వి.’కుప్పిగంతు’ల్రావు!

V.hanumanthar Raoపేరు : వి.హనుమంత రావు

ముద్దు పేరు : వీహెచ్‌, హన్మన్న, వి.’కుప్పిగంతు ‘ ల్రావు (శత్రువు ఎదురయితే వయసను సైతం మరచి ‘కుప్పించి’ గెంత గలను.)

విద్యార్హతలు : సంస్కృతంలో ప్రావీణ్యం( డెహరాడూన్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద నేనూ, తెలుగుదేశం నేత రమేష్‌ రాథోడ్‌ మాట్లాడుకున్నది సంస్కృతంలోనే. గమనించలేదా..?) దీనిని ‘బూతు’ క్యాప్చరింగ్‌ అని కూడా అంటారు. (బూతుల్ని స్వాధీనంలోకి తీసుకోవచ్చన్నమాట.) పూర్వం పోలింగ్‌ బూతుల్లోకి చొరబడటాన్ని ఇలా పిలిచేవారు.

హోదాలు :పెద్దల సభలో సభ్యతం.( ‘పెద్దలకు మాత్రమే’ సినిమాల్లో వాడే సంభాషణలను మేము ఈ సభలో యధేఛ్చగా చేసుకోవచ్చు.). చార్‌ ధామ్‌ విషాదం తర్వాత నాకున్న పేరును బట్టి( హనుమంతుడు అంటే వాయుపుత్రుడు- అని అర్థం కదా!) వాయుమార్గం ద్వారా బాధితుల్ని ఇళ్ళకు చేర్చే బాధ్యత ఒప్పగించారు. మధ్యలో చంద్రబాబు ‘నారా వారి ట్రావెల్స్‌’ పెట్టి ‘ఎక్కండి బాబూ ఎక్కండి, మా విమానంలో ఎక్కండి బాబూ’ అని అరిస్తే కోపం రాదూ!

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: నాకు ఏకాలం అయినా వానా కాలంలా కనిపిస్తుంది. ‘రేబాన్‌’ చలువ కళ్ళ జోడు వాడతాను కదా! మబ్బు పట్టే వుంటుంది. అందుకే ఎవరయినా గుసగుసలాడినా నాకు ఉరిమినట్టు అనిపిస్తుంది. ‘గొడవెందుకూ’ అనడిగితే, ‘గొడవ పడతావా’ – అని సవాలు చేసినట్లు అనిపిస్తుంది. చేతులు చాచి కౌగలించుకోవటానికి వస్తున్నా, కుస్తీ పోటీకి ఆహ్వానించినట్లనిపిస్తుంది.

రెండు: నోటితో ఆలోచిస్తాను. చాలా మంది ఆలోచించి మాట్లాడతారు. కానీ, నేను మాట్లాడి ఆలోచిస్తాను.

అనుభవం : వైయస్‌ కుటుంబాన్ని నిందించటంలో సుధీర్ఘానుభవం. చంద్రబాబు ను తిట్టటం ఇప్పటికీ కొత్తగానే వుంటుంది. అందుకే ఎయిర్‌ పోర్టు దగ్గర బెడిసి కొట్టింది.

వేదాంతం : హనుమంతుడి వేదాంతం ఏముంటుంది? భక్తి తత్వం. సోనియా కుటుంబం విషయంలో నేను నిజంగానే వీరభక్త హనుమాన్‌ను.

వృత్తి :హనుమంతుడి వృత్తి ఏదో, అదే నా వృత్తి. మృతుల దగ్గరకు సంజీవినీ పర్వతాన్ని ఎత్తుకురావటం. చార్‌ ధామ్‌నుంచి బతికి బయిట పడ్డవారికోసం పర్వతం లాంటి ఎయిర్‌ ఇండియా విమానం తీసుకొచ్చాను. కానీ చంద్రబాబు ఏంచేశాడు? పిచ్చుక లాంటి ప్రయివేటు విమానం తెచ్చి ఎక్కమంటున్నాడు. రాజకీయాల్లోనూ హనుమంతుణ్ణే. నా ముందు బాబు కుప్పిగంతులా?

హాబీలు :1. ‘గొట్టాలు’ కనబడితే ఆగి పోవటం, ఏదో ఒక ప్రకటన చేయటం. నిత్యం మీడియాలో వుండటం.

2.ఢిల్లీలో వుండి గల్లీ రాజకీయాలు చేయటం.

నచ్చని విషయం :చంద్రబాబు ఇప్పటికీ తానే ముఖ్యమంత్రినని భావించటం. లేకపోతే, ప్రభుత్వం చేయాల్సిస సహాయక చర్యలను ఆయన చేయటమేమిటో..?

మిత్రులు : ఎప్పటికయినా మీడియా వారే. లేకుంటే నేనూ రాథోడూ చేసుకున్నది చిన్న ఫైటు. దేశవ్యాపితంగా ఎంతటి ప్రచారమిచ్చారు?

శత్రువులు :యాచకుడికి యాచకుడే శత్రువంటారు. కేదార్‌ నాథ్‌, బదరీ నాథ్‌ కొచ్చిన వారిని ఆదుకుని వోట్లు దండుకోవచ్చన్నది అన్ని పార్టీల లక్ష్యం. అలాంటప్పుడు రాజకీయం అంటే- గుడి ముందు బిచ్చగాళ్ళ- తన్నులాట లాగానే వుంటుంది.

జపించే మంత్రం : కాంగ్రెస్‌ కు కావాల్సింది యువనాయకత్వం. ఇంత లేటు వయసులోనూ నాలో యువరక్తమే ప్రవహిస్తుందని ఈ పాటికి రాహుల్‌ గాంధీ గుర్తించే వుంటారు. మీకు నమ్మకం లేకపోతే, ‘యూ ట్యూబ్‌’లో రాథోడ్‌ తో నేను చేసిన ‘బాక్సింగ్‌’ చూడండి.

విలాసం : గాలి. ఐ మీన్‌ ఎయిర్‌ .. ఎయిర్‌ ఇండియా. అదే నా విలాసం. ఢిల్లీటూ హైదరాబాద్‌, హైదరాబాద్‌ టు ఢిల్లీ.

గురువు : ఎందులోనూ ‘బాక్సింగ్‌’ లోనా..? అబ్బే ఎవరూ లేరు.

జీవిత ధ్యేయం : ఏమో! ఏ వయసులో ఏమొస్తుందో ఎవరికి తెలుసు. కురు వృధ్దులయ్యాకనే కదా- పి.వి. నరసింహారావు ప్రధాని, రోశయ్య ముఖ్యమంత్రీ అయ్యిందీ…! అలాగా నాకో ఒక రోజు రాకపోతుందా..?!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 29 జూన్ -4 జూలై 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply