వైర్ లెస్..!

ఇంట్రో

చిన్న చిటికెన వేలు. ఎవరిదయినా కావచ్చు. కట్టుకట్టి వుంటుంది. గాయం ఎక్కడో వుంటుంది. కట్టు లోపలి, గాజు గుడ్డ లోపలి, దూది లోపలి, టింక్చర్‌ మరకల లోపల ఎక్కడో…! కనిపించనే కనిపించదు. కానీ తెగి వుంటుందన్న ఊహ; రెండు మూడు బొట్లు నెత్తురు కారి వుంటుందన్న ఎరుక! ఈ పిల్లెవరో ఏడ్చే వుంటుంది. ఆవిరయిన కన్నీటి ఆనవాలు కూడా లేదు. అయినా ఎందుకొస్తుంది దిగులు? ‘పాపా నీ కట్టు మీద చిన్న ముద్దు పెట్టనా?’ ఇలా అనలేక పోతున్నందుకు దిగులు ద్విగుణీకృతమవుతోంది. టీవీ పెట్టుకుని రియాల్టీషో చూద్దామనుకున్నా, బుల్లి తెరమీద కూడా ఈ పాపే..!

ఎవరి గాయం

వారికే బాధయితే

నిజంగా బాగుండేది.

బాధ తెలియటానికి

ఏం కావాలి..

ఒక్క స్పర్శ తప్ప!

బాధ తెలియకుండా వుండటానికి కూడా

ఏం కావాలి?

ఒక్క మత్తు తప్ప!

స్పర్శను మించిన స్పర్శ వుంది.

అదే ప్రేమ.

బిడ్డ నొప్పి తండ్రికి

పంపగలిగే అదృశ్య తంత్రి అదే నేమో!

అదే వుంటే..

గాయమెవరిదయినా కావచ్చు..

వేదన మనకు చేరుతుంది!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 15-21 మే 2015 వ సంచిక లోప్రచురితం)

4 comments for “వైర్ లెస్..!

  1. వర్మ.కలిదిండి( నేను మాత్రం ఇద్దరిని) says:

    నిజమే మరి బిడ్డ నొప్పి తండ్రికి చేరే తంత్రి ఏదో ఉంది ఈ లోకంలో … ఉదయాన్నే మంచి కవిత చదివాను …ధన్యవాదాలు

  2. ఎదుటివాడి గాయానికి నీ గుండె ద్రవించగలిగితే ఏ కష్టమూ పెద్దదిగా అనిపించదు

Leave a Reply