‘కమలం’బాటి పురంధేశ్వరి

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

పేరు : దగ్గుబాటి పురంధేశ్వరి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కాషాయ’ మంత్రి (‘ఖద్దరు’ మంత్రిగా చేసేశాను. ఇక చేయాల్సింది అదే కదా! ‘అన్న’ కూతురుగా అన్ని సార్లూ సెక్యులర్‌ పార్టీలోనే మంత్రి పదవి చేయాలని లేదు.)

ముద్దు పేర్లు :రాజకీయ ‘దురంధేశ్వరి'( బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి, విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి ఎంత సునాయాసంగా రాగలిగానో, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి కూడా అంతే సులువుగా వచ్చాను.) ‘కమలం’ బాటి పురంధేశ్వరి

విద్యార్హతలు : చదువుల్లో ‘జెమ్‌’. ‘జెమ్మాలజీ’ చదివాను లెండి. కూలిపోయే పడవ యేదో, కూలిపోక ముందే గమనిస్తాను. సీమాంధ్రలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని ముందే గ్రహించాను.

హోదాలు : ‘మాజీ’ అన్న మాట ఇష్టం వుండదు. అందుకే ఇన్ని రాజీలు. మూడు మంత్రిత్వ శాఖలు మారాను కానీ, ఎన్నడూ మాజీ కేంద్ర మంత్రి అనిపించుకోలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో రాక పోతుందా? నాకు మంత్రి పదవి దక్కక పోతుందా?

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నందమూరి వారి ఆడపడచుని. ‘అన్నగారి'(ఎన్టీఆర్‌) కూతురుని. ఈ గుర్తింపు చిహ్నం వున్నా సరే, ‘అన్నగారు’ స్థాపించిన పార్టీలోకి నేరుగా వెళ్ళలేదు. వయా బీజేపీ వెళ్తున్నాను. బీజేపీ- టీడీపీల పొత్తు నాకోసం పెట్టుకున్నారని అనిపిస్తోంది.

రెండు:దగ్గుబాటి వారి కోడలిని. వెంకటేశ్వరరావు గారి సతీమణిని. ఆయన చంద్రబాబు మీద ‘బుక్కు’ రాయటం వల్ల, ‘నాన్నగారి’ పార్టీలోకి ‘కాషాయ మార్గం’ ద్వారా చేరువ కావలసి వస్తుంది.

సిధ్ధాంతం : వెంకయ్య నాయుడి గారి సిధ్ధాంతమే. మా దంపతుల సిధ్ధాంతం. ఆయన ఇటు తెలుగుదేశానికీ, అటు బీజేపీకి వారధి.

వృత్తి :‘టూరిజం’ . మీకు తెలుసో, తెలీదు మంచి ‘స్పైస్‌ జెట్టర్‌’ ని. నా నియోజక వర్గం విశాఖపట్నం అయినా, నేను హైదరాబాద్‌లోనే ఎక్కువ కాలం వుంగగలిగానంటే అందుకు కారణం ‘స్పైస్‌ జెట్‌’. వీలయినంత ఎక్కువగా ‘విమాన యానం’ చేసేదాన్ని.

హబీలు :1.చదవటం. మావారు పుస్తకాలు రాస్తుంటే, చదివేవారుండాలి కదా! అందుకని పాఠకురాలిగా మారాను.

2. చారిత్రక స్థలాలను ఢిల్లీ అతిథులకు చూపించటం. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్లీనరీ జరిగినప్పుడు, కాంగ్రెస్‌ పెద్దలకు ఇక్కడి వింతల్ని పరిచయం చేశాను. అది చార్మినార్‌ కట్టటం కావచ్చు; పారడైజ్‌ బిర్యానీ కావచ్చు.

అనుభవం :ఒకే కుటుంబ సభ్యులు ఒకే పార్టీలో వుండిపోవటం వల్ల పెద్ద ప్రయోజనం వుండదు. సింధియాలు చూడండి. ఒక సింధియా కాంగ్రెస్‌లో వుంటే, ఇంకో సింధియా బీజేపీలో వుంటారు. ‘అన్నగారి’ కుటుంబ సభ్యులం కూడా అలాగే వుంటున్నాం.

మిత్రులు : రాజకీయాల్లో మిత్రులే బంధువులుగా వుంటారు. బంధువులు సందర్భాన్ని బట్టి మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు.

శత్రువులు : దాచినా ప్రయోజనం లేదు. నా భర్త వారి జాబితాను పుస్తకంగా ప్రచురించారు. ఇప్పుడు నాకు ఎంపీ టిక్కెట్టు రాకుండా చూడాలని అడ్డుకుంటున్నవారు కూడా, ఈ జాబితాలోని వారే.

మిత్రశత్రువులు : నిన్నటి వరకూ కాంగ్రెస్‌లో వుండేవారు. ఇప్పుడు కొత్తగా చేరుతున్నాను కాబట్టి బీజేపీలో వెతుక్కోవలసి వుంటుంది.

వేదాంతం : కొన్ని పార్టీలు పరస్పర విరుధ్దంగా కనిపిస్తాయి. రంగుల్లాగే. ఉదాహరణకు ‘ఎరుపూ’, ‘పసుపు’. రెండూ కలిపి చూడండి ‘కాషాయం’ అవుతుంది. ‘అన్నగారు’ వామ పక్షాలతోనూ తొలుత పొత్తు పెట్టుకున్నారు. రెండు కలిస్తే ‘కాషాయం’ అవుతుంది. అన్నట్టు అన్నగారు ‘కాషాయం’ కట్టుకునే వారు. కాబట్టి నేను ‘కాషాయ’ పార్టీలో చేరటం అన్నగారి సిధ్ధాంతానికి విరుధ్ధం కాదు.

జీవిత ధ్యేయం :‘అవిభక్త ఆంధ్రప్రదేశ్‌’ లో ఎలాగూ మహిళా ముఖ్యమంత్రిని చూడలేక పోయాం. కనీసం ‘అవశేష ఆంధ్రప్రదేశ్‌’లోనయినా చూడాలన్నది కోరిక. అఫ్‌కోర్స్‌ ఆ నినాదం వస్తే, మన రాష్ట్రం వరకూ తొలి మహిళా ముఖ్యమంత్రిని నేనే అవుతాను.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో 12-18 ఏప్రిల్ 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “‘కమలం’బాటి పురంధేశ్వరి

  1. ame avakaasha vaadhi—she made a big mistake– going to bjp—-babu is goimng to ruin her political aspirations—
    satish ji– nice article sir
    ————————————–buchi reddy gangula

Leave a Reply