మాట వున్నది, తప్పటానికే!!

kavuriమాట మీద నిలబడే వాడు మహా అయితే మామూలు మనిషి అవుతాడు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి సాదాసీదా మనుషులతో పనిలేదు.

‘దేశమంటే మనుజుల’ని పాపం- ఎప్పుడో కవిగారు అనుకున్నాడు కానీ, ‘ప్రజస్వామ్యం’ అంటే ప్రజలు మాత్రం కారు. ప్రజాస్వామ్యం- మూడు అంచెలుగా పనిచేస్తుంది. ఈ మాట ఎవరయినా చెబుతారు. పోటీ పరీక్షలకోసం ‘పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ చదివే కుర్రాడు కూడా చెబుతాడు- శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ- అని( నాలుగో శాఖ గా ‘మీడియా’ వుందన్న ‘అపోహ’ కూడా లేక పోలేదు.) ఇలాంటి పాఠ్యాంశాలను చదివేసి ప్రభుత్వోద్యోగం సంపాదించి చక్కబడిపోవాలి. కానీ ఇవే నిజమనుకుని, ఉద్యోగానికి రాజీనామా చేసి, పార్టీ పెట్టేసి, ప్రజాస్వామ్యంలోకి ఎవరయినా దిగిపోయారనుకోండి! వారు ఎన్నేళ్ళు వెతికినా ప్రజాస్వామ్యం దొరకదు.( అలా వెతుకుతున్న అమాయకపు చక్రవర్తుల్ని మనం చూస్తూనే వున్నాం.) ఈ మూడే ప్రజాస్వామ్యంగా భాసిల్లుతూ వుంటే, తప్పకుండా ప్రజాస్వామ్యానికి మనుషులతో పని పడేది.

రాజకీయాలను చూసి, విసిగి, వేసారి తల మాసిపోయిన ఓ ప్రసిధ్ద నాయకుడికి, ఓ రోజు నిజంగానే ప్రజాస్వామ్యం దర్శనం ఇచ్చింది. దానికి ‘మూడు ముఖాలు’ వున్నాయి. (‘సింహాల ముఖాలు కాదండోయ్‌). వాటినే ‘మూడు అంచెలు కాబోలు’ అని అనుకున్నాడు. ఇంతకీ ఆ మూడూ ఏమిటనుకున్నారు? మూడు ‘మ’లు. (ఇంగ్లీషులో అయితే మూడు ‘ఎమ్‌’లు): మనీ, మాఫియా, మీడియా. ఈ ముక్క చెప్పి రెండు దశాబ్దాలయి పోయింది. అప్పటికీ ఇప్పటికీ మార్పులేక పోలేదు. పూర్వం ఈ ‘మూడు పాత్రల్ని’ ముగ్గురు వేర్వేరు వ్యక్తులో, సంస్థలో పోషించేవారు లేదా పోషించేవి. కానీ అభివృధ్ధి ఏమిటంటే, ఈ మూడింటినీ ఒకే వ్యక్తి స్వీకరించగలడు. అప్పుడూ అతన్ని చూస్తే, ప్రజాస్వామ్యాన్ని చూడనవసరం లేదు. ముమ్మూర్తులా అతడే ప్రజాస్వామ్యం.

ఎలా చూసినా ప్రజాస్వామ్యానికి ఇలాంటి ‘మహానుభావుల’తో తప్ప మాటతప్పని చిన్న చిన్న మనుషులతో పనిలేదనిపిస్తుంది. కానీ వెంటనే ఓ సందేహం కూడా వస్తుంది. ఈ తరహా మనుషులతో పనిలేక పోతే, భారీయెత్తున జరిగే బహిరంగసభలకి జనమెలా వస్తారు? అంతంత మంది జనాన్ని ఎవరు తెస్తారు? వారిని రప్పించటానికి ఎవరు వాహనాలను అమరుస్తారు?

‘ఎవరు జనం? ఎవరు ప్రజలు? అంతా మిథ్య. అన్నీ నేనే. సర్వం నేనే.’ అంటాడు ప్రజాస్వామ్యంలో మహానేత.

కానీ ఈ జనంలో మామూలు మనుషుల బదులు, మళ్ళీ మూడంచెలుగా వ్యక్తులు వుంటారు: వోటరు, కేడరు, లీడరు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరికీ మాట మీద నిలబడాల్సిన అవసరం కానీ, నిలబడాలన్న దుగ్ధ కానీ లేదు.

వోటరు పుచ్చుకున్న ‘నోటు’ మీదా, కేడరు కొనుక్కొచ్చిన ‘నోటు’ మీదా నిలబడతాడు. లీడరు నిలబడడు, కూర్చుంటాడు- ‘సీటు’ మీద. ( నిలబడితే ప్రమాదం, మరెవ్వరన్నా వచ్చి కూర్చుండి పోరూ..!)

చెప్పాలంటే ఈ ముగ్గురికీ మాట తో పనిలేదు. వోటరు తెలివి మీరిపోయాడు. అతనిలో ఒకప్పుడుండే అమాయకపు మనిషి చచ్చిపోయాడు. తనకున్న ఒక్క వోటుకూ వోటరు టెండర్లను ఆహ్వానిస్తాడు. ఒక పార్టీ రు.300, ఇంకో పార్టీ రు.500, మరో పార్టీ రు.1000లు ‘కోట్‌ ‘ చేస్తుంది. ఎక్కువ కోట్‌ చేసిన వాడికే తన వోటు ఇస్తాడు. ( అఫ్‌ కోర్స్‌! మిగిలిన పార్టీలు ఇచ్చిన డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న రూలు అతన పెట్టుకోడు. ఎందుకంటే ముగ్గురికీ వోటు వేస్తాననే మాట ఇస్తాడు.)

ఇక కేడరు. ఒకప్పుడు ‘నాటు’ మీద నిలబడేవారు. ఇప్పుడు నాగరికత పెరిగింది. ఇప్పుడు ‘నీటు’ మీద నిలబడుతున్నారు. ‘నాటు’ అయినా ‘నీటు’ అయినా సరుకు, సరుకే, ఒకప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం( ప్రసాదు)లో కొనే వారు. ఇప్పుడు ‘బెల్టుషాపు’లో కొంటారు అంతే తేడా. ‘స్పిరిట్‌’.. ఐమీన్‌.. ‘చైతన్యం’ లేకుండా ‘కేడరు’ వుంటుందా చెప్పండి. అలా ‘చైతన్యవంతుల’య్యాక కాళ్ళ మీద నిలబడటమే కష్టమవుతుంది. ఇక మాట మీద ఎలా నిలబడతారు చెప్పండి!

ఇక లీడరు. ‘ఒపీనియన్స్‌ చేంజ్‌ చేయకుండా’ లీడరవుతాడా? ‘మాట’ మీద నిలబడితే మొదట్లోనే చతికిలబడతాడు.

మాటా, మాటా వచ్చి మూడున్నరేళ్ళ క్రితం రాష్ట్రంలో లీడర్లు మొత్తం రెండుగా చీలిపోయారు. ‘సమైక్యం’ అన్నారు సీమాంధ్రనేతలు. ‘ప్రత్యేకం’ అన్నారు తెలంగాణ నేతలు. ‘మాట’ మీద నిలబడే పెద్ద మనుషుల్లా ‘సీటు’ కూడా వదలుకుంటామన్నారు. ఎవరూ వదలుకోలేదు లెండి. తిరిగి ఎన్నికవుతామన్న ‘ఉప ఎన్నికల బీమా’ పథకం కింద మళ్ళీ, మళ్ళీ అ సీట్లలోనే కూర్చున్నారు. ఈ సీట్లనే శాశ్వతం చేస్తామనో, ఇంతకు మించి పెద్ద సీట్లు వేస్తామనో హామీలు దొరికిన వెంటనే, ‘మాట’లు మారిపోయాయి. ‘ప్రత్యేకం’ చేస్తానన్నా పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి వుంటానని ‘సమైక్యాంధ్ర’ ఉద్యమ సారథులూ అంటున్నారు. ‘ప్యాకేజీ’కి కొందరూ, ‘రాయల తెలంగాణ’కి కొందరూ ‘ఊ’ కొట్టటానికి అగ్ర తెలంగాణ నేతలు సైతం సిధ్ధమవుతున్నారు. కాబట్టి మొత్తం ప్రజాస్వామ్యమే మాట మీద నిలబడటం లేదూ- అని మనం గ్రహించాలి.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 30 జూన్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

2 comments for “మాట వున్నది, తప్పటానికే!!

Leave a Reply