కదలని’చెయ్యి’- వదలని’గులాబి’!!

తెలంగాణ సమస్య తెగిపోతుంది, మబ్బు విడిపోతుంది.

ఇది తెలంగాణలో ఆశావాదుల జోస్యం.

తెలంగాణ సమస్య జటిలమవుతుంది. మళ్ళీ రెండు ప్రాంతాల్లో చిచ్చు రేగుతుంది.

ఇది తెలంగాణలోని నిరాశావాదుల భయం.

బహుశా, కేంద్రం నిర్ణయం  రెంటికీ మధ్య వుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో యూపీయే కూడా అదే స్థితిలో వుంది. పాలించటానికి అవసరమయ్యే మెజారిటీ లేదు. పోనీ, కూలిపోవటానికి దారితీసేటంత మైనారిటీ ఉందా- అంటే, అదీకూడా లేదు. ఈ స్థితిని యూపీయేలోపలి భాగస్వామ్య పక్షాలూ, వెలుపలి మిత్రపక్షాలూ- రెండూ కలిపి తెచ్చాయి.

పాపం! పైకి కనిపించేది ఒక తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రమే. బాహాటంగా కారణాలు చెప్పి మరీ యూపీయే నుంచి తప్పుకుంటోంది. కానీ సందు దొరికితే చాలు, ఒక్క పోటు పొడుద్దామని ఇతర రాజకీయ పక్షాలు కాచుకుని కూర్చున్నాయి. ‘మైనారిటీ’లో పడిపోయినా, మిత్ర పక్షాలు తాత్కాలికంగా మద్దతునిస్తున్నాయి. ఇలా మద్దతు ఇచ్చే పక్షాల్లో కీలకమైనవి మూడు: సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్సీ), బహుజన సమాజ్‌ పార్టీ(బిఎస్పీ), ద్రవిడమున్నేట్ర కజగమ్‌(డిఎంకె). ఈ పార్టీల మద్దతును రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి: ఎన్నికలపట్ల సంసిధ్దత రెండు: పరస్పర శత్రుత్వం. ఈ మూడింటిలో ఒక్కటి(ఎస్పీ) మాత్రమే మధ్యంతర ఎన్నికల కోసం ఉవ్విళ్ళూరుతోంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన విజయోత్సాహం- ఇంకా తాజాగానే వుంది. ఈ వేడిలో పార్లమెంటు ఎన్నికలు కూడా వచ్చేస్తే, ఎక్కువ పార్లమెంటు సీట్లను సాధించ వచ్చు. ఈ కల ఇక్కడితోనే ఆగి పోదు. ఆ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ కొడుక్కి(అఖిలేష్‌ యాదవ్‌కి) రాష్ట్రాన్ని ఒప్పజెప్పి, తాను దేశాన్ని తీసుకుందామనుకుంటున్నారు. అంటే అన్నీ కలసి వస్తే ప్రధానమంత్రి పదవిని అలంకరిద్దామనుకుంటున్నారు. ఆ పదవి మీద వున్న వ్యామోహాన్ని ఆయన ఏమాత్రం దాచుకోవటం లేదు.

‘ ప్రధాని మంత్రి పదవిని తిరస్కరించటానికి నేనేమీ సన్యాసిని కాను’ అని అనేశారు కూడా. అంటే ‘మినీ బారతం’ (ఉత్తరప్రదేశ్‌) నుంచి పొందే అత్యధిక మైన సీట్లతో పాటు, ప్రాంతీయ పార్టీల కూటమి(ఫ్రంట్‌) ఏర్పాటు కు దారులు వేసుకుంటున్నారు. కాబట్టి, ‘మధ్యంతర అవకాశాన్ని’ జారవిడుచుకోరు. కానీ, ఎస్పీకి బధ్ధ శత్రువుగా వున్న బీఎస్పీ కానీ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన డిఎంకె కానీ, ‘మధ్యంతరానికి’ సిద్ధంగా లేవు. ఎన్నికలు అలా వుంచితే ఎస్పీ అవునంటే, బిఎస్పీ కాదంటుంది. చూస్తూ, చూస్తూ ములాయం ప్రధాని కలను, బిఎస్పీ అధినాయకురాలు మాయావతి నిజం చేయటానికి సహకరించరు. ఫలితంగా ఎస్పీ మద్దతు ఉప సంహరించుకుంటే, తాను ఇవ్వటానికి ముందుకు వస్తుంది. ఈ పరిస్థితిలో యుపీయేకు అధికారంలో కొనసాగే అవకాశం ఎంత వుందో, మధ్యంతరాన్ని ఎదుర్కొనే ప్రమాదం కూడా అంతే పొంచి వుంది. అందుకని, గణనీయమైన సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌నుంచి కాంగ్రెస్‌ ఎంపీలను పొందిన యూపీయే, రాష్ట్రం మీద తీసుకోబోయే నిర్ణయం కూడా ఈ రెంటికీ మధ్యస్తంగానే వుంటుంది.

కేంద్రంలో కొనసాగితేనే కాదు, మధ్యంతరం వచ్చినా- ఉపయోగపడేలా తెలంగాణ పై నిర్ణయం వుండాలి. ఎలాగూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ యూపీయేకు మద్దతు ప్రకటించే సంకేతాలను ఇప్పటికీ ఇస్తూనే వుంది. ఒక్క టీఆర్‌ఎస్‌ను మచ్చిక చేసుకుంటే, పని పూర్తవుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదు, తెలుగుదేశం కూడా ఘోర పరాజయం చవి చూడాల్సి వస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అందుచేత, కాంగ్రెస్‌కు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలన్న పంతమూ వుండదు, విభజించాలన్న ఆసక్తీ వుండదు. యూపీయే-3 సర్కారును ఏర్పాటు చేయటానికి ‘విభజన’ అనుకూలిస్తుందంటే తప్పక చేస్తుంది. లేదూ, అందుకు ఇతర ఇబ్బందులు వస్తాయనుకుంటే, ఆగిపోతుంది. అంతే తప్ప మొత్తం రాష్ట్రం ప్రయోజనాలు కానీ, లేదా రెండు ప్రాంతాల విడివిడి ప్రయోజనాలూ కానీ యూపీయేకు ఇప్పుడు ప్రధానం కావు. ఒక పక్క కేసీఆర్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలతో జరుపుతున్న చర్చల తీరు చూస్తుంటే, తెలంగాణ పై ఏదో ఒక అనుకూల ప్రకటన చేయించి, కాంగ్రెస్‌లో విలీనం కావాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. యూపీయే ఈ విషయాన్ని నాన్చితే, అందరి కన్నా ఎక్కువ నష్టపోయేది టీఆర్‌ఎస్సే. ఈ నెల(సెప్టెంబరు)30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ వల్ల, ఇతరేతర తెలంగాణ ఉద్యమ శక్తులు ఎక్కువ లాభపడి, టీఆర్‌ఎస్‌ వెనకబడే ఆవకాశం కనిపిస్తోంది. ఈ ‘మార్చ్‌’ ప్రభావం కూడా ఒకటి రెండు రోజులే వుంటుంది. కానీ సకల జనుల సమ్మెలాగా ఎక్కువ కాలం సాగదు. అలా సాగటం వల్ల వ్యతిరేక ఫలితాలనే టీఆర్‌ఎస్‌ ఎక్కువగా చూసింది. నిజానికి ‘మైనారిటీ’లో పడిపోయన సర్కారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వంటి కీలకమైన నిర్ణయం తీసుకోగలదా? కాబట్టి మెల్లగా 2014 ఎన్నికల ఎజెండాలోకి ఈ ఆంశాన్ని తీసుకు వెళ్ళే అవకాశం వుంది. ఈ లోపుగా జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ ‘మధ్యే మార్గాల’ను అన్వేషిస్తుంది. ‘యూపీయే-3లో తెలంగాణ ఇచ్చి తీరతాం. అందుకు సంకేతంగా ‘అభివృద్ధి మండలి’ వంటి కొన్ని పనులు చేస్తాం’ లాంటి ప్రకటన చేసి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమైక్యాంద్ర ఉద్యమం చెలరేగుతుంది. దీంతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ను సీమాంధ్రకు పరిమితం చేయటంతో పాటు, తెలుగుదేశం పార్టీని ‘రెండు ప్రాంతాలకూ చెడ్డ రేవడి’ గా మార్చుకొనే ప్రయత్నం కేంద్రం చేస్తుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్థానంలో తెలంగాణ ప్రాంతపు ముఖ్యమంత్రిని నియమించటం వల్ల కూడా సీమాంధ్రలో అసంతృప్తి రేగుతుంది. బహుశా కాంగ్రెస్‌ ఇప్పుడు ఆశిస్తున్నది తెలంగాణ కన్నా, సీమాంధ్రలో అగ్గి రాజుకోవటం. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం ఈ దిశగా నే వుండవచ్చు.

సతీష్ చందర్

21-9-12

1 comment for “కదలని’చెయ్యి’- వదలని’గులాబి’!!

Leave a Reply