వందే మాతరం! ‘వంద’ యేమాత్రం?

బిచ్చగాడే కావచ్చు.

‘అమ్మా! ఆకలి!!’ అంటాడు. కానీ, అన్నం పెడితే కన్నెర్రచేస్తాడు.

‘బాబూ! ధర్మం!!’ అంటాడు. కానీ, బియ్యం వేస్తే కయ్యానికొస్తాడు.

అలా కాకుండా దగ్గరకు పిలిచి ‘ఇదిగో పది’ అన్నామనుకోండి. వాడి ముఖం వెలిగి పోతుంది.

ఇలాంటి పదులు- మూడోనాలుగో వస్తే, ఏదయినా చేసుకోవచ్చు: క్వార్టర్‌ కొట్టొచ్చు. సినిమాకెళ్ళొచ్చు. గుట్కా వెయ్యొచ్చు.

కూలివాడే కావచ్చు.

‘అదుగో సభ, ఇడుగో నేత, పొద్దున్న పులిహోర, మధ్యాహ్నం పెరుగన్నం- ఎక్కు లారీ’ అన్నాడనుకోండి ఓ రాజకీయ కార్యకర్త… ఒక్కరు ఎక్కరు.

లిక్విడ్‌ క్యాష్‌ కొట్టాలి. అంటే ‘ద్రవరూపంలోని నగదు ‘ కాదు . ద్రవమూ (మందూ) పడాలి, ద్రవ్యమూ(నగదూ) పడాలి.

కూలిని ఇంక ఏ రూపంలో ఇచ్చినా గుర్తించడు. అన్నాన్నీ, బియ్యాన్నే కాదు, పులిహోరాల్నీ, పెరుగన్నాల్నీ కూడా, తక్షణం మందుగా మార్చుకోలేరు.

వోటరే కావచ్చు.

ఇంటి ముందు కొచ్చి వందనం చేస్తే కుదరదు. ‘వంద’ కొట్టాలి. అప్పుడే నువ్వు చెప్పినదానికి ‘తందానా’ అంటాడు. ఇది వినటానికి మాత్రమే. కానీ వోటరనే పెద్దమనిషి తనంతట తాను వచ్చి, తన కాళ్ళ మీద తాను నిలబడి. తన వేలితో (ఇవిఎంలో) తన కన్ను పొడుచుకోవాలంటే… ఐ మీన్‌.. వోటు వెయ్యాలి. ‘వెయ్యా’లీ అంటే ‘వెయ్యి’వ్వాలి. అభ్యర్థి తన ప్రచారంలో ‘వోటు వెయ్యి’ అన్నప్పుడు వోటరు ‘ఫిక్స్‌’ అయిపోతాడు- తనకు ‘వెయ్యి’ వస్తుందని. కాదనీ, వోటరుకు ‘పంచె కండువాలూ, చీరాజాకెట్లూ’- ఇలా ఇచ్చారనుకోండి… ముఖం రాల్చుకుంటాడు.

వెయ్యి తన చేతిలో పడ్డాక. తన ఇష్టం. ఏమైనా చేసుకుంటాడు.

నోటును కళ్ళ చూస్తేనే- వోటు వేస్తున్నాడన్న రహస్యం గల్లీలో వుండే కార్యకర్తలకే కాదు, ఢిల్లీలో వుండే నేతలక్కూడా తెలిసి పోయింది.

ఉపాధి పథకం పెట్టి వందరోజుల కూలి పేరు మీద ‘క్యాష్‌ ‘కొట్టారు.

ఇప్పుడు ఆ పథకం, ఈ పథకం అని కాదు, ఏ సంక్షేమ పథకమయినా ‘క్యాష్‌’తోనే కొట్టాలని వొట్టు పెట్టేసుకున్నారు. నగదును చేతులు మారకుండా, నేరుగా పథకాల పేరు మీద వోటరు చేరే నగదు బదలీ పథకాన్ని చేపట్టారు.

ఏ సంక్షేమానికయినా కుటుంబమే కేంద్ర బిందువు. కానీ ఆ కటుంబానికి పెద్ద మగవాడు. అతడు తూలని వాడయితే ఆ కుటుంబాన్ని పోషిస్తాడు. తూలే వాడయితే అదే కుటుంబాన్ని పీల్చేస్తాడు.

ఎంత తాగుబోతయినా భార్యా బిడ్డల నోటి దగ్గర బువ్వను నేరుగా కొట్టెయ్యడు. తినే తిండిని ఆప లేడు. కానీ సంపాదనను తిండిగా మారుస్తానంటే అడ్డుపడి మందుగా మార్చుకుంటాడు. ఈ పాయింటునే కాస్త నాజూగ్గా చెప్పారు నోబెల్‌ పురస్కార గ్రహీత, ప్రసిధ్ద ఆర్థిక వేత్త అమర్త్య సేస్‌. బియ్యం, పప్పులూ, నూనె, పౌష్టికాహారం – వీటిని నేరుగా అందించటం వల్ల పేదల్లో బాలికలకూ, పసిపిల్లలకూ ఉపయోగకరంగా వుంటుంది. వారి ఆరోగ్యం మెరుగ్గా కూడా వుంటుంది. కానీ, వాటి విలువను నగదులో ఇవ్వటం వల్ల ‘పితృస్వామ్య’ సమాజంలో మగవాడు (తండ్రే కావచ్చు) వాటిని హరిస్తాడు. అయినా ఆయన పిచ్చి గానీ, ఇవి ‘వోటు’ పథకాలు కానీ, ‘కూటి’ పథకాలు కావు కదా! నగదు నేరుగా ఇవ్వటం వల్ల వోటరు తాను వోటు వేయటమే కాకుండా, వోటరు చేత కూడా వేయిస్తాడనే ఒక ‘దూరా’శ! నిజానికి అయిదేళ్ళూ జనాన్నుంచి సర్కారు గుంజేదే ఎక్కువ. ‘నగదు బదలీ’ అమలు లో వున్నప్పుడు ఇలా కరెంటు చార్జీల మీదా, వంట గ్యాస్‌ మీదా, రైలు చార్జీల మీదా, ఆర్టీసీ చార్జీల మీదా- ఎంత బాదినా నొప్పిగా వుండదని ఏలిన వారి గట్టి నమ్మకం. జనానికి తాము చెల్లించేది గుర్తుండదనీ, తాము పుచ్చుకున్నదే గుర్తుంటుందనీ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ సర్కారు ఒక మొండి లెక్కకు వచ్చేసింది. అందుకే ‘వీర బాదుడు’ బాదుతోంది. రేపు బడ్జెట్‌లో ‘సంక్షేమం పేరిట’ రకరకాల చిల్లర నగదు బదలీలను రూపొందించి మాయ చేయవచ్చనే ‘దూరూ’హ కూడా కనిపిస్తోంది! ఈ ‘చిల్లర’ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూద్దాం.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్  ఆంధ్ర వారపత్రిక 11-17జనవరి2013 వ తేదీ సంచిక లో ప్రచురితం)

Leave a Reply