నా పేరు : నితిష్ కుమార్
దరఖాస్తు చేయు ఉద్యోగం: మధ్యలో ఎన్నిసార్లు మానుకున్నా మళ్ళీ అదే ఉద్యోగం:బీహార్ ముఖ్యమంత్రి. ఒకప్పుడు ప్రధాని మంత్రికి దరఖాస్తు చెయ్యాలనుకున్నాను. ‘గుజరాత్ సీఎంగా వున్న మోడీ పీఎం కాగలిగినప్పుడు, నేనెందుకు కాకూడదు?’ అని అనుకున్నాను. అది మోడీ మనసులో పెట్టుకుంటే, నేను సీఎం కావటం కూడా కష్టమే..అది వేరే విషయం.
వయసు : పార్టీలు మార్చే వయసు కాదు కానీ పొత్తులు మార్చే వయసు. కొన్నాళ్ళు లాలూ తో పొత్తు, కొన్నాళ్ళు బీజేపీతో పొత్తు.
ముద్దు పేర్లు : ‘పొత్తే’ష్ కుమార్( ఎప్పటికే ఏ ఎత్తు వెయ్యాల్లో, ఏ పొత్తు పెట్టుకోవాలో భారత రాజకీయాల్లో నానుంచే నేర్చుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాగత బంధన్’ అంటూ లాలూతో పొత్తు పెట్టుకున్నాను. ఇప్పుడు బీజేపీతో పెట్టుకుంటున్నాను. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో తేడాలు వస్తే ‘కాషాయం’తో ‘రామ్ రామ్’ చెప్పేయవచ్చు.
విద్యార్హతలు : అందరూ ‘మెకానికల్ ఇంజనీరింగ్’ అనుకుంటారు. కానీ నేను మాస్టర్ చేసింది: ‘పోల్ ఇంజనీరింగ్’.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: కాషాయ సోషలిస్టుని. (అనగా సోషలింజం లో కాషాయాన్నీ, కాషాయంలో సోషలిజాన్నీ చూసే వాణ్ణి.)
రెండు: గాంధేయ లోహియా వాదిని.( రెండూ భిన్న ధ్రువాలు కావచ్చు. నేను వాటిని కలిపి చూసేస్తాను.)
సిధ్ధాంతం : ఎవరితో కలిసామన్నది ముఖ్యం కాదు. గెలిచామా? లేదా అన్నది ముఖ్యం.
వృత్తి : ఇంకో వృత్తి వుంటే కదా! చేస్తే ముఖ్యమంత్రి పదవి చెయ్యటం. లేకుంటే ఖాళీగా వుండటం.
హాబీలు :1. అలగటం: ఎవరి మీదో కాదు. నా మీద నేనే అలగటం. గత పార్లమెంటు ఎన్నికల్లో గెలవలేదని, నా మీద నేనే అలిగి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, నా స్థానంలో జీతన్ రామ్ మాంఝీ ని పెట్టాను.
2.ఆంక్షలు పెట్టటం: ముస్లిం వోట్లు పోతాయని ఒక దశలో నరేంద్రమోడీనే బీహార్‌లో ప్రచారానికి రావద్దన్నాను.
అనుభవం : రాజకీయాల్లో ప్రేమలూ, ద్వేషాలూ ఋతువుల్లాంటివి. ఏ ఋతువుకి ఆరాగం. కావాలంటే లాలూ ప్రసాద్‌నే అడగండి. ఆయన్ని ఎన్ని సార్లు రమ్మన్నానో.. ఎన్ని సార్లు ‘ఛీ’ అన్నానో…!?
మిత్రులు : మోడీ ని మించిన మిత్రుడు లేడు.( అందుకే ఆయనతో పలు సార్లు పొత్తుకు సిధ్ధమయ్యాను)
శత్రువులు : మోడీని మించిన శత్రువు లేడు.( ఎందుకంటే ఆయనను ప్రధాని అభ్యర్థి చేసినప్పుడు ఎన్డీయే నుంచి బయిటకు వచ్చాను.)
మిత్రశత్రువులు : మా లాలూ నే.
వేదాంతం : పనులు చెయ్యాలంటే, కుర్చీలో కూర్చోవాలి. కూర్చోవాలంటే, పొత్తులు మార్చాలి.
జీవిత ధ్యేయం : ఈ విషయంలో మోడీయే ఆదర్శం. ( ఢిల్లీ గుజరాత్‌కు ఎంత దూరమో, బీహార్‌కీ అంతే దూరం.)
– సతీష్ చందర్