పేరు : అరుణ్ జైట్లీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: లోక్ సభ సభ్యుడు (2014లో పోటీ చేసి ఓడిపోయాను కదా? అయినా కేంద్ర మంత్రిని కాగలిగాను. ప్రజల వోట్లతో పనిలేకుండా రాజ్యసభకు వెళ్ళగలిగాను. దేశ ఆర్థిక గతిని మార్చేశాను. మీ జేబుల్లో నోట్ల రంగు మార్చగలిగాను. అయినా లోక్ సభ కు గెలిచానన్న తృప్తి నాకు కావాలి కదా!)
వయసు : కలం అవతల పడేసి నాగలి పట్టే వయసు. ఆశ్చర్యంగా వుందా? ‘గతంలోలాగా ఈయన కేంద్ర బడ్జెట్ చదువుతాడా? లేక రైల్వే బడ్జెట్ చదువుతాడా? లేక మారిన పద్ధతి ప్రకారంరెండూ కలిపి చదువుతాడా?’ అని అందరూ అనుకునే లోగా నేను వ్యవసాయ బడ్జెట్ చదివేశాను. చూశారా..?( గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మహిమ. గ్రామీణ వోట్లు బీజేపీకి వ్యతిరేకంగా పడ్డాయి. దేశమంతా ఇలాగే వుంటే.. వామ్మో!? అందుకే రైతుకు వరాలిచ్చేశాను.)
ముద్దు పేర్లు :‘రుణ్’ జైట్లీ!( మనం బడ్జెట్ సమర్పిస్తే, ఇటు దేశం, అటు పౌరుడూ ‘రుణాలు’ పొందటం గురించే ఆలోచిస్తాడు. అరుణ్ ‘నోట్లీ’ ( అబ్బే.. ఏం లేదు. నేను ఆర్థిక మంత్రిగా వుండగానే కదా- ‘నోట్ల’ను రద్దు చేశాను.)
విద్యార్హతలు : బ్యాచిలర్ ఆఫ్ ‘నోట్’ మేనేజ్మెంట్. ‘వోట్’ మేనేజ్ మెంట్కు మా పార్టీలో అమిత్ షాలాంటి ఉద్దండులున్నారు.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: రోగాన్నీ నేనే, ఔషధాన్నీ నేనే. అర్థం కాలేదా? దేశం నిండా కాలుష్య కారకాలైన పరిశ్రమలు పెట్టటానికి బహుళజాతి సంస్థల్ని ఆకర్షించేదీ నేనే; కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రజలకు ఆరోగ్య బీమాను వర్తింప చేసేదీ నేనే.
రెండు: కార్పోరేట్నీ నేనే; రైతునూ నేనే( కావాలంటే 2018 బడ్జెట్ను చూడండి)
సిధ్ధాంతం : కొండను తవ్వి ఎలుకను పట్టటం. ‘పెద్ద నోట్లను రద్దు చేసి, అతి చిన్న స్థాయిలో కూడా బ్లాక్ మనీని పట్టలేక పోవటం
వృత్తి : తాళం వెయ్యటం; గొళ్ళెం మరవటం.(వరాలు ఇవ్వటం; కేటాయింపుల మరవటం. ఉత్పత్తి వ్యయం మీద ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇస్తానని ప్రకటించటం. నిధులేవీ- అంటే బడ్జెట్ వెలుపల కూడా ఆదాయం వుంటుందని ఊహల్లో తేలటం.)
హాబీలు :1. పార్కులో పల్లీలు కొనుక్కుని ‘పేటీఎమ్’ వుందా- అని అడగటం.
2.పేవ్మెంట్ మీద బిచ్చగాణ్ణి సైతం పిలిచి ‘ఇనకమ్ టాక్స్ రిటర్న్స్’ ఎలా ఫైల్ చెయ్యాలో చెప్పటం; ‘డిజిటల్ బెగ్గింగ్’ మీద డెమో ఇవ్వటం.
అనుభవం : ‘పన్ను’ పోటు ఇలా, అలా వుంటుంది అని అందరూ చెప్పటం తప్ప గూడ్స్ సర్వీస్ టాక్సెస్ (జీఎస్టీ) వేసే వరకూ నాకూ అనుభవంలోకి రాలేదు. డెంటిస్టును కదా అని మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకోకుండా, తన పన్నును తానే పీక్కున్నట్టుంది.
మిత్రులు : రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే చోద్యం చూసేవారు నా మిత్రులు కారు. కనీసం సబ్సిడీ ధరకయినా ఉరితాడు సరఫరా చేసే సాయం చెయ్యాలి కదా!
శత్రువులు : అన్నదాతకు పరమాన్నం పెడుతుంటే, సున్నం పెడుతున్నాని వెక్కిరించారు.( వరి, గోధుమ రైతుకు తప్ప మిగిలిన వారికి గిట్టు బాట ధరతో ఎంత మేలు చేస్తున్నానో చూస్తున్నారు కదా!)
మిత్రశత్రువులు : మా పార్టీ అనుబంధ కార్మికసంస్థకు చెందిన వారే కార్మికులకు బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదని అంటున్నారు. వీళ్ళనేమనాలి?
వేదాంతం : ‘స్వైప్’ తో పోయేదానికి ‘నోటు’వరకూ ఎందుకూ..?( నాడు అంబేద్కర్ ‘క్యాస్ట్లెస్ట్ సౌసైటీ’ కావాలన్నారు. మోడీజీ, నేనూ కలసి ‘క్యాష్ లెస్ మార్కెట్’ ను సృష్టిస్తున్నాం)
జీవిత ధ్యేయం : ఇలాగే మరో అయిదేళ్ళ పాటు బడ్జెట్లు చదివి వినిపించాలని.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)