రాష్ట్రంలో- మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఊపిరాడకుండా చేస్తున్నది ముగ్గుర మహిళలు. వారే జగన్ కుటంబ సభ్యులు: వైయస్ విజయమ్మ, షర్మిల, భారతి.
ఈ ముగ్గురూ విరుచుకు పడుతున్నది కూడా ఒకే ఒక్క మహిళ మీద. ఆమే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ. జగన్‌ను జైలు పాలు చెయ్యటానికి ఆమెనే బాధ్యురాలిగా చూపిస్తున్నారు..
అంతే కాదు. ఈ ముగ్గురు మహిళలూ ఆకర్షిస్తున్నది అధికంగా మహిళల్నే.
ఈ ముగ్గురి ప్రభంజనాన్ని ఇప్పటికిప్పుడు ఎదుర్కోవటానికీ, శాశ్వతంగా మహిళా వోటు బ్యాంకుని తమ పరం చేసుకోవటానికీ జనాకర్షణ వున్న మహిళానేతలు కావాలి.
చిత్రమేమిటంటే, ఏ కేసుల్లో అయితే జగన్‌ను మొదటి నిందితుడిగా చేశారో, ఆ కేసులకు సంబంధించిన నీడలు ఇద్దరు మహిళా మంత్రుల మీద కూడా వున్నాయి. ఒరు: ‘చేవెళ్ళ చెల్లెమ్మ’ సబితా ఇంద్రా రెడ్డి, మరొకరు : ‘గజ్వేల్ ఇందిర’ గీతా రెడ్డి.
ఈ ముగ్గురు మహిళల్నీ ఎదుర్కోవటానికి కాంగ్రెస్ కు ఇతర మహిళా నేతలు అవసరమవుతారు.
ఇప్పటికకే రేణుకా చౌదరి విజయమ్మ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
కానీ, ఆమెకు రాష్ట్రవ్యాపితంగా అంత ప్రజాదరణ వుండక పోవచ్చు.
ఈ ముగ్గురు మహిళల ప్రభంజనం ఇంకా పెరిగితే, ముఖ్యమంత్రి స్థానంలో కూడా మహిళానేతను కూర్చోబెట్టే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చెయ్యవచ్చు.
తామే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవటం కోసమయినా ఈ పని చెయ్యాల్సి వస్తుంది.
అదీ కాక, ఇంత వరకూ రాష్ట్రంలో మహిళ ముఖ్యమంత్రి కాలేక పోయారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే, కిరణ్ కుమర్ రెడ్డిని మార్చటం అనివార్యం అయినప్పుడు, ఆ స్థానంలో మహిళను కూర్చోబెట్టి, తొలి మహిళా ముఖ్యమంత్రిని తామే చేశామన్న కీర్తి కోసం పార్టీ అధిష్ఠానం ఉబలాటపడుతుంది.
అయితే ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడెల్లా, గీతారెడ్డి పేరే వినవస్తుండేది. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినప్పుడూ, దామోదర రాజనరసింహను ఉప ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టినప్పుడూ ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది. అమెకు సామాజిక వర్గం బాగా అనుకూలిస్తుంది. వివాహం రీత్యా రెడ్డి సామాజిక వర్గానికీ, జన్మత: షెడ్యూల్డుకులానికీ ఆమె చెందుతారు. కానీ ఇప్పుడు ఈ కేసుల నేపథ్యంలోనూ, సవాలు వున్నదీ సీమాంధ్రలోనూ కావటం వల్ల తెలంగాణకు చెందిన ఆమె పేరు వెనక్కి వెళ్ళి పోవచ్చు.
ఇలాంటి సందర్భంలో అప్పుడప్పుడూ వినవచ్చేది కేంద్ర మంత్రి పురంధేశ్వరి పేరు. ఈమె సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమార్తె కాబట్టి ఈ సారి ఆమెకు అన్ని దారులూ తెరచుకునే అవకాశం వుంది. పైపెచ్చు సీమాంధ్ర నేపథ్యం కూడా తోడ్పడుతుంది. మొత్తానికి వైయస్ కుటుంబంలోని ముగ్గురు మహిళలూ కాంగ్రెస్ పార్టీ కొత్త సవాళ్ళను విసర బోతున్నారు.
-సర్