మానవుడే మహనీయుడు కాదు, మహనీయుడే మానవుడు. కాలు తీసి కాలు కదపలేడు. వేలయినా కదపగలడో లేదో తెలీదు. కానీ తాను విహరించే ‘గగనాంతర రోదసి’లో. తన కూర్చున్న చోట ఒక్కటే కుటుంబం. అది తను చుట్టూ భ్రమిస్తుంది. కానీ తాను అనునిత్యమూ పరిభ్రమించేది అనేకానేక సౌరకుటుంబాలతో.
యవ్వన తొలిపాదంలో తన మరణ వార్త తానే విన్నాడు. రెండు పదులు దాటగానే మరో రెండేళ్ళకు మించి బతకటం కష్టం అని తేల్చిపారేశాడు. నిలువెత్తు మనిషి కుర్చీలో కూలబడిపోయాడు. ఆ కుర్చీకి చక్రాలు వచ్చాయి. దేహంలో ఒక్కొక్క భాగమూ చలనం కోల్పోతూవుంది.. ఒక్క మెదడు తప్ప. అవును. ఒక్క బుధ్ధిచాలు- బతకటానికీ, బతికించటానికీ. మృత్యువును ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. అలా తనకు ఏడుపదులు దాటిపోయాయి. తన 76 యేట మాత్రం మృత్యువును కనికరించక తప్ప లేదు. కానీ భూమ్మీద మానవాళి మనుగడకు ఏ ‘మృత సంజీవిని’ కావాలో అది మాత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు. భౌతిక శాస్త్ర సూత్రాలలో తప్ప, మంత్రాలలోనూ, చింతకాయలలోనూ, విశ్వం అధారపడిలేదని తేల్చి, తన సమకాలికుల బుధ్ధిని వెలిగిస్తూ సెలవు తీసుకున్నాడు. ఆయనే ప్రపంచ ప్రసిధ్ధ ఖగోళ భౌతిక శాస్త్ర వేత్త స్టెఫెన్ హాకింగ్.
అంతరిక్ష రహస్యాల గుట్టువిప్పిన గెలీలియో పుట్టిన మూడువందల యేళ్ళకు పుట్టాడు. సాపేక్ష సిధ్ధాంతాన్ని, బిగ్ బ్యాంగ్, బ్లాక్ హోల్(కృష్ణ బిల) రహస్యాలను ఛేదించిన ఐన్‌స్టీన్ ఇంకా జీవించి వుండగానే జన్మించాడు. రోదసి శోధనలో మూడవ శకానికి నాంది పలికాడు. విశ్వంలో గ్రహాల ఆవిర్భావానికి ‘బిగ్ బ్యాంగ్’ను అవతారికగానూ, ‘బ్లాక్ హోల్’ను ముగింపు గానూ తన ముందటి శాస్త్ర వేత్తల్లాగానే తానూ భావించాడు. బ్లాక్ హోల్‌ను దేనినయినా మింగేస్తుంది- అని తానూ నమ్మాడు. తీసుకోవటమే తప్ప, బ్లాక్ హోలు తిరిగి ఏమీ ఇవ్వదా- అని యోచించాడు. అది తిరిగి ‘రేడియేషన్'(ధార్మికత)ను ఇస్తుందని తేల్చాడు.
అందుకే ఆయన్నొక సారి, ఒక ఇంటర్వ్యూలో ‘బ్లాక్ హోల్ లోకి ఎవరయినా దూకేస్తే, తిరిగి వస్తాడా?’ అని అడిగారు. ‘రాడు’ అని చెప్పేసి అంతటితో ఆగలేదు; ‘ శక్తి వస్తుంది.. అదే రేడియేషన్’ అన్నాడు. వినాశనానికే చిహ్నం గా ‘బ్లాక్ హోల్’ ను వున్న విశ్వసముతుల్యానికి ప్రతీకగా చూడటానికి దారి వేసింది స్టెఫెన్ హాకింగ్. ఈ పరిశోధనను తన పేరుతోనే పిలవమని కోరాడు. అందుకే దానిని ‘హాకింగ్ రేడియేషన్’ అన్నాడు. తాను మరణించిన తర్వాత, సమాధి మీద ‘తుదిపలుకు’గా ‘హాకింగ్ రేడియేషన్’ వుండాలని కూడా ఆశించాడు.
భూమ్మీద మానవాళి మాత్రం ‘మెదడు పెరిగి, హృదయం తరిగి’ తన వినాశనానికి తాను ఆయుధసృష్టి చేసుకోవటాన్ని మాత్రం అనుమానించాడు. ఈ దిశలో ప్రయాణం మానుకోకపోతే, గగనాంతర నివాసం తర్వాత మాట.. వెయ్యేళ్ళలో మానవాళికే నూకలు చెల్లుతాయని హెచ్చరించాడు హాకింగ్.
హాకింగ్‌కు జీవితమంటే అపేక్ష ఎక్కువ. ఆయనకు 21 ఏళ్ళు వుండగా ‘ఎఎల్ఎస్’ (శరీరపు కదలికలు స్తంభించి పోయే అరుదయిన వ్యాధి) వున్నట్లు కనుగున్నారు. ముందు డీలా పడినా, తర్వాత తేరుకుని ఆలోచించాడు. బతికినంతకాలం గొప్పగా బతకాలనుకున్నాడు. ప్రేమించాడు. పెళ్ళి చేసుకున్నాడు,పిల్లలు పుట్టారు. మొదటి భార్యతో సామరస్యంగా విడాకులు పొందాక, మరో పెళ్ళి చేసుకున్నాడు. ఆయనకు మనుమలు కూడా వున్నారు.
వీల్ చైర్ లో వుండే ప్రపంచ దేశాలు తిరిగాడు; పరిశోధనలు చేశాడు; రచన చేపట్టాడు. శాస్త్రవేత్తల కోసమే కాకుండా, సాధారణ ప్రజల అవగాహన కోసం రాశాడు. అందులో బాగా ప్రసిధ్ధి చెందిన పుస్తకం ‘ద్రి బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’. ఈ పుస్తకాన్ని ప్రపంచమంతటా వెర్రెత్తినట్టు చదివారు. తమలో వున్న ‘వెర్రి మొర్రి’ నమ్మకాలను తొలగించుకున్నారు. ఈ పుస్తకం ఆయన్ని సంపన్నుణ్ణి చేసింది. చిత్రం. ఆయన తన కుటుంబాన్ని తానే పోషించుకోవాలనుకునే వాడు.
కుర్చీలోంచి కదల్లేడు కదా- అని ఆయన్ని ‘దివ్యాంగుడ’ని పిలిచి చిన్నబుచ్చలేం. పరమ దుస్సాహసి ఆయన. గురుత్వాకర్షణ మీద కూడా పరిశోధన చేశాడేమో, తాను ‘భార రహిత’ అంతరిక్షంలో వుండాలని భావించాడు. అందుకోసం ఒక జెట్‌లో ఆ స్థితిని కలిగిస్తే, తన నిశ్చలన శరీరంతో ‘భార రహితం’ గా శూన్యంలో కొద్ది సేపు గడిపి ఆయన తన ముచ్చట తీర్చుకున్నాడు.
భౌతిక శాస్త్రాల సూత్రాల ద్వారా కాకుండా, భగవంతుడి ద్వారా ప్రపంచం నడుస్తుందంటే ఒప్పుకునే వాడు కాడు. ఆయనకు మాట పడిపోయినా, తన చేతి వేలి కొసలతో కంప్యూటర్ను మీటి సంకేతాలను శబ్దాలుగా, పదాలుగా మార్చుకుని పలికేవాడు. అందుకోసం ఆయన్ని ఎంతగానో అభిమానించే కంప్యూటర్ శాస్త్ర వేత్తలు ప్రాగ్రామింగ్ చేసి ఇచ్చారు. కాకుంటే ఆయన యవ్వనంలో ‘బ్రిటిష్ ఇంగ్లీష్’ మాట్లాడేవాడు. ఎందుకంటే పుట్టి పెరిగింది… ఆక్స్‌ఫర్డ్‌లో కాబట్టి. కానీ తనకు అవసరమైన ఈ పరికరాన్ని కాలిఫోర్నియా (అమెరికా)లో తయారు చేశారు. కాబట్టి అది ‘అమెరికన్ యాస’ తో తన ఉఛ్చారణ నిచ్చేది. ఇది ఆయనకు నచ్చేది కాదో… లేక వెంటనే అందరికీ అర్థం కాదని అనుమానపడేవాడో.. ఏమో ప్రతీ సారీ ఈ ‘యాస’ పై వివరణ ఇస్తుండేవాడు.
మృత్యువు తర్వాత మరోజీవితం వుందంటే నమ్మేవాడు కాదు.. సరికదా వెటకారమాడేవాడు. ‘కంప్యూటర్ పని చేసి, పనిచేసి చెడిపోతుంది. ఆ తర్వాత అది స్వర్గానికి వెళ్తుందా…? మనిషీ అంతే’ అనే వాడు. ఆయనకు హాస్యం ఇష్టం. ‘హాస్యం లేకుంటే జీవితం విషాదమవుతుంది’ అనే వారు.
స్టెఫెన్ కు అన్ని పురస్కారాలూ వచ్చాయి. ఒక్క నోబెల్ తప్ప. నోబెల్ రానందుకు ఆయన నోబెల్‌ను నిందించలేదు. పరీక్షకు పెట్టే పరిశీలనల మీద ఆధారంగా నోబెల్ ఇస్తారని వివరించారు. తాను పరిశోధనలకే దారి వేసిన వాడు. రేపు స్టెఫెన్ పేరు మీద ప్రైజ్ ను రూపొందిస్తే, బహుశా దాని ముందు నోబెల్ చిన్నబోతుందేమో..!?
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)
‘మెదడు పెరిగి, హృదయం తరిగి’.
రేపు స్టెఫెన్ పేరు మీద ప్రైజ్ ను రూపొందిస్తే, బహుశా దాని ముందు నోబెల్ చిన్నబోతుందేమో..!?
Excellent sir
Excellent article sir. It s great inspiration to all.