శత్రువు లేని వాణ్ణి నమ్మటం కష్టం. శత్రువు లేని వాడికి మిత్రులు కూడా వుండరు. నా ఇష్టాలూ, నా అభిప్రాయాలూ, నా తిక్కలూ వున్న వాళ్ళే నాకు మిత్రులవుతారు. నా మిత్రులకు పడని వాళ్ళంటే నా అభిప్రాయాలు పడని వాళ్ళే. శత్రువు లేని వాడంటే ఒకటే అర్థం- సొంత అభిప్రాయం లేనివాడని. అందుకే అజాత శత్రువు(ధర్మరాజును) సొంత ఆలి కూడా నమ్మదు. ఏదో ఒక రోజు-‘నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా?’ అని అడుగుతుంది. పగపట్టటం చేతకాని వాడికి, ప్రేమించటమూ రాదు.
కౌగలించేది
చేతుల్తోనూ కాదు.
పరుగెత్తేదీ
కాళ్ళతోనూ కాదు
ప్రేమకయినా
పగనయినా
సిధ్ధమయ్యేది ఒక్కటే
పిడికెడు గుండె!
– సతీష్ చందర్
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
excellent sir..
మనుషుల్లో లేనిది.. మనసుల్లో లేనిది.. ఇదే!