మారు మనువుకు బాజాలెక్కువ

photo by Hamad AL-Mohannna

టాపు(లేని) స్టోరీ:

‘మొదటి సారి పెళ్ళి చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా రావాలి’ అని పిలిచిన వాడు-నిజంగా కాలజ్ఞాని. పెళ్ళనేది జీవితంలో ఒక్క సారే జరుగుతుందనుకునే అమాయకుడు కాడు అతను. విడాకులు ఇచ్చే చాకచక్యముండాలనే కానీ, ఎన్ని సార్లయినా మూడేసి ‘జారు’ ముడులు వేయవచ్చు. జన్మకో శివరాత్రి వుంటే వుండొచ్చు కానీ, ఇంత బతుక్కీ ఒకే ఒక్క తొలి రాత్రా? ఇలా ఆలోచించే నిత్య పెళ్ళికొడుకులున్న ఇంట ఎప్పుడూ పచ్చతోరణాలే.

సరిగ్గా తెలుగునాడు కూడా ఇలాగే కళకళలాడిపోతోంది. నిత్యమూ మైకులూ, బాజాలూ, భజంత్రీలూ, ఊరేగింపులూ…! ఒకరు టాపులేని జీపు మీద ఊరేగితే, ఇంకొకరు ఎద్దుల్లేని బండి మీద ఊరేగుతారు. అలాగని ఎన్నికల కళ అనుకునేరు! ఎన్నికల కళయితే ఎప్పుడో అయిదేళ్ళకో సారి వస్తుంది. ఇది ఉప ఎన్నికల కళ. దీని లెక్కే వేరు. పూర్తిగా మారుమనువుతో సమానం.

మారుమనువు ఎప్పుడొస్తుంది? కట్టుకున్న భార్యను వదిలేసి, వేరే ఆమెతో ‘జంప్‌’ అయితే వచ్చింది. ఉప ఎన్నికా అంతే, ఒక పార్టీ టిక్కెట్టు ఎమ్మెల్యేగా గెలిచి, వేరే పార్టీకి ‘జంప’య్యాడనుకోండి. స్పీకరు ‘అనర్హత’ వేటు వేసేస్తారు. ‘హౌస్‌’ లో విడాకులను ‘అనర్హతే’ అని పిలుస్తారు. అప్పుడు కొత్త పార్టీ టిక్కెట్టుతో సదరు ‘జంపు జిలానీ’ వేరే పార్టీతో మారు మనువుకు , అదే లెండి, ఉప ఎన్నికకు ముహూర్తం పెట్టాడు. ఇప్పుడు (జూన్‌12) జరుగుతున్న ఉప ఎన్నికలన్నీ ‘జంపు జిలానీ’లవే. అందుకే అంత మోత.

నిజమే మరి! ఊపిరి తక్కువ ప్రజాస్వామ్యంలో ఎన్నికల కన్నా ఉప ఎన్నికలకే ప్రాధాన్యం వుంటుంది. రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికల మోత, ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది. నిన్నటి దాకా ఈ పెళ్ళి కళ తెలంగాణలో వున్నది. ఇప్పుడు సీమాంధ్రకు వచ్చింది( ఒక్క పరకాల ఉప ఎన్నిక మినహా.)

వివాహితుల్లో రెండు రకాలున్నట్లే, పార్టీల్లో కూడా రెండు రకాలుంటాయి. ఇంటగెలిచి రచవోడే రకం ఒకటయితే, ఇంట వోడి రచ్చ గెలిచే రకం మరొకటి. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) నే తీసుకోండి. ఇది రెండో 009 ఎన్నికల్లో ఇంట వోడింది. (హౌస్‌లో డజను సీట్లకు మించి లేవు). తెలంగాణ పై చిదంబరం గారి ‘రెండు నాల్కల ప్రకటనల’ పుణ్యమా- టీఆర్‌ఎస్‌కు రచ్చగెలిచే అవకాశం వచ్చింది. ఉద్యమం ఊపందుకుంది. దాంతో ఇతర పార్టీల తెలంగాణ నేతలు కొందరు ‘జంప్‌ జిలానీ’లయ్యారు. అలాకాకుండా, కొందరు కట్టుకొన్న భార్యనే మరో మారు కట్టుకున్నట్లు, రాజీనామా చేసిన పార్టీనుంచే తిరిగి ఎన్నికయ్యారు. దాంతో తెలంగాణలో ఉపఎన్నికలు పుణ్యమా అని టీఆర్‌ఎస్‌ రచ్చగెలిచింది. సరిగ్గా ఇదే పనిని సీమాంధ్రలో జగన్మోహన రెడ్డి చేశారు. తండ్రి చనిపోయిన తర్వాత చేసిన ‘నిరవధిక ఓదార్పు’ ( నిరవధిక దీక్షలు చూసి వుంటారు. కానీ నిరవధిక ఓదార్పుకు మాత్రం కర్త జగనే. దు:ఖించిన వారు ఎంత దీర్ఘంగా దు:ఖించారో తెలీదు కానీ, ఈయన మాత్రం నిరవధికంగా ఓదారుస్తూనే వున్నారు.) వల్ల, కొందరు శాసన సభ్యులు కాంగ్రెస్‌కు విడాకులిచ్చేశారు. ఫలితమే మారుమనువుల్లాంటి ఈ ఉప ఎన్నికలు. కానీ సినిమా పెళ్ళిళ్ళలో సరిగ్గా పీటల మీద కూర్చునే వేళకు వచ్చి ‘ఆపండి’ అన్నట్టు సిబిఐ వారు ఉప ఎన్నికల వేళకు వచ్చి ‘ఆపండి’ అనలేదు . కానీ పెళ్ళి పెద్ద జగన్‌ను అరెస్టు చేశారు. ఇలా చేస్తే ఉప ఎన్నికలు మెజారిటీతో మోతెక్కిపోవా? అయినా ఫర్వాలేదు. తర్వాత కాంగ్రెస్‌ను మరింత మంది ‘జంప్‌ జిలానీ’లు రాకుండా వుండాలంటే, కాంగ్రెస్‌కు ఇంతకు మించి మార్గం లేదని భావించింది. ఎందుకంటే కాంగ్రెస్‌ మొదటి రకం పార్టీ: ఇంట గెలిచి రచ్చ వోడిన పార్టీ!!

న్యూస్‌ బ్రేకులు:

 

మారిన కాంగ్రెస్‌ పంచాంగం!

జగన్‌ అక్రమ ఆస్తుల కేసుతో కాంగ్రెస్‌ కు ఎలాంటి సంబంధంలేదు. ఉప ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలనే వైయస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

-తులసి రెడ్డి, కాంగ్రెస్‌ నేత.

నిజమే. కాంగ్రెస్‌ నిత్యనూతనమైనది. నిన్నటి కాంగ్రెస్‌తో, నేటి కాంగ్రెస్‌కు సంబంధం వుండదు. వైయస్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పటి కాంగ్రెస్‌ వేరు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న ఇస్పటి కాంగ్రెస్‌ వేరు

 

ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం అందరికీ సమానమే.

-జయప్రకాష్‌ నారాయణ్‌, లోక్‌సత్తా అధినేత

ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న సోషల్‌ స్టడీస్‌ పాఠం లా లేదూ! ఆయన అంతే లెండి. అదే చెప్తారు!?

 

ట్విట్టోరియల్‌

గొప్ప ‘సెంటిమెంటు’ చిత్రం!

photo by ashish jain

 

సెంటిమెంటు లేకుంటే తెలుగువాడు కాడు. అయితే చిన్నమినహాయింపు. ఈ సెంటిమెంటు జీవితంలో వున్నా లేకున్నా, తమ చూసే సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తప్పకుండా వుండాలి.ఒకప్పుడు పాత సినిమాల్లో ‘చెల్లి’ సెంటిమెంటు దిట్టంగా వుండేది. హీరో, హీరోయిన్ల మధ్యనే కాకుండా, అన్నా, చెల్లెళ్ళ మధ్య కూడా పాటలు వుండేవి. ఇప్పుడు కొంచెం పరిస్థితి మారిందనుకోండి. రాజకీయాల్లో అయితే ‘అమ్మ’ సెంటి మెంటు, ‘అన్న’ సెంటిమెంటుకు మనవాళ్ళు ఇట్టే పడిపోతారు.

ఇందిరాగాంధీ ‘అమ్మ’ సెంటిమెంటుతో కట్టిపారేస్తే,, ఎన్టీఆర్‌ వచ్చి ‘అన్న’ సెంటిమెంటుతో ఆకట్టుకున్నారు. ‘నా తెలుగింటి ఆడపడచులూ’ అని ఆయన ఏ సభలో అన్నా చప్పట్లే చప్పట్లు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ‘రాజన్న’ గా పిలిపించుకుని ‘అన్న’ సెంటిమెంటుకు మళ్ళీ జీవం పోశారు.

ఇప్పుడు జగన్‌ అరెస్టు తర్వాత మళ్ళీ ‘అమ్మ’ సెంటిమెంటుతో వోటర్లను కలవ బోతున్నారు. తన కొడుకును అన్యాయంగా జైలు పాలు చేశారంటూ జనంలోకి వెళ్తున్నారు.

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

‘డాలర్‌’ పతి!

పలు ట్వీట్స్‌ : నాకిచ్చే పారితోషికాన్ని డాలర్లలోనే ఇవ్వండి అన్ని అమితాబ్‌ అన్నారు

కౌంటర్‌ ట్వీట్‌: కౌన్‌ బనేగా ‘డాలర్‌’ పతీ..! కార్యక్రమానికి హోస్ట్‌గా బుక్కవుతారేమో! పడిపోయే రూపాయిని నమ్ముకోని దేశభక్తుడు లెండి.

 

ఈ- తవిక

‘జన’ ప్రదం!

లారీ ఎక్కిన వాడెల్లా కూలి కాడు,

మందు కొట్టిన వాడెల్లా వోటరూ కాడు.

సభకొచ్చే జనాలూ,

ఎడారిలో ఎండమావులూ

రెండూ ఒక్కటే.

 

 

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

వోటరు అనే వాడు ఏక్‌ దిన్‌కా సుల్తాన్‌: ఆఒక్కరోజూ నేతలంతా వాడి కాళ్ళ మీద పడతారు. మిగిలిన రోజుల్లో, నేతల కాళ్ళే వాడికి కనపడవు- పట్టుకుని రుణం తీర్చుకుందామన్నా!!

కొట్టేశాన్‌( కొటేషన్‌):

దేశమంటే రూపాయి కాదోయ్‌! దేశమంటే డాలరోయ్‌!!

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 29 మే2012 సంచికలో ప్రచురితం)

 

3 comments for “మారు మనువుకు బాజాలెక్కువ

  1. ఈ- తవిక
    ‘జన’ ప్రదం!
    లారీ ఎక్కిన వాడెల్లా కూలి కాడు,
    మందు కొట్టిన వాడెల్లా వోటరూ కాడు.
    సభకొచ్చే జనాలూ,
    ఎడారిలో ఎండమావులూ
    రెండూ ఒక్కటే,
    సత్యమెరుగరా సతీష్‌చందరా!

    • సార్ నా పేరు రాజు పటేల్.. V6 రిపోర్టర్. నిజాన్ని చాలా బాగా చెప్పారు సార్. నా అనుభవం కూడా అదే చెప్పింది. అన్ని పార్టీల సభలకు వెళ్ళుతారు. ఉప ఎన్నికల కవరేజ్ కి వెళ్ళితే పోటీలో ఉన్న అభ్యర్థే సాక్షాత్తుగా… ఓటర్లతో ఇలా అంటున్నాడు. మీరు అందరి దగ్గర డబ్బులు తీసుకోండి మందూ తాగండి కాని ఓటు మాత్రం నాకే ఎయ్యండి. ఇలా అన్ని పార్టీల నాయకులు అంటున్నారు. ఓటరూ కూడా అందరి దగ్గర తీసుకుంటాము సార్ కాని ఓటు మాత్రం మీకే వేస్తాం.. అంటున్నాడు.

  2. మీ టపాలు బాగుంటున్నాయి. ఇదింకా బాగుంది.

    ముఖ్యంగా జేపీ గురించి–“ఆడంతే! అదో టైపు” అంటారనుకున్నాను.

    కీపిటప్!

Leave a Reply