ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గ్రహం? ఎవరు ఉపగ్రహం? బీజేపీ, తెలుగుదేశం పార్టీల విషయంలో పరిశీలకులకు కలుగుతున్న సందేహమిది. రెంటి మధ్యా ‘వియ్యమూ’ కొత్త కాదూ, ‘విడాకులూ’ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ‘కాపురం’ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు బీజేపీని పూర్తిగా దూరం పెట్టినా, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో ‘దాగుడు మూతలు’ ఆడుతూనే వున్నారు. ఆయనకి ఈ పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. అవసరమున్నప్పుడేమో పూర్తి ‘దేశభక్త’ పార్టీలాగా కనిపిస్తుంది. అవసరం తీరిపోయాక ‘మతతత్వ పార్టీ’ లాగా కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ అవసరం ఆయనకు అత్యంత తీవ్రంగా కనిపించింది. ఇంతకన్నా పెద్ద అవసరం ఆయనకు 1999లో కూడా వచ్చిపడింది. ఆప్పడూ కూడా ‘పొత్తు’ పెట్టేసుకున్నారు.
‘దేశాని‘ది ’ఉప‘ గ్రహస్థితి
కానీ పొత్తులో ఎవరి మాట ఎవరు వినాలి? ఇది పెద్దసమస్య. 1999 లో ఆప్పటి వాజ్‌పేయీ సర్కారుకు ఆయన వెలుపలి నుంచి మద్దతు ఇచ్చారు. అంతే కాదు, టీడీపీ మద్దతు కూడా సంఖ్యాపరంగా అప్పటి ‘సంకీర్ణ’ సర్కారుకు కీలకమయ్యింది. అప్పటి వీరి కాపురంలో, బాబుది ఆడింది అటలాగా, పాడింది పాటలాగా సాగింది. ప్రధానిగా వున్న వాజ్ పేయీ అప్పటి (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేతల మాటల్ని పెడ చెవిన పెట్టి, చంద్రబాబు మాటే వింటూవుండే వారు. ఈ విషయంలో అప్పటి బీజేపీ రాష్ట్ర నేతలు తమ అసంతృప్తిని వీలయిన సందర్బాల్లో తమ పార్టీ వేదికల మీద వ్యక్తం చేస్తూనే వుండేవారు. అంటే అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం చుట్టూ, బీజేపీయే తిరిగేది. అంటే అప్పుడు తెలుగుదేశం గ్రహమయితే, బీజేపీ ఉపగ్రహమన్నమాట.
దీని వల్ల నిజంగానే బీజేపీ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో కూడా బీజేపీతో పొత్తులేకుంటే, తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదు. ఈ విషయాన్ని అప్పటి సర్వేలూ, ఎన్నికల ఫలితాల్లో వోట్ల సరళులే అందుకు తార్కాణం. అప్పటి కార్గిల్ యుద్ధం బీజేపీకి దేశవ్యాపితంగా అనుకూలించింది. ఆ గాలే, ఇక్కడ దానితో చెలిమి చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించింది. అప్పుడే కనుక బీజేపీ రాష్ట్ర శాఖ స్వతంత్రంగా వ్యవహరించి వుంటే, అప్పుడే ఆ పార్టీ రెండు ప్రాంతాలలోనూ ( సీమాంధ్ర, తెలంగాణలలోనూ) బలపడి వుండేది. అప్పుడు కూడా, రెండు పార్టీలకూ అనుసంధాన కర్తగా బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడే వుంటూవుండేవారు.
అయితే ఇప్పటి పరిస్థితి వేరు. బీజేపీ చుట్టూనే, తెలుగుదేశం పార్టీ పరిభ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం: బీజేపీ అసవరం తెలుగుదేశం పార్టీకి వుంది కానీ, తెలుగుదేశం పార్టీ అవసరం బీజేపీకి లేదు. కాబట్టి నేడు బీజేపీయే గ్రహం; తెలుగుదేశం కేవలం ఉగ్రహం. అందుకని ఈసారి పాచికలాట, బీజేపీ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో అవసరమయితే, తెలుగుదేశం పార్టీని పక్కన బెట్టి, బీజేపీ ఎదుగుదామని చూస్తోంది. అందుకు మూడంచెల వ్యూహాన్ని రచించుకున్నట్టు స్పష్టమవుతూనే వుంది.
ఒకటి: 2014 ఎన్నికల్లో ఓటమికి కకావికలమయిన సీనియర్ కాంగ్రెస్ నేతలకి ‘కాషాయ’ తీర్థం ఇప్పించటం. గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ చేరిక ఇందుకు తాజా ఉదాహరణ.
రెండు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పేరుకు మిత్ర పక్షం గా వున్నా, తీరుకు ప్రతిపక్షంగా వుండటం. రైతులకు జరిగే అన్యాయానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలని బీజేపీ ఉవ్విళ్ళూరటం ఈ వ్యూహంలో భాగమే. ఈ విషయంలోనే బీజేపీనీ మంత్రి రావెల కిషోర్‌బాబు బాహాటంగా విమర్శించారని, చంద్రబాబు ఆయనను మందలించినట్లు(?) మీడియా కథనాలు వచ్చాయి.
మూడు: కాస్త సుదూర భవిష్యత్తులోనయినా ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతల్ని ఆకర్షించటం. కొణతాల రామకృష్ట వైయస్సార్సీపీతో తెగతెంపులు చేసుకోవటం ఇందుకు తాజాఉదాహరణ.
ఈ మూడంచెంల వ్యూహాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు నాయుడు ఏదయినా ప్రతివ్యూహాన్ని రచించగలరా? కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యాన్ని మరింత పెంచటం వల్ల, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ నుంచి వివిధ కారణాల వల్ల వెలుపలికి వస్తున్న నేతలు, బీజేపీ వైపు పోకుండా, తెలుగుదేశం వైపు తిప్పుకోగలరా? ఇది శక్తియుక్తులకూ, వ్యూహప్రతివ్యూహాలకు సంబంధించిన ప్రశ్న కాదు; కేవలం విశ్వసనీయతకు సబంధించిన సమస్య. కాబట్టి వేచి చూడాల్సిందే.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)
అనుగ్రహం నుంచి మొదలైన ప్రయాణం ఆగ్రహానికి చేరుకున్నట్లుది కదండీ!!
నిగ్రహం కొల్పోతే శిలావిగ్రహమే మిగులుతుంది!!