ఎవెల్యూషన్

(ఒక పండగ. ఒక పార్టీ. ఒక ఉత్సవం. అన్నీఘటనలే. ఆ పూటలో ముగిసేవే. అప్పటికప్పడు తెలివి వచ్చెయ్యటమూ, ఓవర్ నైట్ ప్రేమ పుట్టెయ్యటమూ, క్షణంలో జీవితం మీద విరక్తి కలిగెయ్యటమూ జరగవు. కడకు ప్రమోషన్లూ, డిసిమిసల్స్ కూడా అంతే. అందుకు సంబంధించిన ప్రోత్సాహమూ, కుట్రా ఎప్పటినుంచో వుండి వుంటాయి. అయినా అన్నీ అప్పటికప్పడు ఇన్ స్టెంట్ గా జరిగాయంటే అదో థ్రిల్.  కాళిదాసు రాయగా రాయగా కవి అయ్యాడంటే చికాగ్గా వుంటుంది. సరస్వతి వచ్చి ఆయన నాలుక మీద ఒక్క క్షణంలో రాసి పోయిందంటే.. మహదానందంగా వుంటుంది.. ఘటనలమీద వున్న మోజు, ఎందుకనో పరిణామాల మీద వుండదు.) 

Independence-Day

ఎవెల్యూషన్

ప్రేమ పొంగుకు రావటమూ

స్వేఛ్చ తన్నుకు రావటమూ

ఒక పూటలోనో, ఒక ఘడియ లేదా ఒక విఘడియలోనో

జరిగిపోయే ఘటనలు కావు.

పెళ్ళి కున్నట్టు ప్రేమక్కూడా ముహూర్తాలుంటే

ప్రేమ చచ్చి ఊరుకుంటుంది.

స్వేఛ్ఛకూడా అంతే.

ఎవరెప్పుడు తొలిసారిగా

పరుగెత్తారో ఎవరికీ గుర్తుండదు.

వానరుడు ఒక్క ఉదుటన నరుడయితే

అది పురాణమువుతుంది కానీ,

పరిణామక్రమం కాదు.

పంద్రాగస్టు అర్థరాత్రి

మన స్వేఛ్చకు ఒక గురుతు.

ఒక పుట్టిన రోజు.

ఆ మాటకొస్తే,

అసలు పుట్టింది అమ్మ కడుపులో

పడినప్పుడు కదా!

స్వరాజ్యం పుట్టింది

మనం స్వేఛ్చ కోసం పరితపించినప్పుడు కదా!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)

Leave a Reply