు అడుగంటటం గమనించారు. పోలీసులు మనుషుల్ని మాయం చెయ్యటం అప్పట్లో మామూలు విషయం. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి రావటమే అందరికీ తెలుసు. అది పైన వచ్చిన మార్పు. కానీ కింద వచ్చిన మార్పు కూడా వుంది. అదే హక్కుల చైతన్యం. కాబట్టే,ఆ తర్వాత కాలం (80వ దశకం)లో పోలీసులు చేసే అబధ్దపు ఎన్‌కౌంటర్లనీ, లాకప్‌ మరణాలనీ ప్రజలు నిరసించారు. వారికి వత్తాసుగా పలువురు న్యాయవాదులు నిలిచారు. ‘హెబియస్‌ కార్పస్‌’ పిటిషన్లను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. పోలీసులు మాయం చేసిన వ్యక్తుల్ని భౌతికంగా హాజరు పరచాల్సిన న్యాయ అనివార్యతను అందరకూ తెలిసేలా చేశారు.

నాటి హక్కుల ’అంకురం‘
‘జై భీమ్’ చిత్రానికి ఇతివృత్తంగా మారిన చంద్రు పోరాటం కూడా అలాంటిదే. సినతల్లి అనే గర్భిణీ, తన చిన్న కూతుర్ని పెట్టుకుని, పోలీసు కస్టడీలోనుంచి మాయమైన తన భర్త కోసం చేసే న్యాయ పోరాటం. ఈ పోరాటానికి చంద్రు ‘హెబియస్‌ కార్సస్‌’ అనే అస్త్రాన్ని అందిస్తాడు. అప్పట్లో ఇలా దొంగతనమో, మరో చిల్లర నేరమో చేశారన్న అనుమానం మీద కింది కులాల వారిని, తీసుకువెళ్ళి లాకప్‌లో చిత్రహింసలు పెట్టటమూ, మహిళల్నయితే లాకప్‌లోనే అత్యాచారాలు చేసి వదలటమూ పోలీసులకు నిత్యకృత్యాలుగా వుండేవి. వాటికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలూ ఇలాగే వుండేవి. ఇలాంటి కథల ఆధారంగా తెలుగులో సినిమాలు రాలేదనటం అబధ్ధం. అప్పట్లో ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో ఓంపూరి- రేవతి నటించిన ‘అంకురం’ వచ్చింది. హక్కుల ఉల్లంఘన మీదే ఆ చిత్రం ప్రధానంగా సాగుతుంది. అప్పట హక్కుల ఉద్యమాలకు కులవివక్ష మీద ప్రత్యేక దృష్టి లేదు.

‘జస్ట్ మెర్సీ’ లాగే!
ఇక్కడ దళితుల లేదా గిరిజనుల పట్ల కుల వివక్ష ఎంత తీవ్రంగా వుంటుందో, అమెరికాలో జాతి (రేస్‌) వివక్ష అంతే వుంటుంది. కేవలం రెండేళ్ళ క్రితమే ఈ వివక్ష మీద ఇలాంటి చిత్రమే వచ్చింది. దాని పేరు, ‘జస్ట్‌ మెర్సీ’. ఇక్కడ చంద్రు అన్న న్యాయవాది, గిరిజన స్త్రీకి న్యాయం చెయ్యటం కోసం ఎలా ప్రయత్నించాడో, అక్కడ కూడా హత్య కేసులో అన్యాయంగా ఇరుక్కున్న వాల్టర్‌ జానీ డి మెక్‌మిలన్‌ అనే నల్లజాతీయుడిని రక్షించేందుకు హార్వర్డ్‌ లో లా చేసిన యువన్యాయవాది బ్రియాన్‌ స్టీవెన్‌సన్‌ ప్రయత్నిస్తాడు. ఇదీ యధార్థ గాధే. చంద్రు పాత్రను సూర్య పోషించినట్లు, స్టీవెన్‌సన్‌ పాత్రను మిఖాయెల్‌ బి. జోర్దాన్‌ సమర్థవంతంగా పోషిస్తాడు.

అక్కడ జాతి, ఇక్కడ కులం
‘జై భీమ్’ చిత్రం ప్రారంభంలోనే కుల వివక్ష కనిపిస్తుంది. జైలునుంచి విడుదల చేసేటప్పుడు, దళితుల్నీ, గిరిజనుల్నీ ఒక వైపూ, ఇతర కులస్తులనూ ఒక వైపూ నిలబెడతారు. దళితుల్నీ, గిరజనుల్నీ తిరిగి మళ్ళీ కొత్త కేసుల్లో ఇరికిస్తుంటారు. ‘జస్ట్‌ మెర్సీ’లో తెలుపు, నలుపుల వర్ణ వివక్ష చిత్రమంతా కనిపిస్తుంది. కోర్టురూవ్‌ు లో శ్వేతజాతీయులు కూర్చుని వుంటే, నల్ల జాతీయులు వెనుక నిలబడి వుంటారు. మెక్‌ మిలన్‌ హత్య చెయ్యలేదనీ, హత్య జరిగిన సమయంలో తమ మధ్యనే వున్నాడని పలువురు నల్లజాతీయుల సాక్ష్యాన్ని పక్కన పెడతారు. వేరు కేసులో అరెస్టయిన ఒక తెల్లజాతీయుడు తాను చూశానన్న సాక్ష్యంతో మెక్‌మిలన్‌ కు మరణ శిక్ష వేస్తారు. ఇంతకీ ఆ తెల్లవాడు కూడా చూడలేదు. అతణ్ని ప్రలోభపెట్టి పోలీసులు చెప్పిస్తారు. కడకు న్యాయవాది చొరవతో, అతడు తాను చూడలేదని నిజం ఒప్పుకున్నా, న్యాయమూర్తి ఆ మార్పును పరగణించరు. కడకు పబ్లిక్‌ ప్రాసిక్యూటరే అనుకూలించటంతో మాక్‌మిలన్‌ కు న్యాయం జరగుతుంది. అది వేరే విషయం.

రెండు చోట్లా ముప్పేట పోరే!
‘జై భీమ్’ లో సినతల్లి (లిజో మోల్‌ జోస్‌) దొంగతనం నేరం మీద తన భర్తను తీసుకువెళ్ళి మాయం చేస్తారు. ఆమె తరపున చంద్రు( సూర్య) న్యాయవాదిగా నిలబడతారు. గిరిజనుడు చంద్రు దొంగతనం చెయ్యలేదని ధ్రువపరిచే పలు సాక్ష్యాలు గిరిజనుల దగ్గరే వుంటాయి. కానీ అవేం పనికి రావు. పోలీసులు సృష్టించిన సాక్ష్యాలే అంతటా కనిపిస్తుంటాయి.
రెండు చిత్రాల వెనుకా కేవలం న్యాయవాది పోరాటమే కాదు, హక్కుల చైతన్యంకోసం పరితపించే పౌరసమాజానికి ప్రతినిధులూ వుంటారు. ‘జై భీవ్‌ు’లో చంద్రు కు తోడుగా ఒక టీచర్‌ వుంటుంది. ‘జస్ట్‌ మెర్సీ’లో న్యాయవాది బ్రియాన్‌ స్టీవెన్‌సన్‌కు తోడుగా కూడా ‘మరణ శిక్ష రద్దు’ లక్ష్యంగా పనిచేసే మహిళ వుంటుంది. అలాగే నల్లజాతీయుల ప్రజాస్వామిక పోరాటం ‘జస్ట్‌ మెర్సీ’ లో కనిపిస్తే, గిరిజన హక్కులకోసం గిరిజనుల పోరాటమూ కనిపిస్తుంది. న్యాయం కోసం రెండు చిత్రాల్లోనూ ముప్పేట పోరే కనిపిస్తుంది చిత్రంగా.

న్యాయవాదికి నిబధ్దతే నల్లకోటు
‘జై భీమ్’ చిత్రాన్ని ఎంత గొప్పగా తీశారో చెప్పగలిగింది జస్టిస్‌. చంద్రు ఒక్కరే. ఈ చిత్రాన్ని ఆయనా చూశారు. సంతృప్తి చెందారు. న్యాయవాది కి కావాల్సింది సిక్స్‌ ప్యాక్‌ శరీరం కాదు, ‘సిక్స్‌ ఒన్సెస్‌’ మేధస్సు అని చంద్రు అన్నారు. ‘జస్ట్‌ మెర్సీ’ చిత్రంలో కూడా బ్రియాన్‌ స్టీవెన్‌సెన్‌ పాత్ర కూడా ఇలాంటి వ్యాఖ్య చేస్తుంది. మేధస్సుతో పాటు నిబధ్ధత ముఖ్యమంటుంది.
అవసరానికో ఆవేశం కాదు, ఆవేశమే అవసరమయిపోవాలి. ఆలోచన కలిగిన అవేశం అత్యవసరమయి పోవాలి. అందుకోసమైనా, ‘జై భీమ్’ చూడటం ఒక అవసరం.

సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 6-13 నవంబరు 2021 సంచికలో ప్రచురితం)

4 comments for “అక్కడ ‘జస్ట్‌ మెర్సీ’! ఇక్కడ ‘జై భీమ్’!!

  1. అద్భుత సమీక్ష సార్.
    ‘రేటింగ్స్ ఇవ్వడం కాదు, నటీనటులను కించపర్చడం, దర్శకుల ప్రతిభను సంకుచిత మనసత్వంతో వెక్కిరించడం, ఎవరూ గుర్తించని లోపాల్ని గుర్తించేసినట్టు’ చవకబారు రివ్యూలు రాసే తెలుగు సమీక్షకులకు కాస్త ట్రైనింగ్ ఇవ్వండి సార్.
    ‘తెరమీద మరోసారి అంకురం’ అని ఎవడో సమీక్ష చేసాడు. వాడు మీ రివ్యూ చదవాలని నా కోరిక.

  2. Great analysis sir ! Movies follow a trend for sure. But I am afraid now. Once people started realising the honesty in Naxal movement (thru movies as well), Rajyam ensured that it’s almost taken out from roots. No more front page news on this movement like in my childhood. No one cares now.

    As you rightly pointed out, creative focus was shifted towards corruption and factionists. Unfortunately, here also results are negative. People seem to have digested that corruption can’t be mitigated in any which ways and started accepting it. Faction leaders and corrupted politicians have become heroes.

    Now probably the trend is race bias and Kula vivaksha. These fools may make it a permanent taint and once again society may start protecting their own race etc.

    I feel very few people really take hero as a role model for their life’s and most of the idiots are afraid of consequences hero faced and start compromising in real life. That’s why movies are only leaving negative impact at the end rather than changing society.

    Not sure if you agree with me

    Thanks,
    Pavan Vajhula.

Leave a Reply