ఇది నాదీ, అనేసుకున్నాడు వాడు. వాడిది అయిపోవాలి- అంతే. వాడే కదా చాలా బాలీ, టాలీ, వెరసి ‘జాలీ’ వుడ్ సినిమాలో హీరో! వాడు ‘అదీ, ఇదీ’ అని పిలిచేది, వస్తువునే కాదు, మనిషిని-ఆడమనిషిని- కూడా. వాడి మాటకీ, చేతకీ తేడా వుండదు. ఎలా పిలిచాడో, అలాగే చూస్తాడు. ఈ బైక్ నాదీ అన్నట్లే, ఈ పిల్ల నాదీ అనేస్తాడు.
ఎప్పుడూ జరిగే కథ
ఆ అమ్మాయి బీటెక్ చదవవచ్చు; ఎంటెక్ చదవవచ్చు. వాడు ఏ తొమ్మిదో తరగతి దగ్గరో పుస్తకం విసిరేసి, కటింగ్ ప్లేయర్ పట్టి, మెకానిక్ షాపులో చేరవచ్చు. వాడి పేరును (తొమ్మిదే అక్షరాలు వున్న పేరును) వాడు ఇంగ్లీషులోనే కాదు- తేట తెలుగులో కూడా- తొంభయి తొమ్మిది తప్పులతో రాయవచ్చు. ‘నాదీ అని మోజు పడటాన్ని’ కూడా తన భాషలో ఏమంటారో కూడా వాడు చెప్పలేక పోవచ్చు. ‘వస్తు భాష’కు అక్షరంతో పనివుండదు. ఒక్క ‘మొబైల్’ చాలు. అందులో కమ్యూనికేట్ చెయ్యటానికి నూటొక్క సామాజిక మాధ్యమాలు. వాడే వాడి వాడకాన్ని బట్టి అవి ‘కామా’జిక మాధ్యమాలుగా కూడా మారిపోతాయి. బొమ్మలూ, సంకేతాలూ, ‘ఈమోజీ’లూ, ‘కామో’జీలూ, వాడి అవసరానికి సరిపడా వుంటాయి. ‘వేలి’ ముద్ర లతో సంభాషణలతో కొనసాగించవచ్చు. వీడు ‘చదువరేమో’ అని అనుమాన పడి, అమ్మాయి సంభాషణ కొససాగించిందో అంతే సంగతులు! తర్వాత కలుద్దామంటాడు. తీరా కలిశాక, వాడి దివ్వమంగళ స్వరూపం కనిపిస్తుంది. ‘ఫోర్ ట్వంటీ’కి జీన్ ఫ్యాంటూ, టీ షర్టూ వేసినట్టుంటాడు. మాట్లాడిస్తే, వాడి ‘డ్రాప్ అవుట్’ భాష తెలిసిపోతుంది. సరిగ్గా అప్పుడు చెబుతాడు, ‘లవ్వు’ అనే ఒకే ఒక ముక్కను. ఆమెకు నవ్వాలో, ఏడ్వాలో తెలియదు. వాణ్ణి ఏ భాషలో ‘ఛీ’కొట్టాలో తెలియదు. మొత్తానికి ‘నో’ అంటుంది. అదేమిటి? ‘వస్తువు’ కూడా ‘నో’ అంటుందా? వాడికి నచ్చదు. అంతే, వేట కత్తినో, యాసిడ్ బాటిల్ నో తెచ్చుకుంటాడు. పొడిచేస్తాడు; లేదా విసిరేస్తాడు. ఇదీ ఎప్పుడూ జరిగే ‘ప్రేమోన్మాదం’ కథ.
కులోన్మాదం కలిస్తే..!
పంద్రాగస్టున, డెభయ్యయిదవ స్వాతంత్య్ర వేడుక నాడు, పట్టపగలు, గుంటూరు వద్ద, ఎన్. రమ్య అనే బీటెక్ చదివే అమ్మాయిని, ఇలాగే కుంచాల శశికృష్ణ అనే తొమ్మిదో తరగతి చదివి, మానేసిన డ్రాప్ అవుట్, ఇదే కారణం మీద, ఇలాగే హతమార్చాడు. అతడూ ఆమెను వస్తువనుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ లో ‘ఇన్‌స్టెంట్’ గా మోజు పడ్డాడు. తీరా కలిశాక, ఇలాగే ప్రేమ ఊసు తెచ్చాడు. కాదని, అతనికి దూరంగా వుంది. ఫోన్‌లో కూడా లభ్యం కాలేదు. కడకు ఆమె చదివే కాలేజ్ క్యాంపస్‌కు అతడు వెళ్ళినా, తప్పించుకున్నది. కానీ పెదకాకాని వద్ద, టిఫిన్ (బ్రేక్ ఫాస్ట్) తెస్తూ రోడ్డు మీద కనిపించినప్పుడు , ఆమెను అడ్డగించి, ఆమె చేతిలో వున్న మొబైల్ లాక్కున్నాడు. ఇంటిలో టిఫిన్ ప్యాకెట్ ఇచ్చి, తిరిగి తన మొబైల్ కోసం వస్తే, తన బైక్ ఎక్కమని బలవంత పెట్టాడు. ఆమె ఒప్పుకోక, పెనుగులాడి మొబైల్ తీసుకుంది. కానీ, అప్పటికే సిధ్ధంగా వచ్చిన శశికృష్ణ, కత్తి తీసి, ఆమెను ఆరు కత్తి పోట్లు పొడిచాడు. చుట్టూ జనం నిశ్శేష్టులయి చూశారు. అడ్డగించలేదు. తర్వాత పోలీసులు రంగంలోకి వచ్చినా, ఆమె ప్రాణం దక్కలేదు. పారిపోతున్న అతణ్ణి పట్టుకున్నారు.
ఇప్పుడు ఇతణ్ణి ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న అక్కడ (ఘటన దగ్గర) లేని జనం వేస్తున్నారు. మరీ ముఖ్యంగా డిజిటల్ మాధ్యమాల్లో ఆవేశపడుతున్నారు. చంపమంటున్నారు. ఉరితీయమంటున్నారు. న్యాయాన్ని కూడా ‘ఇన్‌స్టంట్’గా ఇవ్వమంటున్నారు. ‘ఎన్‌కౌంటర్’ చెయ్యమంటున్నారు. ‘దిశ’ కు చేసిన ‘న్యాయం’ చెయ్యమంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ పేరు మీదనే చట్టం చేసుకున్నది. ‘దిశ’ కోన్యాయం, ‘రమ్య’ కో న్యాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు- మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం- ఆవేశానికి హద్దులు లేవు. అరెస్టులవుతున్నారు. వారి రాజకీయ అవసరాలు వారివి.
నిజమే. రమ్య హత్య కేవలం ఎప్పుడూ జరిగే ‘ప్రేమోన్మాద’ హత్య మాత్రమే కాదు; ‘కులోన్మాద’ హత్య కూడా. ‘ప్రేమోన్మాది’ ఆడపిల్లను ‘వస్తువు’గానే చూస్తాడు. ‘కులోన్మాది’ బానిసగా కూడా చూస్తాడు. వెరసి, కోరుకుంటూ వచ్చి ఒళ్లో వాలే ‘చవకబారు వస్తువు’గా చూస్తాడు. రమ్య దళిత యువతి. చూడ్డానికి తొమ్మిది తప్పిన వాడికి, బిటెక్ అమ్మాయితో ప్రేమ ఏమిటి? అని అనిపిస్తుంది. విద్యాపరంగా అతడి ‘హీన’ స్థాయి; ఆమెది ‘ఉన్నత’ స్థాయి. కానీ సదరు, ‘డ్రాప్ అవుట్’ తలకిందులుగా కూడా ఆలోచించి వుండాలి. కుల పరంగా తాను ఒక మెట్టు ఎక్కువ అని అనుకుని వుండాలి. శశికృష్ణ ‘వడ్డెర’ కులస్తుడు. చట్ట పరిభాషలో ఆమె ఎస్సీ, అతడు బీసీ. ఎంత చదివినా అతడి దృష్టి లో ఆమె ‘ఊరు వెలుపలి’ అమ్మాయి. ‘ఆమె కూడా తిరస్కరించటమేమిటి?’ అనే అహంభావం అతడిని కమ్మి వుండాలి. ఇది సామాజిక వాస్తవం.
ఎస్సీ,ఎస్టీ ఆట్రాసిటీ చట్టాన్ని వర్తింప చేసేటప్పుడు, దర్యాప్తు ఈ కోణంలోనుంచి జరగాలి. ముద్దాయిని ఈ అంశాలపై ‘ఇంటారాగేట్’ చెయ్యాలి.
ఆ ఘటనలు వేరు!
గతంలో రెండు దశాబ్దాలుగా, రెండు తెలుగు (ప్రాంతాల్లో) రాష్ట్రాల్లో ఎన్నో ప్రేమోన్మాద హత్యలు జరిగాయి. అక్కడా ఇలాగే ‘డ్రాప్ అవుట్‌లో, ఆమ్మాయి కన్నా తక్కువ చదివిన వాళ్ళో ‘ప్రేమ’ అంటూ వెంటపడ్డారు. ఆమెతో స్కూల్లోనో, హైస్కూల్లోనో కలసి చదివిన నేపథ్యమో, ఆమె ఇంటికి పొరుగున వున్న గతమో వుండేది. పలు సందర్భాల్లో అతడు కూడా ఆమె కులానికి చెందిన వాడో అయి వుండే వాడు. అందు చేత ‘కుల’ ప్రస్తావన వుండేది కాదు. కానీ, శశికృష్ణ తెగబడిన తీరులో ‘కులం’ కనిపిస్తోంది.
పైపెచ్చు, ఈ రెండు రాష్ట్రాలలో కులం దాటి ‘పిల్లలు ప్రేమించుకుంటే’ పెద్దలు ఊగిపోయి, కత్తులతో నరికేస్తున్నారు. అవే కదా ‘పరువు హత్యలు’! ఇదీ హత్యే అయినా, పరువు హత్యలకు బదులు ‘దిశ’ అత్యాచారం కేసును స్పుÛరణకు తెచ్చుకుంటున్నారంతా.
బానిస వస్తవుయితే..!
మన వ్యవసాయ సమాజంలో స్త్రీని ‘లైంగిక బానిస’గా చూడటం మామూలే. అదే సమాజంలోదళిత స్త్రీలను( జోగిని, మాతంగులను) ‘ఊరుమ్మడి లైంగిక బానిస’లుగా కూడా చూశారు. ఈ సమాజం పెద్దగా మారకుండానే, మార్కెట్ వచ్చి పడింది. అప్పుడు స్త్రీని ‘వస్తువు’ గా మార్చి చూపించింది. అలాంటప్పుడు మనదేశంలో వున్న వ్యవసాయ సమాజం దళిత స్త్రీని ఎలా చూస్తుంది? ఊహకు అందనిది కాదు. ‘ఊరుమ్మడి లైంగిక వస్తువు’ గా చూడాలని ఉబలాట పడుతుంది. అంతే తేడా. శశికృష్ణ అనే వాడు కూడా అలాగే చూసి వుండాలి.
ఇన్ స్టంట్ న్యాయం?
రమ్య కథ హత్యతో ముగిసింది కాబట్టి, ఆవేశాలు తారాస్థాయిలో వున్నాయి. ఇలా హత్యవైపు చేరుతున్న పలు విద్యావంతులయిన దళిత యువతుల రక్షణకు పరిష్కారం కూడా ఆలోచించాలి.ఈలోగా, ‘ఇన్‌స్టెంట్’ న్యాయాలతో ఆవేశాలు తీర్చేసుకుని, మరో కొత్త హత్య జరిగినప్పుడు, మరో మారు ఆవేశ పడటం తప్ప మనం చెయ్యగలింది వేరే ఏమీ లేదా?
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 21-28 ఆగస్టు 2021 సంచికలో ప్రచురితం.)
బాగా వర్ణించారు సార్.