నత్తనడక న్యాయానికి ‘ఎన్‌కౌంటర్‌’ విరుగుడా..?

ఎక్కడ చంపారో, అక్కడే చచ్చారు. అది కూడా పదిరోజుల్లో. ఇదీ న్యాయం! అసలు న్యాయమంటేనే ఇలా వుండాలి!?

మరి? వాళ్ళు చేసింది మామూలు నేరమా? ఆ రోజు (నవంబరు 27) రాత్రి, షాద్‌ నగర్‌ వద్ద వెటర్నరీ డాక్టర్‌ ‘దిశ’ను ఎత్తుకు వెళ్ళి, అత్యాచారం చేసి, హత్య చేసి, తగులబెట్టారు. ఇంత నీచమైన నేరం చేసిన ఆ నలుగుర్నీ (ఆరిఫ్‌, శివ, నవీన్‌. చెన్నకేశవుల్నీ) పదవరోజు (డిశంబరు6) తెల్లవారు ఝామున వారిని పోలీసులు తమ ‘ప్రాణరక్షణార్థం’ ‘ఎదురు కాల్పులు’ చేశారు. ఫలితంగా ఆ నలుగురూ పోయారు.

ఈ దుర్మార్గానికి పాల్పడ్డవారికి ఏ శిక్ష వేసినా తక్కువే. మరణానికి మించిన శిక్ష ఏదయినా వుంటే బాగుండునని కూడా అనిపించింది సిటిజన్లకి. నెటిజన్లకయితే ఆగ్రహం పోస్టులూ, వీడియోల రూపంలో కట్టలు తెంచుకుంది. మన శిక్షాస్మృతిలోలేని శిక్షల్ని సైతం కనిపెట్టారు. నిత్యమూ హిందూ సంస్కృతిని కీర్తించే వారుకూడా, ముస్లిం దేశాల్లోని ‘శిక్షా సంస్కృతి’ ని వేనోళ్ళ కొనియాడారు. బహిరంగ శిరచ్చేదనాలు చెయ్యాలనటమే కాదు, అలాంటి వీడియోలను కూడా చూపించారు. వీరి ‘విదేశభక్తి’ని తట్టుకోలేని కొందరు, ఈ మాత్రం శిక్షలు మన దేశంలో మాత్రం లేవా? కాకపోతే, రాచరికాలూ, నియంతృత్వాలూ నడిచే మధ్యయుగాల్లో వుండే వని గుర్తు చేశారు. అయినా ఇప్పుడు మాత్రం మన దేశంలో ‘ఉరిశిక్ష’ లేదా..? ఇంకొందరన్నారు. నేర నిరూపణ అయితే ఉరి పడి తీరుతుందన్నారు. కానీ అది ఎప్పుడు పడేనూ.. వారు ఎప్పుడు ఉరికంబం ఎక్కేనూ..? అని నిట్టూర్చేశారు. అంతెందుకు. ఢిల్లీలో(2012లో) ఇంతే పాశవికంగా నడుస్తున్న తన స్నేహితుడి ముందే నిర్భయ పై బస్సులో ఒకరి తర్వాత, ఒకరు అత్యాచారం చేసి,అర్థరాత్రి నగ్నంగా కొరప్రాణంతో కిందకు విసిరేశారు. ఆమె తర్వాత మరణించింది. ఇందుకు దేశం మొత్తం విస్తుబోయింది. యువతీ,యువకులు ఢిల్లీని ముట్టడించారు. కానీ ఏమయ్యింది? నిందితులను అరెస్టు చేశారు. జైల్లో పెట్టారు. ఒకడేమో తానింకా ‘చంటి కూచి'(బాల నేరస్తుడి)నే అని చక్కాపోయాడు. ఇంకొకడు వాడంతట వాడు పైకి పోయాడు. మిగిలిన వారు సజీవంగానే వున్నారు. అందుకే దిశ నిందితుల్ని ‘ఎదురుకాల్పుల్లో’ (ఎన్‌కౌంటర్లో) పోలీసులు చంపేశారని తెలియగానే నిర్భయ తల్లి చేసిన వ్యాఖ్య ఆలోచించదగ్గది: ‘నా కూతురి(నిర్భయ)కి ఏడేళ్ళయినా జరగని న్యాయం, దిశకు ఏడు(వాస్తవానికి పది) రోజుల్లో జరిగింది.

ఎన్ కౌంటర్ లో మరణించిన అత్యాచార నిందితులు

కానీ ‘నిర్భయ’ పేరుమీద బిల్లు తేవటానికి జస్టిస్‌ వర్మ కమిషన్‌ వేశారు. అత్యాచార నేరాలను నిరోధించటానికీ, జరిగితే దర్యాప్తు వేగవంతం కావటానికి కావలసిన మార్పులతో నిర్భయ చట్టం తెచ్చారు. శిక్ష కఠినంగా వుండాలని ఉభయ సభల్లోని మెజారిటీ సభ్యులు- జస్టిస్‌ వర్మ వద్దన్నా-మరణ శిక్ష ను చేర్చారు. ( మరణ శిక్ష వద్దనటంలో జస్టిస్‌ వర్మ భయం వేరు. అత్యాచారం చేస్తే చంపేస్తారన్న అనుమానంతో, నిందితులు ఆధారాలు తుడిచేస్తారు. అంటే ప్రధాన ఆధారమైన రేప్‌ బాధితురాలిని వెంటనే చంపేస్తారు. ఈ భయాన్ని దృష్టిలో వుంచుకునే కొందరు మహిళా నేతలు ‘మరణ శిక్ష’ వల్ల రేపిస్టులు మొత్తానికే చట్టానికి దొరకటం లేదన్నారు. కానీ ఇలా అన్నందుకు వీరేదో రేపిస్టుల పట్ల సానుభూతితో మాట్లాడుతున్నారని భావించి, వారి పట్ల అసభ్యకరమైన పోస్టులు సోషల్‌ మీడియాలో పెట్టారు. బూతులు తిట్టారు. కొందరు ‘మగ పుంగవుల’యితే, వారినీ, వారి పిల్లల్నీ కూడా ‘రేప్‌’ చేస్తామన్న అర్థాలతో వారిని వేధించారు. ఆమేరకు ఆ మహిళా నేతలు కూడా ఫిర్యాదులు చేశారు. ‘రేప్‌’ మీద వచ్చిన ఆగ్రహాన్ని ‘రేప్‌’తో తీర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా, ‘న్యాయం కోరే సమూహాల్లో’ కలిసి పోవటం దురదృష్టకరం.)

ఎలా చూసినా ‘రేపిస్టులు’ తప్పించుకునే తిరుగుతున్నారు. చట్టానికి దొరికినా కూడా, విచారణ వరకూ రావటంలేదు. విచారణకొచ్చినా వారిని ఆధారాలు లేవని వదలివేస్తున్నారు. ఎవరో కొద్దిమందికే శిక్షలు పడుతున్నాయి. ‘రాయటర్‌ ‘ వార్తాసంస్థ ఈ విషయంలో ఆసక్తి కరమైన గణాంకాలను మచ్చుకు కొన్ని బయిట పెట్టింది. 2017లో దేశం మొత్తం మీద 32,500 కేసులు నమోదయ్యాయి. ఇందులో 30 శాతం మంది బాధితులు పసిపిల్లలే. అప్పటికే అత్యాచార కేసులు కోర్టుల్లో పేరుకు పోయాయి. ఆ ఏడాది కోర్టులు పరిష్కరించగా ఇంకే విచారించాల్సిన కేసులు 1,27,800. ఇవన్నీ రిపోర్టయి కోర్టుల్లో న్యాయం కోసం చూస్తున్న కేసులు. ఇక రిపోర్టు కానివి ఎన్నో. లైంగిక హింస కేసుల్లో నూటికి తొంభయి తొమ్మిది కేసులు రిపోర్టే కావు. ఇలాంటప్పుడు ఎవరికయినా ‘పది రోజుల సత్వర న్యాయం’ గొప్ప ఊరట నిస్తుంది.

కానీ విషాదమేమంటే ఈ ఊరట ఆ కొద్దిసేపే. ‘ఎవ్వడయినా ఈ నీచానికి పాల్పడితే ఇదే గతి పడుతుంది’ అని అనుకుని, తేరుకుని, సిటిజన్లూ, నెటిజన్లూ ఎవరి పనుల్లో వారు పడిపోతారు.

ఇక పోలీసులు ఇచ్చే ఈ ‘ఎన్‌కౌంటర్‌’ న్యాయం ఫలితాలు ఒక్కసారి చూద్దాం. పదకొండేళ్ళ క్రితం వరంగల్‌లో స్వప్నిక, ప్రణితల మీద యాసిడ్‌ దాడికి పాల్పడిన ‘ప్రేమోన్మాది’ శ్రీనివాసరావు నూ అతనికి సహకరించిన ఇద్దరినీ ఇదే విధంగా ‘ఎన్‌కౌంటర్‌’ అనే ‘శిక్ష’ విధించేశారు పోలీసులు. కానీ ఇప్పటికీ దేశంలో ‘ప్రేమోన్మాదుల’ దాడులు జరుగుతున్నాయి. ఈ తర్వాత పెరిగాయి కూడా. సమయానికి యాసిడ్‌ దొరక్క పోతే కొబ్బరి బొండాల కత్తితో కూడా హతమార్చేస్తున్నారు.

న్యాయం చెయ్యమంటున్న టేకు లక్ష్మి కొడుకులు

అప్పటి ఎన్‌కౌంటర్‌కీ, ఇప్పటి ఎన్‌కౌంటర్‌కీ సూత్రధారులు ఒక్కరే. అందుకే కాబోలు జరిగిన తీరు కూడా ఒకేలా వుంది. ఇంతకీ ‘ఎన్‌కౌంటర్‌’ అన్నది శిక్షేనా..?! అయితే ఈ శిక్షను- ఇంతకన్నా రెండు రోజుల ముందు కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ జిల్లా ,లింగా పూర్‌ మండలంలో టేకు లక్ష్మి అనే  గిరిజన మహిళపై ఇలాగే అత్యాచారంజరిపి, హత్యచేసి పోలీసులకు పట్టుపడ్డ -ముగ్గురు నిందితులకు వెయ్యాలి. (ఆమె పై ఈ అఘాయిత్యం- ‘దిశ’ పై జరగటానికి రెండు రోజుల ముందే నవంబరు 25న- జరిగింది.) ఏమో వేస్తారేమో..!?

అత్యాచారం, హత్య జరిగిన ప్రతీసారీ పోలీసులు ఇలా ‘ప్రాణాపాయంలో’ పడి, ‘రక్షణ’ కోసం కాల్పులు జరిపి, ప్రమాదవశాత్తూ మాత్రమే ‘తూటాలు’ దిగటంతో నిందితులు చనిపోవాలని కోరుకోవాల్సిందేనా.? ఆవేశం చల్లారింది కదా! ఇక ఆలోచించ వచ్చేమో…!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర 7-13 డిశంబరు 2019 సంచికలో ప్రచురితం)

Leave a Reply