పేరు : పందాల రాయుడు
దరఖాస్తు చేయు ఉద్యోగం: పుంజుల్ని పెంచటం. (పెట్టల పెంపకంలో అనుభవం లేదు.)
ముద్దు పేర్లు : ‘కత్తుల’ రత్తయ్య.( అపార్థం చేసుకోకండి. అసలే నేను అహింసా వాదిని. కత్తి నేను పట్టను. నా కోడికి కడతాను) . ‘కాలు దువ్వే’ కనకయ్య.( అదుగో మళ్ళీ అపార్ధం. ఎవరిమీదకీ కాలు దువ్వను. నా కంత సీను లేదు. కత్తి కట్టి బరిలోకి వదలితే. నా కోడే దువ్వుతుంది.)
‘విద్యార్హతలు :మా వాళ్లందరిలో నేనే నాలుగు ఆకులు… సారీ… ‘నాలుగు ఈకలు’ ఎక్కువ చదువుకున్నాను. కాబట్టే ‘పుంజు’ను చూడగానే, ఏది ‘నెమలో’, ఏది ‘డేగో’ ఇట్టే చెప్పేయ గలుగుతాను. (అన్నీ కోళ్ళే. కానీ పందె గాళ్ళు అలా పిలవరు. ‘ఈకలు’ తేడాలు పీకి ఇలా ‘జాతుల్ని’ నిర్థారిస్తారు. ఏం? మన దేశంలో మనుషులకు కులాలున్నప్పుడు, కోళ్ళకు మాత్రం కులాలు- ఉండాలా? లేదా?
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: కోర మీసాలు. (మీసాలు లేని వాణ్ని పందెగాడిగానే గుర్తించరు. పుంజు అంటేనే పురుషాధిక్యతకు చిహ్నం. అఫ్కోర్స్. పల్నాటి చరిత్రలో నాగమ్మ కూడా కోడిపందాలు అడింది. ( అయితే మాత్రం పుంజునే దించింది కానీ, పెట్టను దించలేదు.)
రెండు: జాదం. ( పేరుకు పందెం కానీ, ఆడేది జూదం. నెత్తురోడుతూ కూడా నా పుంజు నిలిచి యుధ్ధం చేసేది ఎందుకూ? నాకు జేబులు నింపటం కోసమే. ఫ్యాక్షనిస్టు దగ్గర అనుచరుడు ఏం చేస్తాడో, కరెక్టుగా నా కోడి పుంజుకూడా అదే చేస్తుంది.)
సిధ్ధాంతం :‘నెత్తురు’ ఒలికితేనే కాదు పండగ కాదు. (కొందరు కోడి పందాలను వ్యతిరేకిస్తారు. న్యాయస్థానాలు కూడా కత్తులతో కోడిపందాలకు వ్యతిరేకంగా తీర్పు చెబుతాయి. కానీ పండగ ఎలా మానుకుంటాం చెప్పండి.)
వృత్తి : కోళ్ళను మేపటం. ( నా మట్టుకు నాకు ‘పుంజు’ పవిత్రం.)
హాబీలు :1. జీడిపప్పు… తినటం కాదు, తినిపించటం. అవును నా కోడిది ‘రాజా భోజనం’. కొందరంటారు. మనుషులకే తిండిలేక పోతే, కోడికి ఎందుకూ.. అని. కానీ నా కోడిన బోడి మనుషులతో పోలిస్తే ఒప్పుకుంటానా?
2. బ్రహ్మచర్యం. నేను కాదు. నా పుంజు పాటిస్తుంది. పెట్టల వెంట వెళ్ళితే కర్తవ్యం మరచిపోతుందని బ్యాచిలర్‌గా వుంచేస్తాను.
అనుభవం : నా కోడి కూస్తేనే లోకాని తెల్లవారుతుంది. నేను కోడిని కోస్తేనే నాకు తెల్లవారుతుంది. పందెంలో నా కోడి కాళ్ళ కత్తులతో కూలిన దానిని నేను తెచ్చుకుని కోసుకోవాలి కదా!
మిత్రులు : బరిలోకి వచ్చే వరకూ పందెగాడికి, పందెగాడు మిత్రుడు. ఒక్కసారి బరిలోకి వచ్చాక ఎవడయినా శత్రువే.
శత్రువులు : పక్షుల్ని హింసిస్తున్నామంటే గగ్గోలు పెట్టే సంఘాల వాళ్ళు. రోజూ ఎన్ని కోళ్ళను కోసుకు తినటం లేదూ..? ఒక్కటే తేడా: వాళ్ళు ఒకేసారి పీక కోసేస్తారు. ఇక్కడ కత్తులతో పొడిచి, పొడిచి, నెతురు ఓడ్చి, ఓడ్చి చనిపోతాయి.
మిత్రశత్రువులు : ‘పుంజు’కో నాయ్యం. ‘పెట్ట’ కో న్యాయం- అని మామీద విరుచుకు పడేవారు.
వేదాంతం :ఒక్కొక్కరికి ఒక్కో జంతువు మీదా, పక్షి మీదా భక్తి వుంటుంది: నాది ‘కోడి’ భక్తి.
జీవిత ధ్యేయం : ఒక్క సంక్రాంతికే కాకుండా, ప్రతీ పండక్కీ కోడిపందాలు జరిపించాలని.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో9-15 జనవరి 2016 సంచికలో ప్రచురితం)