చీకటా? ‘లైట్’ తీస్కో…

లైట్ (photo by Roberto F)

అలవాటయితే ఆముదం కూడా ఆపిల్‌ జ్యూస్‌ లాగే వుంటుంది.

ఆండాళ్ళమ్మ మొగుడు రాత్రి రోజూ తాగి వస్తాడు. అలవాటయిపోయింది. మొగుడిక్కాదు, ఆండాళమ్మకు. అతడు తాగి రాగానే అడ్డమయిన బూతులూ తిట్టేస్తాడు.వీలుంటే నాలుగు ఉతుకుతాడు. పెట్టిన అన్నం మెక్కేస్తాడు. ఆతర్వాత భోరుమని ఏడ్చేస్తాడు:’నిన్ను ఎన్నెన్నిమాటలన్నానో ఆండాళ్ళూ..’అని పసికూనలా గారాబాలు తీస్తాడు. ఈ మొత్తం తంతుకు ఆమె అలవాటు పడిపోయింది. ఎప్పుడయినా అతడు తాగి రాలేదో, ఆండాళ్ళమకే నచ్చదు.

మెత్తని పట్టుపరుపుల మీద పడుకున్న గనుల యజమానిని పట్టుకెళ్ళి జైల్లో వేసేస్తారు.కటిక నేలమీద పడక. పక్కనే చిల్లర నేరగాళ్ళ గురక. మొదటి రోజు నరకం. రెండోరోజు నరలోకం. మూడో రోజు స్వర్గం.మెడలోగొలుసుల్లాగే దొంగ,తన సాహస గాథల్ని రోజుకో ఎపిసోడ్‌లాగా గొలుసుకథల్ని చెప్పొచ్చు. పక్కనే పదివేలకో మర్డర్‌ చేసే వాడు, రోజుకో చావు కథను చెప్పొచ్చు. ఇక కేవలం అత్యాచారాలు మాత్రం అత్యంత నిబధ్ధతతో చేసి జైలుకు వచ్చి అదే బారెక్‌లో వుండి, తన కథల్ని రొమాంటిక్‌ గా చెప్పొచ్చు. ఇన్ని కథలు వింటూ, లయబధ్ధమైన గురకలు వింటూ వున్న వ్యక్తిని, మధ్యలో అతడెవడో లాయరొచ్చి ‘బెయిలిచ్చి బయటకు తీసుకెళ్ళి పట్టుపరుపు మీద పడుకోపెడతాను’ అంటే సదరు గనుల యజమానికి వొళ్ళు మండదూ,,,! అలవాటు అంటే అదే మరి.

వెనకటికి ఓ పోలీసు అధికారి, చూస్తూ చూస్తూ ఇలాంటి అవార్డులూ, రివార్డులూ లేకుండా రిటయిరయిపోయాడు. మొత్తం కేరీర్‌లో ఒక లాకప్‌ డెత్‌కానీ, ఒక ఎన్‌కౌంటర్‌ కానీ చెయ్యకుండా సర్వీసు మొత్తం గడచిపోతే ఎవరు మాత్రం గుర్తిస్తారు. కనీసం,’శరణు శరణు’ అంటూ వచ్చిన ఏ అబలకు కూడా ఒక్క బూతు ఎస్‌ ఎం ఎస్‌ ఇచ్చి కూడా ఎరుగడు. సర్వీసులో వుండగా ఇంతటి ‘అసమర్థ’ అధికారిని వాళ్ళ శాఖ ఎలాభరించిందో తెలియదు కానీ, రిటయిరయ్యాక, అతణ్ణి భరించాల్సిన కష్టం కొడుక్కీ, కోడలికీ వచ్చింది. అక్కడికీ అతడి పించనంతా వాళ్ళకే ఇస్తాడు. అయినా సరిపోక అప్పులు పాలయిపోతున్నారు. కారణం అతడి అలవాటు. పొద్దున్నే నిద్రలేచిన దగ్గరనుంచి పడుకునేంత వరకూ, అతడు ఏమి తినాలన్నా, తాగాలన్నా, ఎవరో ఒక కురుచ క్రాపువాడయినా వచ్చి శాల్యూట్‌ చెయ్యాలి. చేసిన వాడే తిరిగి తిరిగి చేస్తే ఊరుకోడు. సర్వీసులో వుండగా ఈ ఒక్క అలవాటుకూ బానిసయిపోయాడు.

అందుకోసం రిటయిరయిన కానిస్టేబుళ్ళను వెతికి తెచ్చి మరీ పోషించాడు కొడుకు. దాంతో అతని సంపాదనంతా హారతి కర్పూరమయిపోతోంది. ఒక రోజు ఏమయితే అయిందని వాళ్ళందరినీ మానిపించేసాడు కొడుకు. నిద్రలేవగానే ‘నీది ఒక బతుకేనా’ అని ఒక తిట్టు తిట్టి కాఫీ ఇచ్చాడు. ‘మావగారూ! ఏమి దరిద్రపుగొట్టు జన్మండీ మీది’ అని అతని భార్య శాపనార్థాలు పెట్టి అన్నం పెట్టేది. తినతినగా అట్లు అలవాటయినట్లు గురుడికి తిట్లు అలవాటయిపోయింది. ఇప్పడు తిట్టకుండా ఏమి పెట్టినా తినలేడు. తిన్నా కూడా తిన్నట్లుండదు. తిట్లను అంతగా రుచిమరిగేశాడు.

మూడు వారాలకు పైగా సమ్మె నడిచిపోతోంది.జనానికి మొదట్లో ఇబ్బందిగా అనిపించింది. తర్వాత మామూలయిపోయింది. ఇప్పుడు, ఒక వేళ సమ్మె విరమించేస్తే ఎలా…! అని స్థితి కూడా వచ్చేసింది. ఇలాంటప్పుడు సమ్మెకు మద్దతు ఇవ్వటమే సుఖమనిపిస్తుంది.
ఒకప్పుడు హైదరాబాద్‌ రోడ్ల మీద ‘రిమ్‌జిమ్‌ రిమ్‌జిమ్‌ హైదరాబాద్‌, రిక్షావాలా జిందాబాద్‌’ అని పాడుకునే రిక్షావాలాలుండేవారు. దాని మీద ప్రయాణిస్తుంటే( అది తొక్కే కార్మికుడెవ్వడు-అని ప్రశ్నించకుండా వుంటే) ఎవరికి వారు ఒక నవాబులాగే భావించే వారు. అవి అంతరించిపోయాయి. అయినా ఆటోలకు అతుక్కుపోయి అలవాటు పడి పోలేదూ..! అలాగే ‘డబుల్‌ డెక్కర్‌’లని పిలవబడే మేడబస్సులుండేవి. అవి ఎక్కి ప్రయాణిస్తుంటే గాలిలో తేలిపోతున్నట్లే వుండేది. అవి హఠాత్తుగా మాయమయ్యాయి. ఇక నేలబారు బస్సులే మిగిలాయి. అయినా వాటి సౌఖ్యం వాటికున్నది.మనుషులకూ, మనుషులకూ మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని బాధపడేవారికి, అవి ఎంతో ఊరటనిస్తూ వుండేవి. మనిషికి మనిషి అతుక్కుపోయేలా బస్సులో ఎక్కించేస్తే… ఆమ్మో ఆ సాన్నిహిత్యమే వేరు కదా! అలాంటి ఆర్టీసీ బస్సులు వేరే సమ్మె కారణంగా ఆ మధ్య ఆగిపోయాయి. అప్పుడు బొత్తిగా అలవాటులేని ఎంఎంటిస్‌ రైళ్ళు జంకుతూ జంకుతూ ఎక్కారు. ఆ తర్వాత తెలిసింది.వేళ్ళాడుతూ ప్రయాణించే ఆ బోగమే వేరని. ఇప్పుడు బస్సులు ఆగి చాలా రోజులు అయ్యింది. మధ్యలో ఎంఎంటిస్‌లు కూడా ఆగాయి. ఆదివారం పూట మాత్రమే తీయటానికి కొనుక్కన్న మోటార్‌ బైక్‌, స్కూటరు, మోపెడ్‌, కార్లను ప్రతీ రోజూ బయిటకు తీసారు. ఖర్చయితే అయింది కానీ, ఇది కూడా బాగానే వుందనకున్నారు.

ఎప్పుడూ నడవని వాళ్ళు కాలి నడకన కిలోమీటర్లు నడుస్తూ, ఆరోగ్యం ఇంత అప్పనంగా వచ్చేస్తుందా.. అని ఆశ్చర్యపడిపోతూ అలవాటు పడిపోతున్నారు.
ఇన్నాళ్ళూ ఉద్యోగం చేసి ఉద్యోగం చేసి విసుగొచ్చిన వాళ్ళు ఉద్యమంలో కొత్త ఉత్సాహం పొందుతున్నారు. ఎప్పుడూ పై అధికారి ముందు తలవొంచుకుని, అతడిచ్చే అడ్డమైన మెమోలకు సమాధానాలిచ్చే ఈ ఉద్యోగులు, ముఖ్యమంత్రినీ, మంత్రుల్నీ ఎలా తిట్టాలంటే తిట్టగలుగుతున్నారు.
కానీ, కరెంటు లేక పోతేనో, నీళ్ళులేక పోతేనో, పూటకు గంజి లేక పోతేనో, పురిటినొప్పుల స్త్రీ మూర్తి ఆసుపత్రికి వచ్చేసరికి వైద్యుడు లేక పోతేనో… మాత్రం చావు తప్పదు కదా! ఇంకా మరణాన్ని కూడా అలవాటుగా మార్చుకునేంత సహనం ప్రజలకు రాలేదు. ఏలిన వారు ఈ విషయాన్ని గ్రహిస్తే చాలు.
– సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రిక9అక్టోబరు2011 సంచికలో ప్రచురితం)

Leave a Reply