డబ్బు డబ్బుకే డబ్బిస్తుంది.
డ..డ..డ..డబ్బున్న మగాడు, డ..డ..డబ్బున్న ఆడదానికే మనసిస్తాడు.
డ…డ…డ.. డబ్బున్న కోతి, డ…డ..డ…డబ్బున్న కొండముచ్చుకే కట్నమిస్తుంది.
డ…డ…డ…డబ్బున్న పార్టీ వాళ్ళు, డ…డ…డ.. డబ్బున్న మరో పార్టీ వాళ్ళకే… డబ్బులిచ్చి మద్దతు పుచ్చుకుంటాడు.
జబ్బున్న వాడికే జబ్బులొచ్చినట్లు,
డబ్బున్న వాడికే ఎప్పుడూ డబ్బు చేస్తుంటుంది.
సంపన్న దరిద్రులు

ముంతలు వేళ్ళాడే తాటిచెట్టు కింద నిలబడి, నిజంగానే ‘డెయిరీ మిల్క్’ తాగితే, నమ్మేవారెవరు?
అలాంటి కష్టమే నారా చంద్రబాబు నాయుడిగారికొచ్చింది.
తొమ్మిదన్నరేళ్ళు ఏకబిగిన ముఖ్యమంత్రిగా చేసి కూడా తనకంటూ ఇప్పుడు( తన పేరు మీద) ఒక డొక్కు అంబాసిడర్ కారూ(18 ఏళ్ళ క్రితం కొన్నది),
తాకట్టులోవున్న ఇల్లూ, కాస్త నగదూ వెరసి అక్షరాలా నలభయి లక్షల రూపాయిలు మాత్రమే నని ఆయన ప్రకటించారు.
నిజమే కావచ్చు. కానీ, నమ్మాలంటేనే కష్టం.
‘కుంపటి’ మీద గుండెలు!
ఎప్పుడో కానీ ఎవరి పాత్రలో వారు జీవించరు. వెలుపలే వుండిపోతారు. వెలుపల వుండిపోయిన వాడి వాలకమే వేరు. వాడి ముఖంలో అన్ని కళలూ వుంటాయి- ఒక్క జీవ కళ తప్ప. ఎవడినో ఎందుకనుకోవాలి. ఎవరి మట్టుకు వారు, మీ మట్టుకు మీరు, నామట్టుకు నేను – ఎక్కువ కాలం వెలుపలే గడిపేస్తుంటాం. పొడి పలకరింపులతో, యాంత్రికాలింగనాలతో,కృత్రిమ కరచాలనాలతో జీవితాన్ని నటించి, నటించి సొమ్మసిల్లి పోతుంటారు. అలాంటప్పుడు నాలోకి నన్నూ, నీలోకీ నిన్నూ పంప గలిగే మాంత్రికుడు ఒకడుంటే బాగుండునని పిస్తుంది.
‘మూడు ముడు’లూ, ఆరు వరసలూ..!

ఎన్నిక కూడా పెళ్ళి లాంటిదే. కాకపోతే కాంట్రాక్టు పెళ్ళి లాంటిది.
మహా అయితే అయిదేళ్ళు, లేకుంటే ఆరేళ్ళు.
ఆ తర్వాత విడాకులు లేకుండానే, పెళ్ళిని పెటాకులు చేసుకోవచ్చు. వరసలూ మార్చుకోవచ్చు.
కనీసం ఈ మాత్రం కాలమయినా ఎన్నికయిన ప్రతినిథులు కాపురం చేస్తే బాగుటుంది కదా!
ఏమాట కామాటే చెప్పుకోవాలి. చాలా మంది కాపురాలు పూర్తికాలం చేస్తూనే వున్నారు. కానీ పెళ్ళి చేసుకున్న వాళ్ళతో కాకుండా, వేరే వారితో
చేస్తున్నారు.
ఉన్నత ‘ప్రమాదాలు’!

ప్రమాదాలు సంభవించినప్పుడే నాయకులొస్తారు. ప్రమాదాలనే కొందరు- ఉద్యమాలు- అని కూడా అంటారు.
ఇప్పుడు దేశానికో ప్రమాదం వచ్చింది- అదే అవినీతి!
ఇలా అంటే నవ్వుగా లేదూ? చెవిలో పువ్వు పెట్టినట్టు లేదూ?
అవినీతి ఎప్పుడూ వుంది. స్వరాజ్యం రాముందూ వుంది. స్వరాజ్యం వచ్చాకా వుంది. మరి హఠాత్తుగా ఇప్పుడు ప్రమాదం అయ్యింది.
కారణం చిన్నది. ఈ అవినీతి పల్ల నిరుపేదలకు మాత్రమే కాకుండా, సంపన్నులకు కూడా తల బొప్పి కడుతోంది. వేల కోట్ల ప్రాజెక్టు ఒకటి నిలువుగా ఎదిగిన ఒక బడా వ్యాపారికి బదులు, ‘అడ్డంగా’ ఎదిగిన ఓ అడ్డగోలు వ్యాపారికి వస్తే..?
వస్తే.. ఏమిటి? అలా రావటమే ఇవాళ ‘అవినీతి’. ఇదే పెను ప్రమాదం.
రేపటి ‘రా’కుమారులు!
దేశం రాష్ట్ర మయింది.
రాష్ట్రం ప్రాంతమయింది.
ప్రాంతం జోనయింది.
ఈ జోను జిల్లా కావచ్చు. జిల్లా మండలం కావచ్చు. మండలం ఊరు కావచ్చు. ఊరు అంతిమంగా
వాడ కావచ్చు. పోరు అనివార్యం.
యుధ్ధాలేమయినా, కారణాలు అవే వుంటాయి.
పిడికెడు మెతుకులో, గుప్పెడు స్వేఛ్చో..? ఏదో ఒకటి అయివుంటుంది.
‘మీరో’ సగం! ‘మేమో’సగం!!
మనం మనమే.
జనం మనమే.
కానీ, అప్పుడప్పుడూ సగం ‘మీరూ’, సగం ‘మేమూ’ అన్నట్లుగా చీలిపోతాం. కత్తులు దూసుకుంటాం, కాలర్లు పట్టుకుంటాం, కొత్త తిట్లు తిట్టుకుంటాం.
ఎలా కలిసిపోతామో, ఒక రోజు పొద్దున్నే చూసుకునే సరికి, ‘మీ’ కౌగిలిలో ‘మేమూ’, ‘మా’ కౌగిలిలో ‘మీరూ’ వుంటాం. అదే జనమంటే!
చీల్చటానికే మధ్యవర్తులు కావాలి. కలవటానికి అవసరం లేదు.
అందుకే మనకూ చీలికా కొత్త కాదు, కలయకా కొత్త కాదు.
కాపురమన్నాక అలకలున్నట్లు, జనమన్నాక చీలికలుంటాయి. ఎప్పుడో కానీ, ఈ అలకలు విడాకులవరకూ రావు. ఇండో-పాక్‌లగా వేరు కుంపట్లు పెట్టుకోవు.
దేశమంటే మెతుకులోయ్!
ఎగిరిపడ్డాను. మెలకువ వచ్చింది.
ఒక జీవితంలోంచి, మరొకజీవితంలోకి మారినట్లు ఒక కుదుపు. కానీ, ప్రయాణిస్తున్నది అదే బస్సు.
కళ్ళు తెరిచేటప్పటికి ఇద్దరు ఆడపిల్లలు- ఆగుతున్న బస్సు లోనికి వస్తూ.
క్షణం క్రితం చెదిరిన నా కలలోని ఆడపిల్లలే. ఒకరు నలుపు. ఇంకొకరు తెలుపు
నల్లని అమ్మాయి పగలబడి నవ్వింది. విన్నాను
తెల్లని అమ్మాయి మెత్తగా నవ్వింది. చూశాను.
ఎప్పుడూ అంతే. శబ్దాన్ని వినివదిలేస్తాం. నిశ్శబ్దాన్ని మాత్రం చూస్తూ వుంటాం.
అజ్ఞాతం వీడిన లక్ష్మీదేవి!
మనుషులకేనా స్వేఛ్చ!
దేవతలకు మాత్రం వుండొద్దూ? స్త్రీలను ఇళ్ళల్లో బంధించినట్లు దేవతల్ని గుళ్ళల్లో బంధిస్తానంటే అన్నివేళలా చెల్లుతుందా?
ఇద్దరి దేవతల పరిస్థితి అయితే మరీ దయనీయం. వెలుతురే చొరబడని తాటాకుకట్టల్లోనూ, ఇనప్పెట్టెల్లోనూ బందించేస్తారు. వాళ్ళు ఎన్నాళ్ళని ఈ చీకట్లలో మగ్గుతారు?
వారెవరో కాదు. సరస్వతి, లక్ష్మీదేవి.
పొరపాట్లలో అలవాటు!
చితగ్గొట్టవచ్చు.. ఎముకలు ఏరివేయవచ్చు, కాళ్ళూ చేతులూ విరిచెయ్యవచ్చు, కడుపు చించెయ్యొచ్చు. పార్టులు తీసేయవచ్చు. అడిగేవాడుండడు.
కానీ, చిన్న షరతు- ముందు మాత్రం మత్తు ఇవ్వాలి. (క్లోరోఫారం, ఎనెస్తీషియా అంటారే అవి అన్న మాట)
దేహం మొత్తానికివ్వాలని రూలు లేదు. సగానిక్కూడా ఇవ్వొచ్చు. వెన్నులో ఇస్తే నడుము కింద భాగం శరీరం వున్నట్టే అనిపించదు. తీసే పార్టును బట్టి మత్తు వుంటుంది.
అలాగే ఒకే సారి రాష్ట్రం మొత్తానికి మత్తు ఇవ్వొచ్చు, లేదా ఒక ప్రాంతానికి ఒక సారీ, మరో ప్రాంతానికి ఇంకొక సారీ ఇవ్వొచ్చు.
స్వప్నమే నా శాశ్వత చిరునామా
ఎప్పుడో కూల్చేసిన ఇల్లు
ఇంకా వున్నట్లే కల
అనుకుంటాం కానీ-
కట్టడాన్ని కూల్చినంత సులభం కాదు
కలల్ని కూల్చటం!
నాలుగు మూరల పూరిల్లే కావచ్చు
నాకది
నాలుగు దశాబ్దాల స్వప్నవారసత్వం
సర్కారు ‘సౌండు’ పార్టీయే!
కొందరు ‘సౌండు’ పార్టీలుంటారు. వాళ్ళకు నిశ్శబ్దం పడదు.
రైస్‌మిల్లులో పనిచేసే కుర్రాణ్ణి, ధ్యాన మందిరానికి తీసుకొస్తే చచ్చిఊరుకుంటాడు.
సుల్తాన్ బజార్‌లోని సేల్స్‌బోయ్‌ను తీసుకొచ్చి, ఎయర్ కండిషన్డ్ మాల్‌లో ఉద్యోగమిప్పిస్తే మంచం పట్టేస్తాడు.
రైల్లోనూ, బస్సులోనూ మాత్రమే నిద్రపోయేవాళ్ళని ఇంట్లో పడుకోపెడితే మాత్రం నిద్రపోతారా?
అంతెందుకు? మునిసిపల్ స్కూలు టీచర్‌ను తీసుకొచ్చి కార్పోరేట్ స్కూల్‌లో పాఠం చెప్పమంటే నోరు పెగులుతుందా? రొదలో మాత్రమే అర్థం కాకుండా చెప్పుకు పోయే ఆ పంతులయ్యకు, పరమ నిశ్శబ్దంగా వున్న చోట అర్థమయ్యేలా చెప్పాలంటే కష్టం కాదూ…!?