‘బీమా’ సేనులు!

‘ప్రాణ వాయువు లేక పోయినా బతకొచ్చు.
కట్టుకున్న పెళ్ళాం పక్కింటి వాడితో లేచిపోయినా బతకొచ్చు.
కానీ…
పదవి లేక పోతే ఎలా?’
అప్పుడెప్పుడో వచ్చిన ‘ప్రజానాయకుడు’ అని ఒక మహాపాత చిత్రంలో నాగభూషణం అన్న మాటలు.
ఇప్పుడు చూడండి. తాగేసిన కూల్‌ డ్రింక్‌లో స్ట్రాలాగా, ముఖం తుడుచేసుకున్న టిష్యూ పేపర్‌లాగా, చూసేసిన సినిమా టికెట్‌లాగా.. రాజీనామా పత్రాలను విసిరేస్తున్నారు మన ప్రజాప్రతినిథులు.
రాజీనామా అంటే అంత చులకనయి పోయిందా? ఇప్పుడయితే ఒకే ప్రాంతం వారు చేశారు. ఏడాది క్రితం అన్ని ప్రాంతాల వారూ చేశారు.
ఇంత మంది త్యాగధనులు నడిచే గడ్డ మీద నడుస్తున్నందుకూ, వీరు పీల్చుకుంటున్న గాలిని మనమూ పీల్చుకున్నందుకు, తాగుతున్న నీరును (నీరు మాత్రమే సుమండీ) మనమూ తాగుతున్నందుకు మనమూ గర్వపడాలి.
స్వతంత్ర భారత చరిత్రలో ఇంత వీరోచితంగా రాజీనామా చేసిన వారిని చెప్పుకోవాలంటే, లాల్‌ బహదూర్‌ శాస్త్రిలాంటి ఒకర్నో, ఇద్దర్నో ఉటంకించాల్సి వచ్చేది. ఇప్పుడయితే వీరచరితుల జాబితా పెరిగిపోతోంది.
ధర్మనిరతులయిన పాండవులు అయిదుగురున్నారంటేనే మనసు పొంగిపోతుంది. అలాంటి వారి సంఖ్య కూడా వంద దాటిపోతున్నప్పుడు ప్రజల ఆనందానికి పట్టపగ్గాలుంటాయా?
చూడ బోతే యుగధర్మం మారినట్టుగానే వుంది. ఇంతకీ ఏ యుగం?
కంప్యూటర్‌ యుగమనో, హైటెక్‌ యుగమనో- చటుక్కున చెప్పేయకండి. అంత శాస్త్రీయ విభజనను తట్టుకునే స్థితిలో రాజకీయ పరిశీలకులు లేరు.
అలాగని త్రేతా, ద్వాపర, కలియుగాలనే పౌరాణిక విభజనకిందకు కూడా ఈ ధర్మం లొంగడం లేదు.
ఇంతకీ ఏమా యుగం?
బీమా యుగం. మీరు చదివింది నిజమే.
ఒక్క సారి రోడ్డు మీదకు వచ్చి చూడండి.
ఒకడు అడ్డంగా కారు పార్కు చేసి అదృశ్యమవుతాడు. కారు ఎవరన్నా ఎత్తుకుపోతే..?
ఆ కుర్రాడెవరో ఖరీదయిన బైకుతో అదే రోడ్డు మీద విమాన వేగంతో వెళ్ళిపోతుంటాడు. యాక్సిడెంటయితే..?
ఇంకొకతనెవరో ఫాంటు చొక్కా వేసుకున్న ఏనుగులా రోడ్డుపక్కన వున్న ఫాస్ట్‌ ఫుడ్‌ను ఆబగా మేసేస్తున్నాడు. గుండె నొప్పి వస్తే..?
కారు కు కారు, బైకుకు బైకు, గుండెకు గుండె…!
అన్నీ తిరిగొచ్చేస్తాయి. కాదు.. కాదు.. తిరిగిచ్చేస్తారు..బీమా కంపెనీల వారు.
హామీ వుంటే ఎంత వీరోచితంగానైనా జీవించవచ్చు. పక్కనే గజ ఈతగాళ్ళుంటే తెగించి మహాసముద్రంలోకి కూడా దూకెయ్యవచ్చు. విడాకుల లాయరు తెలుసుంటే, వెనకాముందూ చూసుకోకుండా పెళ్ళికూడా చేసుకోవచ్చు.
ఇప్పుడర్థమయిపోయింది కదా!
వాహన బీమా పథకం, , ఆరోగ్య బీమా పథకం…. ఇలాంటి పథకాల సరసన ఇప్పుడు ఇంకో పథకం చేరిపోయింది. దాని పేరే పదవి బీమా పథకం.
ఒక్క పదవికి పలు మార్లు బీమా వర్తిస్తుంది.
సభాపతులు ఈ రాజీనామాలను అంత ‘అర్రీ బుర్రీ’గా ఆమోదించరు. మూకుమ్మడి రాజీనామాలను దాదాపుగా ఆమోదించనే ఆమోదించరు.
ఒక వేళ ఆమోదించిరేని…,
ఉప ఎన్నిక లో వారిని ‘ఉచిత’ రీతిని( ఉద్యమతీవ్రతలో ఎన్నికకు ఖర్చుతక్కువే!) గెలిపించటానికి ఉద్యమకారులు హామీ పడతారు.
పోయిన పదవి, మరింత మెజారిటీతోనూ, కీర్తితోనూ చేతికి వస్తుంది.
కాబట్టే బీమా యుగంలో త్యాగధనులు కాని నేతలంటూ ఎవరూ వుండటం లేదు.
అందు చేతనే నేడు పదవిని ‘ప్రజానాయకుడు’లో నాగభూషణంలాగా ప్రాణవాయువుతో పోల్చలేక పోతున్నాను.
అయితే ఉద్యమకారులు మాత్రం వీరు పదవులు వదలినంత తేలిగ్గానే ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు.
కారు పోతే కారు వచ్చినట్టుగా, బైకు పోతే బైకు వచ్చినట్టుగా, పదవి పోతే పదవి వచ్చినట్టుగా… ప్రాణం పోతే ప్రాణం తిరిగి రావటం లేదు.
వీరికి ఎలాంటి బీమా లేదు.
ఇలా బీమా లేకుండా మరణించేవారు- ఎప్పుడూ పేదలే కావటం విచిత్రం.
వారిలో అట్టడుగు వర్ణాల వారే వుండటం మరీ విచిత్రం.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఉద్యోగాల్లో మాత్రమే వీరికి కొసరి కొసరి ‘కోటా’ ఇస్తారు కానీ, ప్రాణత్యాగాల్లో మాత్రం సింహభాగాన్నే రాసిస్తారు.
అయినప్పటికీ త్యాగధనుల జాబితాలో మాత్రం పదవీత్యాగం చేసి వారి పేర్లే నిలిచిపోతాయి.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రికలో 10 జులై 2011 నాడు ప్రచురితమయ్యింది)

Leave a Reply