కవ్వింపులు ‘కత్తి’ వా? ’స్వామి‘వా..?

దూషణ వేరు; విమర్శ వేరు. ఉత్త కోపంతో తిట్టి పారెయ్యటం దూషణ. రాగ, ద్వేషాల జోలికి వెళ్ళకుండా తప్పొప్పులను ఎత్తి చూపటం విమర్శ. దూషణకు నమ్మకం పునాది; విమర్శకు హేతువు ఆధారం.

కత్తి మహేష్‌ ఒక వైవూ, పరిపూర్ణానంద స్వామి మరొక వైపూ. ఒకానొక టీవీ చానెల్‌ లో చర్చలో భాగంగా, ‘రాముడి’ మీద తన అభిప్రాయాన్ని చెప్పారు మహేష్‌. ప్రజలు రోజువారీ సంభాషణల్లో తప్ప, మాధ్యమాల్లో వాడని ‘పదాన్ని’ ప్రయోగించారు. ఆ పదానికి ‘మోసగాడు’ అని అర్థం. సహజంగానే రాముణ్ణి దేవుడిగా ఆరాధించే వారికి కోపం వస్తుంది. తర్వాత కూడా తన వ్యాఖ్యల్ని బలపరచుకుంటూ మహేష్‌ మాట్లాడారు. రాముడు వాలిని చెట్టుచాటు నుంచి చంపటమూ, సీతను నమ్మించి అడవిలో వదిలేయటమూ, శూద్రుడికి తపస్సు చేసే హక్కులేదని అతని శిరస్సు ఖండించటమూ ప్రస్తావించి, ఇవన్నీ ‘మోసం’ కిందకే వస్తాయని మహేష్‌ అన్నారు.

పరిపూర్ణానంద స్వామి ఇందుకు ప్రతిగా పాదయాత్ర చేయటానికి సంకల్పించారు. మహేష్‌ ను దేశద్రోహిగా, ఇలాంటి వ్యాఖ్యను దేశద్రోహ చర్యగా చిత్రించారు. అంతే కాదు, రాముడి పట్ల భారత రాజ్యాంగ సభ సభ్యులకీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కూ కూడా అపారమైన గౌరవం వుందనీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నిజానికి అంబేద్కర్‌కు రాముడి మీద పరిపూర్ణానంద అనుకున్నంత గౌరవం లేదు. ఆయన తన గ్రంథం ‘రిడిల్స్‌ ఇన్‌ హిందూయిజం’ లోని అనుబంధం 1 లో ‘రాముడి’ మీద ఘాటైన విమర్శ చేశారు. సీత కడకు భూమిలో కలసిపోవటానికి ఇష్టపడుతుంది కానీ, తిరిగి రాముణ్ణి రాముణ్ని చేరటానికి ససేమీ ఇష్ట పడలేదని చెబుతూ రాముడిపై కఠిన మైన వ్యాఖ్యేచేస్తారు.( కావాలంటే చదువుకోవచ్చు.) అంతే కాదు రాముడు రాజే కాదు. పాలించింది భరతుడని వాల్మీకే చెప్పాడని అంటారు. శంబుక వధను కూడా ఆయన ప్రస్తావించారు.

ఆ విషయం అలా వదిలేస్తే, మనది మత రాజ్యం కాదు. ఏ మత గ్రంథం ప్రకారం చట్టాలు చెయ్యం; అమలు జరపం. రాజ్యాంగం ప్రకారమే పాలన జరుగుతుంది. మతం కేవలం వ్యక్తిగత విశ్వాసం మాత్రమే. అయితే రెండు మతాల వారి మధ్య వివాదం చెలరేగటమంటే, ఒకరి విశ్వాసంలో నుంచి చూసి, మరొకరి విశ్వాసాన్ని తక్కువ చెయ్యటం. కానీ కత్తి మహేష్‌ ఏ మతానికీ చెందిన వాడు కాడు. తానొక నాస్తికుడు. ఏ మతవాదికీ నాస్తికుడు నచ్చడు; అలాగే ఏ నాస్తికుడికీ మతవాది నచ్చడు. దేశంలో నాస్తికుడే వుండటానికి వీల్లేదని మతవాదులనుకుంటే కుదరదు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ నాస్తికుడు (ఈ విషయాన్ని నెహ్రూ మేనకోడలూ, విజయలక్ష్మీ పండిట్‌ తనయ నయనతార సెహగల్‌ ఇటీవల ఈ విషయాన్ని మరోమారు ధ్రువపరచారు కూడా.)

కత్తి మహేష్‌కీ పరిపూర్ణానందకూ వచ్చిన వివాదం రెండు మతాల మధ్యవచ్చిన వివాదం కాదు; ఒక నాస్తికుడికీ, ఒక మతవాదికీ వచ్చిన వివాదం. ఇద్దరి ఆలోచనల్లో వుండే తేడా చిన్నదే: మనిషే దేవుణ్ని చేశాడని నాస్తికుడంటే, దేవుడే మనిషిని చేశాడని మతవాది లేదా ఆస్తికుడు అంటాడు. మహేష్‌ కు రాముడు ఒక మనిషలాగా కనిపిస్తే, పరిపూర్ణానందతో పాటు కోటానుకోట్ల మందికి దేవుడిగా కనిపించటం విశేషం కాదు.

హేతువాదులుగా వున్న మేధావులు నార్ల వెంకటేశ్వరరావు (సీత జోస్యంలో), త్రిపురనేని రామస్వామి చౌదరి( శంబుక వధలో) రాముణ్ణి ఇలా చూసినా వారే. ఇక రంగనాయకమ్మ ‘రామాయణ విషవృక్షం'( దాదాపు రాముడి ప్రతి చర్యనూ తప్పు పట్టారు.) అప్పుడెప్పుడో రాయటం కాదు, ఈ మధ్యనే శ్రీలంకకీ, భారతదేశానికీ మధ్య వున్న ‘రామ సేతు’ మీద వివాదం చెల రేగినప్పుడు డి.ఎం.కె అధినేతగా వున్న కరుణానిధి ఇలాంటి వ్యాఖ్యే చేశారు. ‘రాముడు వాల్మీకి అనే కవి సృష్టించిన పాత్ర. నేనూ చాలా రచనలు చేశాను. నేనూ పాత్రల్ని సృష్టించాను. నా పాత్రల్ని కూడా ఆరాధిస్తారా?’ అని అడిగారు.

అంతెందుకూ ఈ మధ్యనే పా. రంజిత్‌ రజనీకాంత్‌ హీరోగా పెట్టి తీసిన సినిమా ‘కాలా’ క్లయిమాక్స్‌ ఏమిటి? ‘కాలా’ మీద దాడి జరిపిస్తూ, విలన్‌ రామాయణంలో ని రావణుడి సంహారం గురించి పురోహితుడు చదువుతుంటే శ్రధ్దగా వింటుంటాడు. అంటే హీరో రావణుడనీ, విలన్‌ రాముడనీ చెప్పే ప్రయత్నం చేశాడు. మణిరత్నం తీసిన ‘రావణ్‌’ చిత్రం ఏమిటి? ‘రాముడు’ మోసగిస్తాడని తీస్తాడు; సీతకు రాముడికన్నా రావణుడే నీతిమంతుడిలా కనిపిస్తాడు. ఇంతమందీ ‘దేశద్రోహులే’నా? ఇలా పరిపూర్ణానంద స్వామికి అనిపిస్తే తప్పులేదు. కానీ ప్రజాస్వామ్య బధ్దంగా పాలించే ప్రభుత్వాలకు అనిపించ కూడదు.

పురాణాల మీదా, పురాణ పురుషుల మీదా అన్ని చోట్లా విమర్శలుంటాయి. ‘డావిన్చీ కోడ్‌’ నవల సారాంశమేమిటి? జీసస్‌ కు పెళ్ళయిందని కదా- ఈ నవల సినిమాగా కూడా వచ్చేసింది.

కత్తి మహేష్‌ ను నగరబహిష్కారం చేశారు; రెండు రోజుల తర్వాత పరిపూర్ణానంద స్వామినీ నగర బహిష్కారం చేశారు. నాస్తికునికీ, ఆస్తికునికీ వచ్చిన వివాదాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగిన సందర్బాలు తక్కువే. నాస్తికుడు విమర్శ చేస్తాడు; మతోన్మాది దూషిస్తాడు. అందుకే, ఒక మతవాదికీ, మరో మతవాదికీ వచ్చిన వివాదాల వల్లే పలు సందర్భాల్లో మత ఘర్షణలూ, మారణ కాండలూ జరిగాయి. నిజం చెప్పాలంటే ఇటీవల కాలంలో పరిపూర్ణానంద అలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘మీకు నిజాం పాలన కావాలా? ఛత్రపతి శివాజీ పాలన కావాలా?’ అని ప్రశ్నించారు.

ఒక మతోన్మాదం పెరిగిపోతే, దానిని మరొక మతోన్మాదం ఎదుర్కోవాలని చూడటాన్ని రాజ్యాంగం అనుమతించదు. శాస్త్రీయ దృష్టిని పెంపొందించే పనిని కూడా ప్రభుత్వాలు చెయ్యాలని ఇదే రాజ్యాంగం చెబుతోంది. కేవలం ఆస్తికులూ, నాస్తికులే కాదు, ఆస్తికుడి నాస్తికుడిగా మారే దిశగా ప్రయాణం చసే సంశయ వాదుల కూడా వుంటారు. వారికీ రక్షణ ఇవ్వాలి. అలా కాకుండా వారిని ‘వెలి’ వేస్తానంటే, దేశాన్ని మూడు వేల సంవత్సరాల వెనక్కి తీసుకుని పోవటమే!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో ముద్రితం)

7 comments for “కవ్వింపులు ‘కత్తి’ వా? ’స్వామి‘వా..?

  1. అరటిపండు..అందులోనూ బాగా మాగిన అరటి పండును వలిచి నోట్లో పెట్టినట్టు ఇంత హాయిగా, సరళంగా, చిన్నపాటి ప్రవాహంలా ఎవరైనా చెప్పగలరా..రాయగలరా..! స్వాములారా, జ్ఞానులారా, మీకు అర్ధమైనా అర్ధం కానట్టు నటించకండి. బుకాయింపులు మానండి

  2. ఈ మంచి మాటలు మతోన్మాదులకు ఎక్కవు. కానీ ప్రభుత్వాలకూ, ఆ వ్యవస్థలో కీలక స్థానాల్లో వున్న వ్యక్తులకు ఎక్కుతాయా?
    ఎక్కవు అనడానికి భారత్ టీవీలో మాజీ డీజీపీ చేసిన వాఖ్యలే ఋజువు.

Leave a Reply