‘కుప్పిగంతుల’ హనుమంతరావు

పేరు వి.హనుమంత రావు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘వీర భక్త హనుమాన్‌’. అవును నా పేరు మాత్రమే కాదు, నా ఉద్యోగం పేరు కూడా. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం దగ్గర ఇలాంటి ఉద్యోగాలు వుంటాయి. పూర్వం డి.కె. బరూవా అనే ఒకాయన వుండే వారు. ఆయన ఈ ఉద్యోగమే చేశారు. కాబట్టే ‘ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ నినాదం ఇవ్వగలిగారు. ఇప్పుడు నేను ‘ఇందిర’ బదులు ‘సోనియా’ అంటాను. అంతే తేడా.

ముద్దు పేర్లు : వి.హెచ్‌.( అంటే వి. హనుమంతరావు- అని కాదు సుమా. వాయిస్‌ హెచ్చు- అని), ‘హనుమ’.( ఇలా అనగానే రాముడెవరు? అనే సందేహం వస్తుంది. ‘రామచంద్రరావు’ మాత్రం కాదు. మేము ఇద్దరం కలహించుకుంటున్నా సరే- దానిని ‘రామాంజనేయ యుధ్దం’ అనటానికి కూడా ఎంత మాత్రమూ వీల్లేదు.

విద్యార్హతలు : బి.ఎ.( బ్యాచిలర్‌ ఆప్‌ యాక్టింగ్‌) అందుకే నా ముందు నటనలు చేస్త్తే- అది హనుమంతుని ముందు కుప్పిగంతుల కింద లెక్క!! కానీ చిరంజీవి ‘మాస్టర్‌ ఆఫ్‌ యాక్టింగ్‌’ కదా! ఆయన ముందు మనమెంత! కాంగ్రెస్‌ లో చేరింది నిన్న కాక, మొన్నయినా- ఏ.వై హ్యూమ్‌ (కాంగ్రెస్‌ వ్యవస్థాపకుని) క్లాస్‌ మేట్‌ లా మాట్లాడగలడు. అందుకే కదా- రాష్ట్రంలో కాంగ్రెస్‌ దెబ్బతిన్నందుకు అంతగా కుమిలి పోతూ మాట్లాడాడు.

హోదాలు : అందరూ అదే ఆడుగుతారు. నచ్చక పోతే నాలుగు తిట్టటానికి హోదా కావాలా? నాలుగు మైకులు ముందు పెడితే- ఎవరికి మాత్రం మైకం రాదూ…!?

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ‘రాజ’ దూషణ( రాజశేఖ రెడ్డినీ, ఆయన తనయుణ్ణీ నేను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించ లేరు.

రెండు: ‘రామ’ నామ స్మరణ.( అలాగని పొగడుతానని కాదు. కే.వీ.పీ రామచంద్రుని పేరును సీబీఐ విస్మరించినా, నేను మాత్రం స్మరిస్తూనే వుంటాను.)

సిధ్ధాంతం : విధేయతే నా సిధ్ధాంతం.( మేడమ్‌ గీచిన గీత దాటను.)

వృత్తి : నాదీ, కేకేదీ ఒకటే వృతి.(ఇద్దరమూ ‘సౌండ్‌ పార్టీల మే’. మా ‘సౌండ్‌’ లేకుండా ఏ టీవీ న్యూస్‌ బులెటిన్నూ ముగియదు.)

హాబీలు :1. ‘పెద్దలు’ నడిచే దారిలోనే నడవటం. అందుకే ‘పెద్దల’ (రాజ్య) సభ ద్వారానే పార్లమెంటుకు వస్తుంటాను. ప్రత్యక్షంగా వచ్చే ‘లోకుల’ సభ మనకి అచ్చిరాదు. (జనం వోటెయ్యరని కాదు..! అది అంతే!!)

2. ‘చేతులు’ కాలాక, ఆకులు పట్టుకోవటం. (అందుకే కదా- రాష్ట్ర ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ వోటమి పాలయ్యాకనే హైదరాబాద్‌లో మేధో మథనం పెట్టాను!?)

అనుభవం : కాంగ్రెస్‌లో ప్రతీనేతకూ ‘మాట్లాడే హక్కు’ వుంటుంది. నిర్ణయించే హక్కు హైకమాండ్‌కు మాత్రమే వుంటుంది.

మిత్రులు : మారుతుంటారు. ఇప్పుడయితే చిరంజీవి.

శత్రువులు : నమ్మండి. నాకు ఏ ఇతర పార్టీలోనూ శత్రువుల్లేరు. సొంత పార్టీలోనూ శత్రువుల్లేరు. ఆలాగని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ లేరు. కేవలం ఒకే ఒక కుటుంబంలోనే శత్రువులంతా వున్నారు.

మిత్రశత్రువులు : ఒకే ఒక్కరు: కె.వి.పి. రామచంద్రయ్య.

వేదాంతం :రాజకీయాల్లో రాణించాలాంటే ‘న్యూస్‌’ సెన్సూ తెలియాలి, ‘న్యూసెన్సూ’ తెలియాలి.

జీవిత ధ్యేయం : నెహ్రూ-గాంధీ కుటుంబానికి శాశ్వత విధేయుడిగా నిలిచిపోవటం.

-సతీష్ చందర్

13-9-12

 

 

 

1 comment for “‘కుప్పిగంతుల’ హనుమంతరావు

Leave a Reply